తనిఖీల్లో రూ.12 లక్షలు స్వాధీనం
లంకలకోడేరు (పాలకొల్లు అర్బన్), న్యూస్‌లైన్ : ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు తనిఖీలు చేస్తూ భారీ మొత్తంలో నగదు, మద్యంను స్వాధీనం చేసుకుంటున్నారు. మంగళవారం జిల్లాలో సుమారు రూ.12 లక్షలు వరకు నగదు పట్టుకున్నారు.
రాత్రి పాలకొల్లు-భీమవరం జాతీయ రహదారిపై లంకలకోడేరు వద్ద మోటార్ బైక్‌పై వెళుతున్న యువకుడి నుంచి సుమారు రూ.5.96 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్ మేజిస్టీరియల్ ఆఫీసర్ కె.జయరాజు లంకలకోడేరు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మొగల్తూరు మండలం శేరేపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి వాసు మణికంఠ మోటార్ బైక్‌పై బ్యాగ్‌తో వెళుతుండగా అనుమానం వచ్చి తనిఖీ చేశారు.
అతని వద్ద రూ.5,96,900లు(500నోట్లు) లభించాయి. సొమ్ముకు సంబంధించి లెక్కలు ఆరా తీయగా వాసు మణికంఠ సరైన సమాధానం చెప్పకపోవడంతో నగదును సీజ్ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.సూర్యనారాయణ, తహసిల్దార్ మహ్మద్ యూసఫ్ జిలానీ, రూరల్ సీఐ ఎ.చంద్రశేఖర్ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
నగదును ఆదాయపన్ను అధికారుల ద్వారా వివరాలు సేకరించి ట్రెజరీలో డిపాజిట్ చేస్తామన్నారు. నగదుకు సంబంధించి రుజువులు చూపిస్తే తిరిగి ఆ నగదును సంబంధిత వ్యక్తికి అందజేస్తామన్నారు. ఎస్సై ఐ.వీర్రాజు, ఆర్‌ఐ కె.సుబ్బారావు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ బీఎస్‌ఎల్ మంగకుమారి పాల్గొన్నారు.
సమిశ్రగూడెంలో రూ.4.12 లక్షలు..
సమిశ్రగూడెం(నిడదవోలు రూరల్) : సమిశ్రగూడెం చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం వాహానాలను తనిఖీ చేస్తున్న పోలీసులు కారులో తరలిస్తున్న రూ.4.12 లక్షల నగదును గుర్తించి పట్టుకున్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరు నుంచి కాళ్ల మండలం కలవపల్లికి వెళుతున్న కారును తనిఖీ చేయగా నగదును గుర్తించినట్లు ఎస్సై ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్ తెలిపారు. నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకుని మండల మేజిస్ట్రేట్ ,త హసిల్దార్ ప్రసన్నలక్ష్మికి అప్పగించినట్లు చెప్పారు.
ఏలూరులో రూ.2 లక్షలు..
ఏలూరు(టూటౌన్) : ఏలూరులో సెయింట్ ఆన్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసి చెక్‌పోస్ట్ వద్ద కారులో తరలిస్తున్న రూ.2 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన సూర్యదేవర శ్రీనివాసరావు ఏలూరు నుంచి నూజివీడుకు రూ.2 లక్షల నగదును తీసుకెళ్తుండగా మంగళవారం సాయంత్రం చెక్‌పోస్టు వద్ద పోలీసులు కారును ఆపి తనిఖీ చే శారు.
నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలను శ్రీనివాసరావు చూపకపోవడంతో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకుని త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావు అప్పగించారు. సీఐ ఏలూరు తహసిల్దార్‌కు స్వాధీనపరిచారు.