Palakol
-
కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
పాలకొల్లు సెంట్రల్ : కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. బుధవారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో పాలకొల్లు జట్లు, మిల్లు కార్మిక సంఘం 74వ వార్షికోత్సవ వేడుకలకు మంత్రి పితాని, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు అల్లు సత్యనారాయణ, బంగారు ఉషారాణిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పితాని మాట్లాడుతూ కార్మికుడికి భద్రత కల్పించాలి్సన బాధ్యత యాజమాన్యానికి , ప్రభుత్వానికి కూడా ఉందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలని ఆలోచిస్తుంటే.. కాలుష్యం పేరుతో వాటిని అడ్డుకోవడానికి కొందరు ఉద్యమాలు చేస్తున్నారన్నారు. కార్మికుడు లేకుండా యాజమాన్యం లేదు.. యాజమాన్యం లేకుండా కార్మికుడు లేడని చెప్పారు. ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నడుచుకున్నప్పుడే సమస్యలు రావని సూచించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు 4 లక్షల మంది కార్మికులు ఉండగా నేడు సుమారు 14 లక్షల మంది కార్మికులు ఈఎస్ఐ మెంబర్లుగా ఉన్నారని తెలిపారు. ఇక నుంచి ఈఎస్ఐ సభ్యుడిగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలి్సన అవసరం లేదని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని అన్నారు. జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు అల్లు సత్యనారాయణ, బంగారు ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
నాడు జెయింట్ కిల్లర్.. నేడు?
అవి.. చిరంజీవి కొత్తగా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజులు. చిరంజీవి సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు కాగా, ఆయన అత్తవారి ఊరు ఆ పక్కనే ఉండే పాలకొల్లు. చిరంజీవి తన అత్తవారి ఊరైన పాలకొల్లుతో పాటు ఎందుకైనా మంచిదని తిరుపతి నుంచి కూడా అసెంబ్లీకి పోటీ చేశారు. తాను పుట్టి పెరిగిన జిల్లా కావడం, అత్తవారి ఊళ్లో ముందునుంచి స్థానబలం ఉండటంతో పాలకొల్లులో సులభంగా గెలవగలనని భావించారు. ప్రచారం మీద కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున బంగారు ఉషారాణిని అభ్యర్థినిగా రంగంలో నిలిచారు. ఆమె మీద అప్పట్లో అంతగా అంచనాలు కూడా లేవు. ఎన్నికలు జరిగాయి. చిరంజీవి రెండుచోట్లా బంపర్ మెజారిటీతో గెలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఫలితం తలకిందులైంది. తన సొంత ఊరి లాంటి పాలకొల్లులో చిరంజీవి ఓ మహిళ చేతిలో దారుణంగా ఓడిపోయారు. అది కూడా ఏదో అంతంత మాత్రం మెజారిటీ కాదు.. ఐదు వేలకు పైగా ఓట్ల తేడా! దాంతో ఒక్కసారిగా బంగారు ఉషారాణి పేరు రాష్ట్ర రాజకీయాల్లో మార్మోగిపోయింది. జెయింట్ కిల్లర్ ఉషారాణి అంటూ జాతీయ మీడియా కూడా అప్పట్లో ఆమె గురించి రాసింది. ఆ ఎన్నికల్లో ఉషారాణికి 49,720 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన చిరంజీవి 44,274 ఓట్లు మాత్రమే పొందగలిగారు. అంటే, వీరిద్దరి ఓట్ల మధ్య తేడా 5,446 అన్నమాట. మూడో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి సీహెచ్ సత్యనారాయణ మూర్తి (డాక్టర్ బాబ్జీ)కి 29,371 ఓట్లు వచ్చాయి. తర్వాత క్రమంగా ఆమెకు ప్రజలతో సంబంధాలు తగ్గిపోయాయి. పెద్దగా జనంలో తిరగలేదు. తనకు కావల్సిన వాళ్లకు పదవులు ఇప్పించుకోడానికి మాత్రం ప్రయత్నించారన్న విమర్శలు ఎక్కువగా వచ్చాయి. తనకు సలహాదారుగా వ్యవహరించిన ఓ మాజీ పాత్రికేయుడికి నామినేటెడ్ పదవి ఇప్పించుకోవడంలో ఆమె సఫలీకృతులయ్యారు. అయితే.. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఒకవేళ ఉషారాణికి టికెట్ రాకపోతే తాను పోటీ చేస్తానంటూ అదే వ్యక్తి ఉత్సాహం చూపుతున్నారని వినికిడి. ఉషారాణి మాత్రం పోటీ చేసినా ఈసారి ఎన్నోస్థానంలో ఉంటారనేది అనుమానమేనని స్థానికులు అంటున్నారు. డిపాజిట్ దక్కకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. జెయింట్ కిల్లర్ కాస్తా.. ఈసారి నామమాత్రంగా మిగిలిపోతారని వినిపిస్తోంది. -
తనిఖీల్లో రూ.12 లక్షలు స్వాధీనం
లంకలకోడేరు (పాలకొల్లు అర్బన్), న్యూస్‌లైన్ : ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు తనిఖీలు చేస్తూ భారీ మొత్తంలో నగదు, మద్యంను స్వాధీనం చేసుకుంటున్నారు. మంగళవారం జిల్లాలో సుమారు రూ.12 లక్షలు వరకు నగదు పట్టుకున్నారు. రాత్రి పాలకొల్లు-భీమవరం జాతీయ రహదారిపై లంకలకోడేరు వద్ద మోటార్ బైక్‌పై వెళుతున్న యువకుడి నుంచి సుమారు రూ.5.96 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్ మేజిస్టీరియల్ ఆఫీసర్ కె.జయరాజు లంకలకోడేరు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మొగల్తూరు మండలం శేరేపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి వాసు మణికంఠ మోటార్ బైక్‌పై బ్యాగ్‌తో వెళుతుండగా అనుమానం వచ్చి తనిఖీ చేశారు. అతని వద్ద రూ.5,96,900లు(500నోట్లు) లభించాయి. సొమ్ముకు సంబంధించి లెక్కలు ఆరా తీయగా వాసు మణికంఠ సరైన సమాధానం చెప్పకపోవడంతో నగదును సీజ్ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.సూర్యనారాయణ, తహసిల్దార్ మహ్మద్ యూసఫ్ జిలానీ, రూరల్ సీఐ ఎ.చంద్రశేఖర్ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. నగదును ఆదాయపన్ను అధికారుల ద్వారా వివరాలు సేకరించి ట్రెజరీలో డిపాజిట్ చేస్తామన్నారు. నగదుకు సంబంధించి రుజువులు చూపిస్తే తిరిగి ఆ నగదును సంబంధిత వ్యక్తికి అందజేస్తామన్నారు. ఎస్సై ఐ.వీర్రాజు, ఆర్ఐ కె.సుబ్బారావు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ బీఎస్ఎల్ మంగకుమారి పాల్గొన్నారు. సమిశ్రగూడెంలో రూ.4.12 లక్షలు.. సమిశ్రగూడెం(నిడదవోలు రూరల్) : సమిశ్రగూడెం చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం వాహానాలను తనిఖీ చేస్తున్న పోలీసులు కారులో తరలిస్తున్న రూ.4.12 లక్షల నగదును గుర్తించి పట్టుకున్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరు నుంచి కాళ్ల మండలం కలవపల్లికి వెళుతున్న కారును తనిఖీ చేయగా నగదును గుర్తించినట్లు ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్‌కుమార్ తెలిపారు. నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకుని మండల మేజిస్ట్రేట్ ,త హసిల్దార్ ప్రసన్నలక్ష్మికి అప్పగించినట్లు చెప్పారు. ఏలూరులో రూ.2 లక్షలు.. ఏలూరు(టూటౌన్) : ఏలూరులో సెయింట్ ఆన్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసి చెక్‌పోస్ట్ వద్ద కారులో తరలిస్తున్న రూ.2 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన సూర్యదేవర శ్రీనివాసరావు ఏలూరు నుంచి నూజివీడుకు రూ.2 లక్షల నగదును తీసుకెళ్తుండగా మంగళవారం సాయంత్రం చెక్‌పోస్టు వద్ద పోలీసులు కారును ఆపి తనిఖీ చే శారు. నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలను శ్రీనివాసరావు చూపకపోవడంతో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకుని త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావు అప్పగించారు. సీఐ ఏలూరు తహసిల్దార్‌కు స్వాధీనపరిచారు. -
ఎన్నికల అధికారులమంటూ.. 4 లక్షల దోపిడీ
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఓ వింత దోపిడీ జరిగింది. ఎన్నికల అధికారులమంటూ వచ్చి, కొంతమంది దొంగలు దోపిడీ చేశారు. దీంతో శ్రీరామ్ ఫైనాన్స్ సిబ్బంది లబోదిబోమంటున్నారు. తమవద్దకు వచ్చి, తాము ఎన్నికల అధికారులమని, తనిఖీలు చేయాలని చెప్పి, మొత్తం 4 లక్షల రూపాయలు దోచుకెళ్లారని చెబుతున్నారు. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్భంగా నగదు తీసుకెళ్లడంపై కఠిన నిబంధనలు ఉన్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థలో పనిచేసే గుమాస్తా స్థానిక ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేయడానికి 10 లక్షల రూపాయలు తీసుకొని వెళ్లాడు. అయితే కొంతమంది వ్యక్తులు అతడి వద్దకు వచ్చి తాము ఎన్నికల అధికారులమని, తనిఖీ చేయాలని చెప్పారు. అతడు తాను ఫలానా అని చెప్పి, బ్యాగ్ ఇవ్వగా.. వారు తనిఖీ చేసి తిరిగి ఇచ్చేశారు. అయితే, బ్యాంకులోకి వెళ్లి డిపాజిట్ చేయడానికి చూసుకోగా, బ్యాగ్‌లో 4 లక్షల రూపాయలు గల్లంతయ్యాయి. కేవలం 6 లక్షలు మాత్రమే ఉన్నాయి. దీంతో అతడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
మూడేళ్లు పింఛనిచ్చి.. ఆనక ఆపేశారు
యాళ్లవానిగరువు (పాలకొల్లు అర్బన్), న్యూస్‌లైన్: ఈమె పేరు సంది రాజ్యం. ఊరు పాలకొల్లు రూరల్ మండలంలోని యూళ్లవాని గరువు. వెనుకాముందూ ఎవరూ లేని అనాథ. 2008నుంచి మూడేళ్లపాటు నెలకు రూ.500 చొప్పున ఆమెకు పింఛను ఇచ్చారు. వీటి సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించడంతో 2011లో సదరం శిబిరం నిర్వహించి అర్ధాంతరంగా ఆమెకు పింఛను నిలిపివేశారు. నాటినుంచి నేటివరకూ ఆ అభాగ్యురాలు ప్రభుత్వ కార్యాలయూల చుట్టూ తిరుగుతూనే ఉంది. పింఛను ఇప్పించాలంటూ కనిపించిన ప్రతి అధికారినీ వేడుకుంటోంది. కుడి భుజం ఎత్తు పెరగడంతో ఆమెకు గూని వచ్చింది. గతంలో అనారోగ్యం పాలై రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. మాటలు సరిగా వినపడవు. చూపు మందగించింది. 50ఏళ్ల వయసులో ఏ పనీ చేసుకోలేకపోతోంది. దీంతో ఆమె వికలాంగ పింఛను కోసం అభ్యర్థిస్తోంది. అధికారులు దయదలచి పింఛను మంజూరు చేసి పుణ్యం కట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. -
ఉద్యమం ఎగసిపడితేనే విభజన ఆగేది
పాలకొల్లు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసిపడితేనే విభజన ప్రక్రియ ఆగుతుందని రాష్ట్ర రైతు జేఏసీ అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మంగళవారం స్థానిక గాంధీబొమ్మల సెంటర్లో నిర్వహించిన రైతు సమైక్య గర్జన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర విభజన విషయంపై రైతులు తీవ్రంగా స్పందించకపోతే పెనుముప్పు తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమంలో రైతులు కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంత రాజకీయనాయకులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఐక్యమత్యంగా పనిచేస్తే సీమాంధ్ర ప్రాంతంలోని నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమబాట పట్టాలని నాగేంద్రనాథ్ డిమాండ్ చేశారు. ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సమైక్యవాదం, ఢిల్లీ పెద్దల ముందు వేర్పాటువాదాన్ని వినిపిస్తున్న సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలను తమ పదవులకు రాజీనామా చేయాలంటూ గట్టిగా నిలదీసినప్పుడే ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. సీమాంధ్ర ఎమ్మెల్యేల్లో కొంతమంది దొంగలున్నారని కేంద్రంతో ప్యాకేజీలు మాట్లాడుకుని విదేశాలకు వెళ్లేపోయే ప్రయత్నం చేస్తున్నారని అటువంటివారిని ఎట్టిపరిస్థితిలోను వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు. సభకు అద్యక్షత వహించిన జిల్లా రైతు జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఎగువ ప్రాంతంలోని ఎత్తిపోతల పథకాలు పూర్తయ్యి, విభజన జరిగితే సీమాంధ్రకు నీరు వచ్చే అవకాశం లేదని తద్వారా ఈప్రాంత భూములన్నీ బీడువారక తప్పదని అందువల్ల రైతులంతా మరింత తీవ్రంగా ఉద్యమించాలన్నారు. ఈనాటి సభలో రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు మాగంటి సీతారామస్వామి, రాష్ట్ర రైతు జేఏసీ కార్యదర్శి శ్యాంప్రసాద్‌ముఖర్జీ, రాష్ట్ర వ్యవసాయాధికారుల సంఘం అధ్యక్షుడు కె.కమలాకర్‌శర్మ, జిల్లా వ్యవసాయాధికారుల సంఘం అధ్యక్షుడు పి.మురళీకృష్ణ. మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ కృష్ణయ్య, జిల్లా రైతు జేఏసీ కార్యదర్శి పరిమి రాఘవులు, జంగం కుమారస్వామి, చిలుకూరి సత్యవతి, ఎస్ మనోరమ, యడ్ల తాతాజీ, గుమ్మాపు సూర్యవరప్రసాద్, గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, కొప్పుసత్యనారాయణ, డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి తహసిల్దార్లు పి.వెంకట్రావు, వి.స్వామినాయుడు, సీహెచ్ గురుప్రసాదరావు, ఉద్యోగసంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలు ఇవీ రైతు గర్జన సభలో ఏకగ్రీ వంగా ఆమోదించిన తీర్మానాలు ఇలా ఉన్నాయి. విభజనకు వత్తాసు పలుకుతున్న ఎంపీలు, మంత్రులను భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయ బహిష్కరణ చేస్తూ ప్రతి గ్రామ పొలిమేరల్లో బహిష్కరణ బోర్డులు పెట్టి ప్రజ లను చైతన్యవంతం చేయడం, విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతం సాగు, తాగునీరు లేక తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొంటాయి.. అందువల్ల ప్రస్తుత దాళ్వాకు పంట విరామం ప్రకటించి సమ్మెలో పాల్గొంటామని హెచ్చరించారు. గతనెలలో కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు ్రపభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలి. స్వామినాథన్ కమిషన్ సిపార్సులను అమలుచేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి. -
నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్
పాలకొల్లుటౌన్, న్యూస్‌లైన్ : కోల్‌కతా నుంచి నకిలీ కరెన్సీ నోట్లను తీసుకువచ్చి పాలకొల్లు పరిసర గ్రామాల్లో చెలామణి చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ జీవీ కృష్ణారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన దబ్బా శాంతకుమార్ రోల్డ్‌గోల్డ్ వ్యాపారంలో నష్టం వచ్చి సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో నకిలీ కరెన్సీ మారుస్తున్నాడు. శాంతకుమార్‌ను నకిలీ కరెన్సీ చెలామణికి సంబంధించి నరసాపురం, అన్నవరం, బనగాలపల్లి, సిద్దావటం, బొమ్మూరు, హైదరాబాద్‌ల్లో గతంలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిశారు. అతని తమ్ముడు దబ్బా రవికుమార్ రూ.1.50 లక్షల నకిలీ కరెన్సీ నోట్లతో పరారయ్యాడు. వీరికి సహకరిస్తున్న పట్టణానికి చెందిన బంగారు శ్రీనివాస్, దిద్దే చిట్టిబాబు, నరసాపురం పట్టణానికి చెందిన ఎస్.అప్పారావు, ఎ.పెద్దిరాజులు నరసాపురం రోడ్డులోని అయ్యప్పస్వామి గుడి వద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం అందడంతో అరెస్ట్‌చేసి వారి నుంచి రూ.20 వేలు నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. నిందితుల అరెస్ట్‌కు ఆచంట ఎస్సై బి.కృష్ణకుమార్, పట్టణ ఎస్సై జి.సుబ్బారావు, ఏఎస్సై రమేష్, సిబ్బంది సహకరించారన్నారు. -
రాజకీయ లబ్ధి కోసం విభజన తగదు
పాలకొల్లు, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర విభజనకు పూనుకోవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో నాన్‌పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు ఆదివారం 95వ రోజుకు చేరాయి. దీక్షాపరులకు శేషుబాబు సంఘీభావం తెలిపి మాట్లాడారు. దీపావళి పర్వాదినాన్న కూడా దీక్షలు నిర్వహించడం చూస్తుంటే సమైక్యాంధ్రపై సీమాంధ్రుల ఆకాంక్ష తెలుస్తుందన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కల్లబొల్లి కబుర్లు కట్టిపెట్టి ఉద్యమ తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. విభజన ప్రక్రియ ఆపకపోతే ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. విభజనకు కారకులైనవారి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. వైసీపీ శ్రేణులు గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్, యడ్ల తాతాజీ, ఎం.మైఖేల్‌రాజు, చీకట్ల వరహాలు, కె. రామచంద్రరావు, సీహెచ్ సత్తిబాబు, జె.లక్ష్మీనారాయణ, జి.రాంబాబు, మద్దా చంద్రకళ, బి.గంగాధరరావు, ఆర్.మీరయ్య, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
‘లక్ష్మీ ఫైనాన్స్’ కేసులో ముగ్గురి అరెస్ట్
పాలకొల్లు టౌన్, న్యూస్‌లైన్ : పాలకొల్లులోని లక్ష్మీ మోటార్ వెహికిల్ ఫైనాన్స్ కంపెనీ డిపాజిట్‌దారుల నుంచి రూ.1.80కోట్లు సేకరించి టోకరా వేసిన కేసులో యజమానితోపాటు ముగ్గరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను సీఐ జీవీ కృష్ణారావు విలేకరులకు మంగళవారం తెలిపారు. యలమంచిలి మండలం యలమంచిలిలంక గ్రామానికి చెందిన ఉప్పలపాటి సత్యనారాయణ పాలకొల్లులో లక్ష్మీ మోటార్ వెహికిల్ ఫైనాన్స్ కంపెనీ నడుపుతూ పలు గ్రామాల్లోని 294 మంది నుంచి రూ.1.80 కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. గత నెల 16న సత్యనారాయణ పరారవటంతో డిపాజిట్‌దారులు పాలకొల్లు సీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సత్యనారాయణ, అతని భార్య తులసీలక్ష్మి, వారికి సహకరించిన తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం మండలం అంజూరుకు చెందిన సిద్ధాంతి వలవలపల్లి కృష్ణమోహన కామేశ్వరరావును అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో పట్టణ ఎస్సై జి.సుబ్బారావు, ఆచంట ఎస్సై కృష్ణకుమార్ సహకారం అందజేశారని సీఐ చెప్పారు. ఫైనాన్స్ కంపెనీలపై నిఘా పాలకొల్లులో 58 ఫైనాన్స్ కంపెనీలున్నాయని వాటిపై నిఘా ఏర్పాటు చేశామని సీఐ తెలిపారు. ప్రజలు అధిక వడ్డీలకు ఆశపడి చట్టబద్ధత లేని ఫైనాన్స్ కంపెనీల్లో డిపాజిట్లు వేయవద్దని సీఐ సూచించారు. ఇటువంటి బోగస్ కంపెనీలు ఏమైనా ఉన్నాయని తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
రెండో రోజూ బంద్ విజయవంతం
రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో రెండోరోజూ బుధవారం బంద్ కొనసాగింది. అన్నివర్గాల ప్రజలు మద్దతు ఇచ్చి పాల్గొనడంతో బంద్ విజయవంతమైంది. జనసంచారం లేకపోవడంతో పట్టణాలు, పల్లెలు వెలవెలపోయాయి. ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయూల సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో ప్రభుత్వ సేవలు స్తంభించాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. పాలకొల్లు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రెండో రోజు బుధవారం పాలకొల్లు నియోజకవర్గం బంద్ ప్రశాంతంగా, సంపూర్ణ జరిగింది. జన సంచారం లేక పట్టణం బోసిపోయింది. వర్తక, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె కారణంగా కార్యాలయాలు బోసిపోయాయి. ఆర్టీసీ సమ్మెతో పాల కొల్లు బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. లారీలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో రోడ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. పాలకొల్లు మండలంలోని లంకలకోడేరు, దిగమర్రు, అరట్లకట్ట, యలమంచిలి మండలంలోని యలమంచిలి గ్రామాల్లో వంటా వార్పు నిర్వహించి రోడ్డు దిగ్బంధనం చేశారు. పోడూరు మండలంలోని జిన్నూరు, కవిటం గ్రామాల్లో రాస్తారోకో నిర్వహించారు. పాలకొల్లు పట్టణంలో బట్టల షాపులు, కిరాణా దుకాణాలు మూసివేయడంతో నిత్యం రద్దీగా ఉండే న్యూ క్లాత్ మార్కెట్ ఏరియా, మెయిన్‌రోడ్డు, బస్టాండ్ ప్రాంతం జనసంచారం లేక వెలవెల బోయింది. నిరసనల హోరు తణుకు : ఏపీ ఎన్జీవోల సమ్మె రెండో రోజూ నిరసనలతో హోరెత్తింది. బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. మునిసిపల్ ఉ ద్యోగులు, రెవెన్యూ, సబ్‌రిజిష్టార్, ట్రెజరీ, పంచాయతీ రాజ్ ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ తాళాలువేసి ఉ ద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. త ణుకు ఆర్టీసి ఉద్యోగులు బస్‌ల టాప్పెకైక్కి నిరసన తె లుపుతూ బస్ డిపో నుంచి పట్టణంలోని ప్రధాన రహదారుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి వివిధ సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు మోటార్ బైక్‌ల తో భారీ ర్యాలీ నిర్వహించి సోనియా గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మానవహారాలు ని ర్మించారు. తణుకు ఎన్జీవో జేఏసీ కన్వీనర్ పితాని వెం కట రమణ, కొవ్వూరు డివిజన్ జేఏసీ చైర్మన్ వైవీ సత్యనారాయణమూర్తి, డీఎన్వీ కుమార్, భాస్కరరెడ్డి , ఎ.భగవాన్,పీఎన్డీ ప్రసాద్, అశోక్‌వర్మ, చీర్ల రా ధయ్య, సంకు మనోరమ, కె. పాండురంగారావు, మారిశెట్టి శేషగిరి, బసవా రామకృష్ణ, టీ.మారుతీరావు,గుబ్బల నర్సింహరావు,గుబ్బల శ్రీనివాస్ పాల్గొన్నారు.