
'మోసం చేయడం చంద్రబాబు నైజం'
- పెద్దమాదిగను అవుతానని మాదిగలను పెద్ద మోసం చేశారు
- తెలంగాణలో వర్గీకరణ తీర్మానం చేసిన టీడీపీ ఏపీలో ఎందుకు చేయదు
- 14న విజయవాడలో మాదిగల విశ్వరూప మహాసభ
- 16 నుంచి తెలంగాణలో దండయాత్ర కార్యక్రమాలు
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ
కందుకూరు: ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగలకు పెద్ద మాదిగ అవుతానని చెప్పి..ఇప్పుడు పెద్ద మాలలను దగ్గరకు తీసి నమ్మిన మాదిగలను నట్టేట ముంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దక్కుతుందని, మోసం చేయడమే చంద్రబాబు నైజంగా మారిపోయిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ధ్వజమెత్తారు.
మోసం, దగ, ద్వంద్వ విధానాలు చంద్రబాబుకు అలవాటన్నారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం ప్రకాశం జిల్లా కందుకూరు వచ్చిన ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్టుహౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్గీకరణ చేపట్టి పెద్దమాదిగ అవుతావో లేక మాదిగల ద్రోహిగా, మోసగాడిగా నిలబడతావో తేల్చుకోవాలని చంద్రబాబుకు సూచించారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో చంద్రబాబు పాదయాత్ర చేసేందుకు ఎమ్మార్పీఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. వర్గీకరణను అమలు చేసి చెప్పులు కుట్టిన చేతులతో చరిత్ర తిరగరాయిస్తానని అని ప్రగల్బాలు పలికారని వివరించారు. ఇన్ని విధాలుగా మోసం చేసిన చంద్రబాబును మాదిగలు క్షమించరన్నారు. తెలంగాణలో వర్గీకరణ తీర్మానం కోసం పట్టుబట్టిన టీడీపీ, అధికారంలో ఉన్న ఏపీలో మాత్రం వర్గీకరణ ఎందుకు చేయడం లేదని ధ్వజమెత్తారు.
టీడీపీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబునాయుడు తెలంగాణలో ఒక విధానం, ఏపీలో ఒక విధానం అనుసరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మాదిగలకు శక్తిని చాటేందుకు ఈనెల 14న విజయవాడలో మాదిగల విశ్వరూప సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు చంద్రబాబునాయుడుతో సహా అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు మాదిగలపై పగబట్టారని, ఆయన పగ తీర్చుకునే క్రమంలోనే మాదిగ సామాజికవర్గానికి చెందిన మంత్రి టి.రాజయ్యని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని మందకృష్ణమాదిగ అన్నారు.
మంత్రులపై పత్రికల్లో వార్తలు వస్తే ఆ పత్రికలపై కోర్టు కేసులు వేయాలని కేసీఆర్ చెప్తున్నారే తప్పా మంత్రులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు ఈనెల 16వ తేదీ నుంచి తెలంగాణలో దండయాత్ర కార్యక్రమాలు చేపడతామన్నారు. ఏప్రిల్ 4వ తేదీన లక్షలాది మంది మాదిగలతో కేసీఆర్ ఇంటిపై దండయాత్ర చేపడతామన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పల్లి మాణిక్యాలరావుమాదిగ, రాష్ట్ర నాయకులు సూరపోగు శ్యామ్‌మాదిగ, జిల్లా ప్రధానకార్యదర్శి వర్లదేవదాసుమాదిగ పాల్గొన్నారు.