పోలీసుల అదుపులో సువబ్రత మజుందార్
కోల్‌కతా : కన్నతల్లి చనిపోయినా ఆమె పెన్షన్ తీసుకునేందుకు ఓ కొడుకు ... భారీ స్కెచ్ వేశాడు. అంతేకాకుండా తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే భద్రపరిచి... ఆమె వేలిముద్రతో సుమారు మూడేళ్లపాటు పెన్షన్ పొందాడు. అయితే ఈ ఉదంతంపై అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీయగా అసలు వ్యవహారం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...కోల్‌కతాకు చెందిన బినా మజుందార్ ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన తర్వాత మూడేళ‍్లకు చనిపోయింది. అయితే ఈ మూడు సంవత్సరాలు ఆమె ప్రతి నెల ఫించను తీసుకుంది. ఆశ్చర్యం కలిగించే ఈ సంఘటన కోల్‌కతాలోని దుర్గాపూర్‌లో చోటుచేసుకుంది.
అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీయగా తెలిసిన విషయం ఏంటంటే పెన్షన్ డబ్బుల కోసం బినా కుమారుడు ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే భద్రపరిచి, ఆమె వేలిముద్ర సాయంతో పెన్షన్ సోమ్మును డ్రా చేసుకుంటున్నాడని తెలిసింది. దాంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బినా మజుందార్ కుమారుడు సువబ్రత మజుందార్ తోళ్ల పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఎఫ్‌సీఐలో పనిచేసి, పదవి విరమణ చేసిన బినా మజుందార్‌కు నెలకు రూ.50వేల పెన్షన్ వస్తుంది. తల్లి మరణించడంతో ఆమె పేరుతో వచ్చే పెన్షన్ రాదని తెలుసుకున్నాడు. అందుకే తల్లి మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ఇంట్లోనే ఉంచాడు.
తోళ్ల పరిశ్రమలో పనిచేస్తుండటంతో తోళ్లు పాడవకుండా ఉపయోగించే రసాయనాలను వాడి చనిపోయిన తన తల్లి మృతదేహాన్ని పాడవకుండా ఫ్రిజర్‌లో భద్రపరిచాడు. ప్రతి నెల ఆమె వేలిముద్ర తీసుకుని వెళ్లి పెన్షన్ సొమ్మును డ్రా చేసుకుంటున్నాడు. గత మూడు సంవత్సరాలుగా అతడు ఇలానే చేస్తున్నాడు. మరణించిన తల్లి దేహాంలో తిరిగి జీవం పోస్తానని చెప్పి తండ్రి గోపాల్ చందర్ మజుందార్(90) సహాయంతో తల్లి మృతదేహాన్ని భద్రపరిచి ఇలా చేస్తున్నాడు. అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సువబ్రత ఇంటిని సోదా చేయగా ఫ్రిజర్‌లో వారికి బినా మజుందార్ మృతదేహం కనిపించింది. దాంతో అతడిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. సువబ్రత ఎవరితోను ఎక్కువగా కలిసేవాడు కాదని చుట్టుపక్కల వారు తెలిపారు. బినా మూడు సంవత్సరాల క్రితమే మరణించిన విషయం తమకు తెలుసని, కానీ సువబ్రత ఇలా చేస్తున్నాడని తమకు తెలియదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment