మూడేళ్లు పింఛనిచ్చి.. ఆనక ఆపేశారు
Published Tue, Dec 10 2013 3:32 AM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM
యాళ్లవానిగరువు (పాలకొల్లు అర్బన్), న్యూస్‌లైన్: ఈమె పేరు సంది రాజ్యం. ఊరు పాలకొల్లు రూరల్ మండలంలోని యూళ్లవాని గరువు. వెనుకాముందూ ఎవరూ లేని అనాథ. 2008నుంచి మూడేళ్లపాటు నెలకు రూ.500 చొప్పున ఆమెకు పింఛను ఇచ్చారు. వీటి సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించడంతో 2011లో సదరం శిబిరం నిర్వహించి అర్ధాంతరంగా ఆమెకు పింఛను నిలిపివేశారు. నాటినుంచి నేటివరకూ ఆ అభాగ్యురాలు ప్రభుత్వ కార్యాలయూల చుట్టూ తిరుగుతూనే ఉంది. పింఛను ఇప్పించాలంటూ కనిపించిన ప్రతి అధికారినీ వేడుకుంటోంది. కుడి భుజం ఎత్తు పెరగడంతో ఆమెకు గూని వచ్చింది. గతంలో అనారోగ్యం పాలై రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. మాటలు సరిగా వినపడవు. చూపు మందగించింది. 50ఏళ్ల వయసులో ఏ పనీ చేసుకోలేకపోతోంది. దీంతో ఆమె వికలాంగ పింఛను కోసం అభ్యర్థిస్తోంది. అధికారులు దయదలచి పింఛను మంజూరు చేసి పుణ్యం కట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.
Advertisement
Advertisement