నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు | Fake Currency Gang Arrested In Visakhapatnam | Sakshi
Sakshi News home page

నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు

Published Mon, Dec 2 2019 8:39 AM | Last Updated on Mon, Dec 2 2019 8:39 AM

Fake Currency Gang Arrested In Visakhapatnam - Sakshi

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా

సాక్షి, విశాఖపట్నం: నగరంలో నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ కరెన్సీ రూ.2వేలు, రూ.100 నోట్లను చెలామణి చేస్తుండగా హెచ్‌బీ కాలనీ దరి స్టీల్‌ ప్లాంట్‌ కళావేదిక వద్ద ముగ్గురిని  అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా మీడియాకు ఆదివారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని ఇసుకతోట ప్రాంతానికి చెందిన కడపల నాగ వెంకట సత్యనారాయణ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు శివాజీపాలెంకి చెందిన మరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బొంత పద్మారావుతో పరిచయం ఏర్పడింది. అతని మధ్యవర్తిత్వంతో చోడవరం ప్రాంతానికి చెందిన షేక్‌ అబ్దుల్‌ రెహమాన్, తూర్పు గోదావరి జిల్లాకి చెందిన సయ్యద్‌ రెహమాన్‌ల నుంచి 1:3 నిష్పత్తిలో నకిలీ కరెన్సీ (ప్రతి మూడు నకిలీ కరెన్సీ నోట్లుకి ఒక ఒరిజినల్‌ నోటు) సత్యనారాయణ తీసుకున్నాడు. ఈ నకిలీ నోట్లు మార్పిడంతా సత్యనారాయణ తన కారు డ్రైవర్‌ రౌతు జయరాం ద్వారా చేస్తుండేవాడు. నకిలీ నోట్లను షాపులు, పెట్రోల్‌ బంకుల్లో డ్రైవర్‌ సాయంతో మార్చేవాడు.

 ఎవరికీ అనుమానం రాకపోవడంతో కొద్దిరోజుల కిందట మళ్లీ చోడవరం వెళ్లి షేక్‌ అబ్దుల్‌ రెహమాన్, తూర్పు గోదావరి జిల్లాకి చెందిన సయ్యద్‌ రెహమాన్‌ల నుంచి రూ.2,96,100లు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నారని సమాచారం రావడంతో ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌ సీఐ సీహెచ్‌ షణ్ముఖరావు, ఎస్సై సూర్యనారాయణ అప్రమత్తమయ్యారు. హెచ్‌బీ కాలనీ స్టీల్‌ ప్లాంట్‌ కళావేదిక వద్దకు చేరుకోగా అప్పటికే అక్కడ సంచరిస్తున్న ముగ్గురు నిందితులు సత్యనారాయణ, పద్మారావు, జయరాంలను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.7వేలు నగదు, నకిలీ కరెన్సీ రూ.2,96,100లు, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.వీరికి నకిలీ కరెన్సీ నోట్లు అందించిన వారిని అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని సీపీ మీనా తెలిపారు. సమావేశంలో డీసీపీ – 2 ఉదయ్‌ భాస్కర్‌ బిల్లా, ద్వారకా ఏసీపీ ఆర్‌వీఎస్‌ఎన్‌ మూర్తి, ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ షణ్ముఖరావు, ఎస్సై సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement