పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఓ వింత దోపిడీ జరిగింది. ఎన్నికల అధికారులమంటూ వచ్చి, కొంతమంది దొంగలు దోపిడీ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఓ వింత దోపిడీ జరిగింది. ఎన్నికల అధికారులమంటూ వచ్చి, కొంతమంది దొంగలు దోపిడీ చేశారు. దీంతో శ్రీరామ్ ఫైనాన్స్ సిబ్బంది లబోదిబోమంటున్నారు. తమవద్దకు వచ్చి, తాము ఎన్నికల అధికారులమని, తనిఖీలు చేయాలని చెప్పి, మొత్తం 4 లక్షల రూపాయలు దోచుకెళ్లారని చెబుతున్నారు. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్భంగా నగదు తీసుకెళ్లడంపై కఠిన నిబంధనలు ఉన్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థలో పనిచేసే గుమాస్తా స్థానిక ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేయడానికి 10 లక్షల రూపాయలు తీసుకొని వెళ్లాడు. అయితే కొంతమంది వ్యక్తులు అతడి వద్దకు వచ్చి తాము ఎన్నికల అధికారులమని, తనిఖీ చేయాలని చెప్పారు. అతడు తాను ఫలానా అని చెప్పి, బ్యాగ్ ఇవ్వగా.. వారు తనిఖీ చేసి తిరిగి ఇచ్చేశారు. అయితే, బ్యాంకులోకి వెళ్లి డిపాజిట్ చేయడానికి చూసుకోగా, బ్యాగ్లో 4 లక్షల రూపాయలు గల్లంతయ్యాయి. కేవలం 6 లక్షలు మాత్రమే ఉన్నాయి. దీంతో అతడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.