ఘట్‌కేసర్‌టౌన్/కుల్కచర్ల/యాచారం,న్యూస్‌లైన్: గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికైన వారికి ఇంకా ‘పవర్’ దక్కలేదు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ఎన్నికైన సర్పంచ్‌లందరూ ఈ నెల 2వతేదీన బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే గ్రామాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ఉవ్విళ్లూరుతున్న కొత్త సర్పంచ్‌ల ఉత్సాహంపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. ప్రత్యేకాధికారులు, కార్యదర్శుల నుంచి ఇప్పటికీ వీరికి పంచాయతీ రికార్డులు అందకపోవడంతో నిస్సహాయ స్థితిలో పడ్డారు. గతంలో సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యుల్లో ఒక్కరికి చెక్‌పవర్ అధికారాన్ని కల్పించేవారు. కాగా ఈ సారి ఎవరికి, ఏ విధంగా చెక్‌పవర్ ఇవ్వాలో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో కార్యదర్శులు నూతన సర్పంచ్‌లకు రికార్డులు అప్పగించలేదు. దీంతో చాలా గ్రామాల్లో సర్పంచ్‌లు వీధి దీపాల ఏర్పాటుకు, మురుగు కాల్వల శుభ్రానికి అలాగే తాగునీటి సరఫరాకు సొంత డబ్బులు వెచ్చించి పనులు చేయిస్తున్నారు.
ఉత్సవ విగ్రహాల్లా...
బాధ్యతలు చేపట్టిన రోజునే పంచాయతీ రికార్డులు అందజేయాల్సి ఉండగా వారంరోజులు దాటినా అవి అందకపోవడంతో ఏ పని చేపట్టాలో తెలియక సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాల్లా మారారు. అసలు పంచాయతీలో జనరల్ ఫండ్ ఎంతుంది.. ప్రభుత్వమిచ్చిన నిధులెన్ని.. వసూలైన పన్నులు... వేటికి ఎంత ఖర్చు చేశారు, ఎవరికెంత చెల్లించాలి? వంటివి తెలియక సర్పంచ్‌లు అయోమయానికి గురవుతున్నారు. ప్రత్యేకాధికాధికారుల పాలనలో గ్రామాలకు వచ్చిన నిధులు, చేసిన ఖర్చులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయనున్నట్టు కుల్కచర్ల మండలంలోని పలువురు సర్పంచ్‌లు తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిలిచిపోయిన వేతనాలు
ప్రతి నెల మొదటి వారంలో పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు ఆగిపోయాయి. పంచాయతీల్లో పన్నుల రూపంలో వసూలైన డబ్బులను బ్యాంకుల్లో జమ చేస్తారు. ప్రతి చెల్లింపు చెక్కుల రూపేణా జరగాలి. అయితే సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వకపోవడంతో నిధులను డ్రా చేసే అవకాశం లేకుండాపోయింది. దీంతో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెండింగ్‌లో పడ్డాయి.
లెక్కల్లేవ్...
ఇదిలా ఉంటే ప్రత్యేకాధికారుల పాలనలో చాలా పంచాయతీలో నిధులు, ఖర్చుల లెక్కలు సక్రమంగా లేనట్టు తెలుస్తోంది. యాచారం మండలంలో అంతోఇంతో ఆదాయం ఉండే యాచారం, మాల్, గునుగల్, నందివనపర్తి, నక్కర్తమేడిపల్లి, చింతపట్ల, తమ్మలోనిగూడ తదితర గ్రామాల్లో రికార్డుల నమోదు గందరగోళంగా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. యాచారం గ్రా మంలో రికార్డులు ఇవ్వకుండా సర్పంచ్‌కు బోరుబావుల మోటార్లు, పైపులు చూపించి అధికారులు చేతులు దులుపుకున్నారు.
ప్రత్యేకాధికారుల్లో ఆందోళన...
నూతన సర్పంచ్‌లు రికార్డులు అందజేయాలని పట్టుపడుతుండటంతో ప్రత్యేకాధికారుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా యాచారం, మాల్, గునుగల్, నందివనపర్తి, తక్కళ్లపల్లి, తమ్మలోనిగూడ తదితర గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనలో వెంచర్లకు అనుమతులు ఇవ్వడం, అవి కూడ పాత సర్పంచ్‌ల సంతకాలతో రికార్డులు నమోదు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రికార్డులు ఇవ్వకుండా... వాటిని ప్రత్యేకాధికారులు కార్యదర్శులతో తమ వద్దకు తెప్పించుకొని సరిచేయిస్తున్నట్టు కూడా ఆరోపణలు వినవస్తున్నాయి.
బోరు మోటార్లు మాత్రమే చూపించారు
పంచాయతీలో పైసలు ఎన్ని ఉన్నాయని అడిగితే లెక్క చెప్పకుండా వీటికి ఖర్చయినాయని బిగించిన బోరుమోటార్లు, వేసిన పైపులు చూపించారు. ఎన్ని వెంచర్లకు అనుమతులు ఉన్నాయి, చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధుల రికార్డులు త్వరలోనే ఇస్తామని అన్నారు.
- మారోజ్ కళమ్మ, యాచారం సర్పంచ్
ప్రభుత్వం స్పందించాలి
రికార్డులు ఇవ్వకపోవడంతో ఏ పని చేపట్టాలో తెలియం లేదు. ఖర్చయిందెం త, ఎన్ని నిధులు ఉ న్నాయో కూడా చెప్ప డం లేదు. చెక్‌పవర్ ఎవరెవరికిస్తారోనన్నది కూడా అధికారుల దగ్గరే సమాచారం లేదు. ప్రభుత్వం స్పందించి చెక్ పవర్ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలి.
- గాంధారి లక్ష్మీనారాయణ,
పోచారం సర్పంచ్, ఘట్‌కేసర్
సర్పంచ్‌ల పవర్‌కు చెక్!
Published Sun, Aug 11 2013 4:38 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement