కర్నూలు(రాజ్‌విహార్),న్యూస్‌లైన్: నగరంలోని రైల్వే గేట్ల వద్ద నిరీక్షణ కష్టాలు త్వరలోనే దూరం కానున్నాయని రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. వీటితోపాటు రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. నగరంలోని కోట్ల రైల్వే స్టేషన్‌లో కొత్తగా నిర్మించిన ఫుల్ బేస్ ప్లాట్‌ఫాం, అధికారుల గదిని ఆయన శనివారం ప్రారంభించారు. గుత్తిరోడ్డులోని రైల్వేగేటు వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జీ (ఆర్‌ఓబీ), కృష్ణానగర్ గేటు వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం గాయత్రి ఎస్టేట్ పార్కులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
సభలో ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, డీసీసీ అధ్యక్షులు బీ.వై. రామయ్య, పార్టీ నాయకులు బుచ్చిబాబు తమ ప్రసంగాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలింపించాలంటూ ప్రజలను కోరుతూ అధికారిక కార్యక్రమాన్ని కాస్త రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. అనంతరం మంత్రి కోట్ల మాట్లాడుతూ తాన బాధ్యతలు తీసుకున్న తర్వాత కర్నూలుతోపాటు రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైళ్ల రాకపోకల సమయంలో గేట్ల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి ఉందని, ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. కోట్లా హాల్ట్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జీ ఏర్పాటుకు ప్రతిపాదన ఉందని చెప్పిన మంత్రి.. మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి హైదరాబదు డివిజన్‌కు లక్ష రూపాయల అవార్డు ప్రకటించారు.
ప్రజలకు సమాధానం
చెప్పలేకపోతున్నాం.. కాటసాని
రాష్ట్రాన్ని విభజించి సోనియా గాంధీ సీమాంధ్రులకు తీరని అన్యాయం చేశారని, ఈ కారణంగా ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నామని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు.
30 ఏళ్లపాటు పార్టీలోనే ఉండి ప్రజలకు సేవ చేసినా ప్రస్తుత పరిస్థితి కారణంగా ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉండాల్సి వస్తోందని ఆవేదన చెందారు. కార్యక్రమంలో రైల్వే ఏజీఎం సునిల్ అగర్వాల్, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, జాయింట్ కలెక్టర్ కన్నబాబు, డీసీసీ అధ్యక్షుడు బీవై రామయ్యా, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ మూర్తి, రైల్వే డివిజినల్ మేనేజరు రాకేష్ అరోన్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారుల పాల్గొన్నారు.
గేట్ల వద్ద నిరీక్షణకు చెక్ పెడతాం
Published Sun, Feb 23 2014 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM
Advertisement
Advertisement