లెక్క తేలింది..! | Chennai building collapse: Toll rises to 28,three more pulled out alive | Sakshi
Sakshi News home page

లెక్క తేలింది..!

Published Wed, Jul 2 2014 3:20 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

లెక్క తేలింది..! - Sakshi

లెక్క తేలింది..!

శ్రీకాకుళం కలెక్టరేట్:చెన్నైలో శిథిలాల కింద చిక్కుకున్న వారి లెక్క తేలింది. గత నెల 28న  నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ప్రమాదంలో జిల్లాకు చెందిన 17 మంది చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఇప్ప టి వరకు  నలుగురిని  గుర్తించారు. నరసన్నపేట మండలం బాలసీమకు చెందిన దువ్వారపు లక్ష్మి, కొత్తూరు మండలం ఇరపాడుకు చెందిన అమలాపురం శ్రీనివాసరావు(22)  మృతి  చెందగా, హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన కొంగరాపు కృష్ణవేణి, కోటబొమ్మాళి మండలం గుడివాడకు చెందిన చుక్కా రమేష్  అక్కడి  శ్రీరామచంద్ర ఆస్పత్రి లో వైద్యసేవలు పొందుతున్నారు. మరో 13 మందిని గుర్తించాల్సి ఉంది. అయితే వారు క్షతగాత్రులుగా ఉన్నారా..లేక మృత్యువాత పడ్డారా? అన్న విషయం తేలాల్సి ఉంది. అక్కడి జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులు సంఘటన స్థలంలోనే ఉండి..సహాయక చర్యలు చేపడుతున్నారు.  బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రేషన్ బియ్యంతో పాటు.. అమ్మహస్తం సరుకులను అందజేసింది.
 
 ఇంకా గుర్తించాల్సిన వారు
 హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన కొంగరాపు శ్రీను (40),  మీసాల శ్రీను (40), మీసాల భవాని (14), లక్ష్మీపురంకు చెందిన  పి.జ్యోతి (30), కోటబొమ్మాళి మండలం పాయకవలసకు చెందిన ముద్దాడ శ్రీనివాసరావు (23), ఎల్‌ఎన్‌పేట గ్రామానికి చెందిన తన్నా అప్పలనర్సమ్మ (40), అదే మండలం మోదుగువలసకు చెందిన దుక్క తవుడు (58), భామిని మండలం కొరమ గ్రామానికి చెందిన దాసరి రాము (40), దాసరి కళావతి (28),  కొత్తూరు మండలం ఇరపాడుకు చెందిన అమలాపురం రాజేష్(21), కిమిడి సుబ్బారావు (50), పాలకొండ మం డలం వాటర్ ట్యాంక్ కాలనీకి చెందిన ఊళ్ల రవి, గుడివాడగ్రామానికి చెందిన  చెందిన చుక్క సుజాతల ఆచూకీ తెలియాల్సి ఉంది.
 
 అచ్చెన్న పరామర్శ
 బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు.  మంగళవారం చెన్నై వెళ్లిన ఆయన బాధితులను పరామర్శించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క కార్మిక కుటుంబానికి అన్యాయం జరగకుండా..అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.పాలకొండ ఆర్డీవో ఎస్.తేజ్‌భరత్ ఆధ్వర్యంలో సహాయ, పునరావాస చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, సంఘటన వివరాలు తెలుసుకున్నారు. అలాగే..అక్కడి పునరావాస కేంద్రం లో మౌలిక వసతులు లేకపోవడంతో సమీపంలోని లాడ్జిలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు చెందిన 36 మంది చెన్నై వచ్చారని, వారికి కూడా మంగళవారం సాయంత్రం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామని పాలకొండ ఆర్డీవో చెప్పారు. ఇన్‌చార్జి కలెక్టర్ జి.వీరపాండ్యన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని అక్కడి అధికారులతో  సమీక్షిస్తున్నారు.

 నేడు స్వగృహానికి పద్మ మృతదేహం
 బాలసీమకు చెందిన దువ్వారపు పద్మ మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరనుంది. ప్రత్యేక వాహనంలో పంపిస్తున్నారని, ఆమె భర్త అప్పన్న కూడా వస్తున్నారని ఇన్‌చార్జి కలెక్టర్ తెలిపారు.
 
 ఇరపాడు యువకుడి మృతి
 ఇరపాడు (కొత్తూరు): చెన్నై భవన ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న ఇరపాడు వాసి అమలాపురం శ్రీనివాసరావు (రమేష్) (22) మృతి చెందినట్లు హిరమండలం ఆర్‌ఐ శంకరరావు, మృతుని తండ్రి సూర్యనారాయణ మంగళవారం రాత్రి ఫోన్ ద్వారా తెలిపారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో  ఉన్న శ్రీనివాసరావు మృతదేహాన్ని సహాయక బృందాలు వెలికి తీసి, ఎంజీఆర్ ఆస్పత్రికి తరలించగా..అక్కడ గుర్తించామని  పేర్కొన్నారు.  ఇంటర్ పూర్తి చేసి, డిగ్రీలో చేరాల్సిన కొడుకు ఇలా శవంలా మిగిలాడంటూ తండ్రి రోదిస్తున్న తీరు అక్కడి వారిని సైతం కన్నీరు పెట్టించింది.
 
 రెండో కుమారుడిపై సన్నగిల్లిన ఆశలు
 అలాగే..సూర్యనారాయణ మరో కుమారుడు రాజేష్ కూడా బతికున్నాడన్న నమ్మకం సన్నగిల్లుతుండడంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ప్రమాదం జరిగి మూడు రోజులు గడుస్తున్నా..రాజేష్ ఆచూకీ లభించలేదు. ప్రమాదం సమయంలో అన్నదమ్ములిద్దరూ ఒకే చోట ఉండడం..శ్రీనివాసరావు మృతి చెందడంతో..రాజేష్ ఏమయ్యాడోనన్న బెంగ పట్టుకుంది. అలాగే..ఇదే గ్రామానికి చెందిన సుబ్బయ్యపై కుటుంబం కూడా భోరుమంటోంది.  ఇద్దరు కుమారులు ఒకే సారి భవన శిథిలాల్లో చిక్కుకోవడంతో అనాథలమయ్యామని సూర్యానారాయణ రోదిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement