‘లక్ష్మీ ఫైనాన్స్’ కేసులో ముగ్గురి అరెస్ట్
Published Wed, Oct 2 2013 3:13 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
పాలకొల్లు టౌన్, న్యూస్‌లైన్ : పాలకొల్లులోని లక్ష్మీ మోటార్ వెహికిల్ ఫైనాన్స్ కంపెనీ డిపాజిట్‌దారుల నుంచి రూ.1.80కోట్లు సేకరించి టోకరా వేసిన కేసులో యజమానితోపాటు ముగ్గరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను సీఐ జీవీ కృష్ణారావు విలేకరులకు మంగళవారం తెలిపారు. యలమంచిలి మండలం యలమంచిలిలంక గ్రామానికి చెందిన ఉప్పలపాటి సత్యనారాయణ పాలకొల్లులో లక్ష్మీ మోటార్ వెహికిల్ ఫైనాన్స్ కంపెనీ నడుపుతూ పలు గ్రామాల్లోని 294 మంది నుంచి రూ.1.80 కోట్లు డిపాజిట్లుగా సేకరించారు.
గత నెల 16న సత్యనారాయణ పరారవటంతో డిపాజిట్‌దారులు పాలకొల్లు సీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సత్యనారాయణ, అతని భార్య తులసీలక్ష్మి, వారికి సహకరించిన తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం మండలం అంజూరుకు చెందిన సిద్ధాంతి వలవలపల్లి కృష్ణమోహన కామేశ్వరరావును అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో పట్టణ ఎస్సై జి.సుబ్బారావు, ఆచంట ఎస్సై కృష్ణకుమార్ సహకారం అందజేశారని సీఐ చెప్పారు.
ఫైనాన్స్ కంపెనీలపై నిఘా
పాలకొల్లులో 58 ఫైనాన్స్ కంపెనీలున్నాయని వాటిపై నిఘా ఏర్పాటు చేశామని సీఐ తెలిపారు. ప్రజలు అధిక వడ్డీలకు ఆశపడి చట్టబద్ధత లేని ఫైనాన్స్ కంపెనీల్లో డిపాజిట్లు వేయవద్దని సీఐ సూచించారు. ఇటువంటి బోగస్ కంపెనీలు ఏమైనా ఉన్నాయని తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement