పాలకొల్లుటౌన్, న్యూస్‌లైన్ : కోల్‌కతా నుంచి నకిలీ కరెన్సీ నోట్లను తీసుకువచ్చి పాలకొల్లు పరిసర గ్రామాల్లో చెలామణి చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ జీవీ కృష్ణారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన దబ్బా శాంతకుమార్ రోల్డ్‌గోల్డ్ వ్యాపారంలో నష్టం వచ్చి సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో నకిలీ కరెన్సీ మారుస్తున్నాడు. శాంతకుమార్‌ను నకిలీ కరెన్సీ చెలామణికి సంబంధించి నరసాపురం, అన్నవరం, బనగాలపల్లి, సిద్దావటం, బొమ్మూరు, హైదరాబాద్‌ల్లో గతంలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిశారు.
అతని తమ్ముడు దబ్బా రవికుమార్ రూ.1.50 లక్షల నకిలీ కరెన్సీ నోట్లతో పరారయ్యాడు. వీరికి సహకరిస్తున్న పట్టణానికి చెందిన బంగారు శ్రీనివాస్, దిద్దే చిట్టిబాబు, నరసాపురం పట్టణానికి చెందిన ఎస్.అప్పారావు, ఎ.పెద్దిరాజులు నరసాపురం రోడ్డులోని అయ్యప్పస్వామి గుడి వద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం అందడంతో అరెస్ట్‌చేసి వారి నుంచి రూ.20 వేలు నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. నిందితుల అరెస్ట్‌కు ఆచంట ఎస్సై బి.కృష్ణకుమార్, పట్టణ ఎస్సై జి.సుబ్బారావు, ఏఎస్సై రమేష్, సిబ్బంది సహకరించారన్నారు.
నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్
Published Wed, Nov 6 2013 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement