
కందుకూరు: భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే సంస్థ పేరుతో భక్తులను మోసం చేశారని బాధితులు వాపోతున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ టీటీడీకి అనుబంధంగా పనిచేస్తుంది. తిరుపతి సహా టీటీడీకి చెందిన దేవాలయాల్లో ఉచితంగా వారం రోజుల పాటు సేవ చేసే అవకాశాన్ని ఈ సంస్థ కల్పిస్తుంది. దీనిలో భాగంగా ముందుగానే పలు ప్రాంతాల్లో దేవుని సేవ చేసేందుకు ముందుకు వచ్చే భక్తులకు శిక్షణ ఇస్తుంది. ఇదిలా ఉండగా గత ఏడాది జూలైలో కందుకూరులోని కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో 170 మంది ఆర్యవైశ్య భక్తులకు శిక్షణ ఇచ్చారు.
ఖర్చుల పేరుతో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 350 చొప్పున రూ. 59,500 వసూలు చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సంస్థ తరఫున ఐడీ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా వీరు తిరుపతిలో శ్రీవారి సేవలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు వీరికి ఐడీ కార్డులు ఇవ్వలేదు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థకు కార్యదర్శిగా ఉన్న సుబ్బారావు ఇలా మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఫోన్ చేసి అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరుతో పాటు ఒంగోలు, చీమకుర్తి, కనిగిరి జిల్లాలోని తదితర ప్రాంతాల్లో వందల మంది నుంచి డబ్బులు వసూలు చేసి సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. దేవుని పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇటువంటి వారిని శిక్షించాలని పట్టణంలోని శిక్షణ పొందిన ఆర్యవైశ్య భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
చర్యలు తీసుకోవాలి
ఈ ఘటనపై బాధితులు ఎం. రమేష్, టి. వెంకట్, డి.మల్లికార్జున తదితరులు శనివార ం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. దేవుని సేవలో తరిస్తామనుకుంటే ఇలా అన్యాయం జరిగిందని వాపోయారు.
త్వరలోనే కార్డు ఇస్తాం:
మా సంస్థ కార్యాలయం గతంలో హైదరాబాద్‌లో ఉండేది. ప్రస్తుతం విజయవాడలోని ఇబ్రహీంపట్నంలోకి మార్చారు. దీనివల్ల ఐడీ కార్డులు అందజేయడంలో జాప్యం జరిగింది. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికీ త్వరలోనే కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటా.
– సుబ్బారావు,
భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ కార్యదర్శి