సూర్యాపేట : ఎప్పుడెప్పుడా అని ఆశతో ఎదురుచూస్తున్న బోధకాలు (పైలేరియా) వ్యాధి గ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. సీఎంకల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి 9వ తేదీన బోధకాలు బాధితులకు ప్రతినెలా రూ. వెయ్యి పింఛన్ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంట నే నెరవేర్చుకునేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఏప్రిల్ 19వ తేదీన గురువారం జీఓ నంబర్ : 35ని విడుదల చేసింది.
జిల్లాలో బాధితులు ఇలా..
బోధకాలు వ్యాధితో బాధపడుతున్న వారికి పింఛన్ అందించాలని ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.అయితే ఈ జీఓలో ముఖ్యంగా 2, 3 గ్రేడ్‌కు వ్యాధి చేరుకొని బాధపడే వారికి మాత్రమే పింఛన్ అందించనున్నారు. సూర్యాపేట జిల్లాలో 6,016 మంది బోధకాలు వ్యాధితో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. అయితే ఇందులో 5,492 మందికి స్క్రీనింగ్ చేయగా.. మిగిలిన 1,670 వివిధ కారణాల వలన అందుబాటులో లేకపోవడంతో పరీక్షించలేదు. ప్రస్తుతం 5,492 మందిని మాత్రం రికార్డుల్లో చేర్చారు. వీరిలో బోధకాలు బాధితుల్లో సమస్య తీవ్రంగా.. గ్రేడ్–1లో 1,673, గ్రేడ్–2లో 1,651, గ్రేడ్–3లో 2,168 మంది ఉన్నారు. అయితే గ్రేడ్–1 అంటే వ్యాధి ప్రారంభ దశగా.. గ్రేడ్–2 కాలు లావుగా వాయడంతో పాటు ముడతలు రావడం.. గ్రేడ్–3 అంటే ముడతలు రావడంతో పాటు పుండ్లు కావడం.. సొనలు కారడం వంటి లక్షణాలు కన్పిస్తుంటాయి.ఈ నేపథ్యంలో గ్రేడ్–2, గ్రేడ్–3 దశలో వ్యాధి ఉన్న బాధితులకు పింఛన్‌కు అర్హులుగా గుర్తించారు. వీరికే పింఛన్ అందించనున్నారు..
మే నెలలో పంపిణీకి రంగం సిద్ధం..
బోధకాలు బాధితులకు ఏప్రిల్ నుంచి వర్తింపు చేస్తూ.. మే నెలలో పింఛన్ పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో రెండు నెలల పింఛన్ సొమ్ము ఇవ్వన్నునట్లు స్పష్టం చేసింది. ఏప్రిల్ నెలాఖరు లోగా నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. నివేదికలు అందించడమే ఆలస్యం.. వెంటనే మే నుంచి బాధితులకు నెలకు రూ.వెయ్యి పింఛన్ అందించనున్నారు. అంతేకాదు.. బోధకాలు వ్యాధి నివారణకు పూర్తిస్థాలో చర్యలు తీసుకుంటూనే ఎప్పటికప్పుడు కొత్త బాధితులను పింఛన్‌ల జాబితాలో చేర్చనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment