సాక్షి, గుంటూరు: ‘సంక్రాంతి పండగ ప్రత్యేక ఆఫర్లు...అన్ని చీరలపైనా ఆకర్షణీయమైన ఆఫర్లు...ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపైనా రూ.200 గిఫ్ట్ ఓచర్ ఉచితం...ఈ ఆఫర్లు మూడు రోజుల వరకే. త్వర పడండి...’ గుంటూరు వస్త్ర వ్యాపారంలో ఆఫర్ల హడావుడి ఇది. పేరున్న ప్రఖ్యాత వస్త్ర దుకాణాలతో పాటు చిన్నచిన్న క్లాత్ షోరూమ్‌లు కూడా పండగ ఆఫర్లతో హోరెత్తిస్తున్నాయి. కొనుగోలుదారుల్ని ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు వ్యాపారులు డిస్కౌంట్ల మాయలో నాసిరకం సరుకును అమ్ముతున్నారు. పల్లెటూళ్ల నుంచి వచ్చే కొనుగోలుదారులు దీన్ని గుర్తించలేక నష్టపోతున్నారు.
రూ.10 కోట్ల వ్యాపారం
ఏటా సంక్రాంతి పండగకు గుంటూరు మార్కెట్‌లో సుమారు రూ.10 కోట్ల వస్త్ర వ్యాపారాలు జరుగుతాయి. ఈ ఏడాది అంతకన్నా ఎక్కువగానే అమ్మకాలు జరుగుతాయని వ్యాపారవర్గాలు అంచనా వేశాయి. రెండు వారాల ముందుగానే పెద్ద మొత్తంలో చీరలు, రెడీమేడ్ డ్రెస్సులు, ఇతరత్రా దిగుమతి చేసుకున్నారు. ఐదో తేదీ నుంచి పండగ కొనుగోళ్లు మొదలయ్యాయి. గుంటూరులోని కొత్తపేట, పాతబస్టాండ్, వాసవీహోల్‌సేల్ క్లాత్ మార్కెట్, బ్రాడీపేట, అరండల్‌పేట, శంకర్‌విలాస్ సెంటర్, లక్ష్మీపురం ప్రాంతాల్లోని పలు వస్త్ర దుకాణాలు పండగ సందర్భంగా 20 నుంచి 40 శాతం డిస్కౌంట్లు ప్రకటించాయి.
అన్ని రకాల చీరల కొనుగోళ్లపైనా ఆఫర్లు అంటూ బోర్డులు, కరపత్రాలతో ప్రచారం చేశారు. పట్టు, చందేరీ కాటన్, క్రేప్, నెట్టెడ్, క్రేప్ జార్జెట్, ఫ్యాన్సీ, డిజైన్ శారీస్ అన్నింటికీ వివిధ షాపుల యజమానులు 20 శాతం డిస్కౌంట్లను ప్రకటించారు. వాటికి ప్రత్యేక ధరలతో కూడిన స్టిక్కర్లను అంటించి విక్రయాలు జరుపుతున్నారు. అయితే కొందరు వ్యాపారులు డిస్కౌంట్ల ఎర చూపుతూ డ్యామేజీ సరుకును కూడా విక్రయిస్తున్నారు. వినియోగదారులకు డ్యామేజీలను చూపకుండా తక్కువ ధరకంటూ అంటగడుతున్నారు. స్తంభాలగరువు ప్రాంతానికి చెందిన ఓ మహిళ వాసవీ హోల్‌సేల్ క్లాత్ బజారులో ఉన్న ఓ దుకాణంలో రెండు రోజుల కిందట మూడు రెడీమేడ్ డ్రెస్సులు కొనుగోలు చేసింది.
వాటిని ఇంటికెళ్లి పరిశీలించగా డ్యామేజీలు బయటపడ్డాయి. తిరిగి షాపు వద్దకు వెళ్లగా ఆ దుస్తుల్ని వాపసు తీసుకునేందుకు షాపు యజమాని అంగీకరించలేదు. అదేవిధంగా అరండల్‌పేట, బ్రాడీపేట సెంటర్లలోని కొన్ని పేరున్న చీరల దుకాణాలు కూడా డ్యామేజీ చీరల్ని విక్రయిస్తున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే ‘కొనేటపుడు ముందే చూసుకోవాలంటూ ఆ షాపుల యజమానులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. పండగ హడావుడిలో ధర కుదుర్చుకోవడంలో మునిగిపోతున్న కొనుగోలుదారులు వస్త్రాలన్నింటినీ పూర్తిగా విప్పదీసి చూసుకోవడం సాధ్యం కాని పని. దీన్ని వ్యాపారానికి అనువుగా మార్చుకుంటున్న కొందరు వ్యాపారులు క్రిస్మస్ పండగ నుంచి అమ్ముడుపోని పాత సరుకును తాజాగా డిస్కౌంట్ల మాయలో విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు జాగ్రత్తలు పాటించకపోతే నష్టపోవడం ఖాయం.
డిస్కౌంట్ల మాయ
Published Mon, Jan 13 2014 12:38 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
Advertisement
Advertisement