- సైరన్ మోగిస్తూ కాన్వాయ్ ఏర్పాటు
- ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన పోలీసులు
- ఎంపీని పట్టించుకోని వైనం
- పోలీసుల తీరును జీర్ణించుకోలేని ఓ వర్గంతెలుగు తమ్ముళ్లు
చంద్రగిరి:నియోజకవర్గంలో పోలీసుల పనితీరు బ్రిటీష్ పాలనను తలపిస్తోంది. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీగా గోపినాథ్ జట్టి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జిల్లాలో ప్రశాంత వాతావరణం నెల కొంది. ఎర్రచందనం అక్రమ రవాణా ను నిలువరించడంలో విజయం సా ధించారు. చంద్రగిరి నియోజకవర్గం లో మాత్రం అర్బన్ ఎస్పీ పాలన కని పించడంలేదు.
ప్రజాప్రతినిధులను చంద్రగిరి పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టవర్‌క్లాక్ వద్ద ఆదివారం ఎన్‌టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు నారమల్లి శివప్రసాద్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల లో ఓటమి పాలైన మాజీ మంత్రికి పోలీసులు సీఐ శివప్రసాద్ నేతృత్వంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి హంగామా సృష్టించారు. ఎంపీ, మాజీ మంత్రి ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎంపీ పాకాలలో కార్యక్రమానికి బయల్దేరినా పోలీసులు పట్టించుకోలేదు. కొద్దిసేపటి తర్వాత మాజీ మంత్రి గల్లా కూడా పాకాలకు పయనమయ్యారు. పోలీసులు కాన్వాయ్‌ని ఏర్పాటు చేసి సైరన్ మోగిస్తూ రోడ్డుపై వాహనాలను పక్కకు పంపిస్తూ హంగామా సృష్టించారు. ఆమెను రాచమర్యాదలతో సాగనంపారు. పార్లమెంట్ సభ్యుడిని మాత్రం పట్టించుకోకుండా ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికిపోలీసులు చేసిన రాచమర్యాదలను టీడీపీ నాయకులు సైతం జీర్ణించుకోలేపోతున్నారు.
ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోలీసులు మాత్రం సైరన్ మోగిస్తూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం కల్పించడానికి జిల్లా ఎస్పీ తీవ్ర కృషి చేస్తుంటే, చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం పోలీసులు మాజీ మంత్రి మెప్పు కోసం నానా హంగామా చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఒక వర్గం టీడీపీ నాయకులు సైతం కోరుతున్నారు.