సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేయగా.. ఇసుకను వినియోగదారులకు చేరవేసే వాహనాలకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) పరికరాలను తప్పనిసరి చేయనుంది. రీచ్ నుంచి ఇసుకను తీసుకెళ్తున్న వాహనం స్టాక్ పాయింట్‌కు వెళుతుందా? లేక పక్కదారి పట్టిందా? అనే వివరాలను ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేసేందుకు వీలు కలగనుంది. జీపీఎస్‌ను తప్పనిసరిగా సోమవారం(25వ తేదీ) నుంచి అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
జీపీఎస్ అమర్చుకోవాల్సిందే..
‘‘ఇసుక రీచ్ నుంచి స్టాక్ పాయింట్‌కు ఇసుకను తీసుకెళ్లే అన్ని వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చాలని ఆదేశాలు అందాయి. స్టాక్ పాయింట్ నుంచి బల్క్ ఆర్డర్లకు సరఫరా చేసే వాహనాలకు కూడా జీపీఎస్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని కాంట్రాక్టు సంస్థలకు స్పష్టం చేశాం’’
– మునిస్వామి, ఏపీఎండీసీ జిల్లా మేనేజర్, అనంతపురం
జీపీఎస్‌తో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
నదుల్లో వరదలు తగ్గిపోవడంతో ప్రస్తుతం రీచ్‌ల్లో పూర్తిస్థాయిలో ఇసుక వెలికితీసేందుకు అవకాశం ఏర్పడింది. రీచ్ నుంచి వెలికితీసిన ఇసుకను మొదట స్టాక్ పాయింట్‌కు తరలిస్తున్నారు. ఏయే స్టాక్ యార్డు నుంచి ఏయే స్టాక్ పాయింట్‌కు ఇసుకను తరలించాలనేది అధికారులు నిర్ణయిస్తున్నారు. ప్రధానంగా దగ్గరలోని స్టాక్ పాయింట్లను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం ఇసుక యార్డు నుంచి ఇసుకను తీసుకెళ్లిన టిప్పర్లు నేరుగా స్టాక్ పాయింట్‌కు వెళుతున్నాయా? లేక పక్కదారి పడుతున్నాయా అనేదానిపై పర్యవేక్షణ నిరంతరం జరగడం లేదు.
ఈ నేపథ్యంలో సదరు వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చడం ద్వారా ఎప్పటికప్పుడు దాన్ని ట్రాక్ చేసే వీలుంటుంది. రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకెళ్లే వాహనాలను అమరావతిలోని కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. తద్వారా రీచ్‌లో వెలికితీసిన ఇసుక కచ్చితంగా స్టాక్ పాయింట్‌కు చేరనుంది. అంతేకాకుండా బల్క్ ఆర్డర్లకు ఇసుక సరఫరా చేసే వాహనాలకు కూడా జీపీఎస్ అమర్చడం ద్వారా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నేరుగా వినియోగదారుడికే ఇసుక చేరనుంది.
Comments
Please login to add a commentAdd a comment