పాలకొల్లులో బోర్డు తిప్పేసిన ‘లక్ష్మీ’ ఫైనాన్స్
Published Tue, Sep 17 2013 3:32 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
పాలకొల్లు టౌన్, న్యూస్‌లైన్: అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిటర్ల నెత్తిన కోటిన్నరకు కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ ఉదంతమిది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యలమంచిలి గ్రామానికి చెందిన ఉప్పలపాటి సత్యనారాయణ పదేళ్ల కిందట పాలకొల్లులో లక్ష్మీ మోటార్ వాహనాల ఫైనాన్స్ కంపెనీ నెలకొల్పాడు. వాహనాలకు ఫైనాన్స్ చేయడంతో పాటు అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్లు కూడా సేకరించాడు. నూటికి రెండు రూపాయల వడ్డీ ఆశ చూపించి దాదాపు కోటిన్నర వరకు డిపాజిట్లు సేకరించాడు. డిపాజిట్లు కట్టిన వారిలో ఎక్కువగా రైతులు, మహిళలు, చిరువ్యాపారులే.
100 మందికి పైగా ఒక్కొక్కరు రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు ఈ సంస్థలో డిపాజిట్ చేశారు. యలమంచిలి లంక, పరిసర గ్రామాల్లోని బంధువులు, స్నేహితుల వద్ద నుంచి కూడా పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించాడు. డిపాజిటర్లకు సత్యనారాయణ, అతడి భార్య తులసీలక్ష్మి ప్రాంసరీ నోట్లు రాసిచ్చారు. ఈ నెల 3వ తేదీన సత్యనారాయణ అతని కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్న నామాల వెంకటేశ్వరరావుకు ఊరు వెళుతున్నాం కంపెనీని జాగ్రత్తగా చూడమని చెప్పి వెళ్లాడు. అప్పటి నుంచి కుటుంబంతో సహా అతడు కనిపించకుండా పోవడం, వారు సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో డిపాజిట్‌దారుల్లో ఆందోళన మొదలైంది.
ఈ నేపథ్యంలో సోమవారం వంద మందికి పైగా డిపాజిటర్లు పాలకొల్లు సంస్థ కార్యాలయం వద్దకు వచ్చారు. ఎవరూ లేకపోవడంతో తాము మోసపోయినట్లు గ్రహించారు. రూ. 10 లక్షలు డిపాజిట్ చేసిన యలమంచిలి లంక గ్రామానికి చెందిన వల్లభు రాజగోపాలరావుతో పాటు పలువురు డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ జీవీ కృష్ణారావు కేసు నమోదు చేసి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. రూ. కోటీ 42 లక్షల 48 వేల 700 డిపాజిట్ చేసినట్లు బాధితులు తెలిపారని, మరింత మంది డిపాజిటర్లు ఉన్నట్లు తెలుస్తోందని సీఐ చెప్పారు. సత్యనారాయణ నమ్మకంగా ఉన్నట్లు నమ్మించి నట్టేట ముంచారని బాధితులు వాపోయారు.
నమ్మించి నట్టేట ముంచారు
దూరపు బంధువు, అధిక వడ్డీ వస్తుందనే ఆశతో రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టిన రూ.80 వేలు లక్ష్మీ ఫైనాన్స్‌లో డిపాజిట్ చేశా. కొద్ది రోజులుగా సంస్థ యజమాని సత్యనారాయణ కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను.
- ఉండవల్లి కనకదుర్గ, శివకోడుపాలెం, తూర్పుగోదావరి జిల్లా
బంధువు కదా అని డిపాజిట్ చేస్తే
మా బంధువుల కొడుకు కదా అని రూ. 60 వేలు డిపాజిట్ చేశాను. అధిక వడ్డీ ఇస్తానన్నాడు. ఇలా అర్ధంతరంగా బోర్డు తిప్పేస్తాడని ఊహించలేకపోయాను. ఏం చేయాలో తోచడం లేదు. పోలీసులు న్యాయం చేయాలి.
- ఉప్పలపాటి సుబ్బారావు, యలమంచిలిలంక
Advertisement
Advertisement