చెన్నై బాధితులకు వైఎస్‌ఆర్‌సీపీ చేయూత
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వెళ్లి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, తిరువళ్లూరులలో భవ నం, గోడ కూలిన ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్‌ఆర్‌సీపీ తరపున ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి రెండు రోజుల క్రితం జిల్లాలో పర్యటించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యుల స్థితిగతులను తెలుసుకున్న జగన్‌మోహనరెడ్డి పార్టీ తరపున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లా నాయకులు ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్, రెడ్డి శాంతి, ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వసరాయి కళావతిలు శని, ఆదివారాల్లో బాధితుల ఇళ్లకు వెళ్లి ఆర్థిక సాయం అందజేశారు. మృతుల కుటుంబ సభ్యులతో పాటు క్షతగాత్రులకు కూడా పార్టీ తరపున సాయం అందించారు.
ఆదివారం బూర్జ మండలం కొల్లివలసకు చెందిన కర్రి సింహాచలం, సెనగల పెంటయ్య, ఇదే మండలంలోని టీఆర్ రాజు పేటకు చెందిన కొయ్యాన జయమ్మ, హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన కొంగరాపు శ్రీనివాస్, మీసాల శ్రీనివాసరావు, మీసాల భవానీ, పెసైక్కి జ్యోతి, ఎల్‌ఎన్‌పేట మండలం ఎల్.ఎన్‌పేట గ్రామానికి చెందిన తాన్ని అప్పలనర్సమ్మ, మోదుగులవలస గ్రామానికి చెందిన దుక్క తవుడు, కొత్తూరు మండలం ఇరపాడు గ్రామానికి చెందిన అమలాపురం రాజేష్, అమలాపురం రమేష్, కిమిడి సుబ్బారావుల కుటుంబ సభ్యులకు రూ.75 వేలు చొప్పున, హిరమండలం మండలం గొట్టా గ్రామానికి చెందిన క్షతగాత్రులైన కొంగరాపు కృష్ణవేణి, బూర్జ మండలం కొల్లివలసకు చెందిన సెలగల నాగరాజులకు రూ.20 వేలు చొప్పున అందించారు.
మెళియాపుట్టి మండలం పట్టుపురం గ్రామానికి చెందిన సవర భీమారావుకు ప్రమాదంలో నడుం విరిగిపోయిందని, కొత్తూరు మండలం ఇరపాడుకు చెందిన అనుపోజు దివ్య అనే చిన్నారి అనాథగా మిగిలిందని బంధువులు జగన్‌మోహనరెడ్డి దృష్టికి తేవడంతో ఆయన ఆదేశాల మేరకు వారికి కూడా రూ. 20వేలు చొప్పున అందజేశారు. కాగా శనివారం కోటబొమ్మాళి మండలం పాకివలసకు చెందిన ముద్దపు శ్రీనివాసరావు, చుట్టిగుండం గ్రామానికి చెందిన దేవర సిమ్మయ్య, దేవర లక్ష్మీకాంతం, దేవర అప్పయ్య, దేవర లక్ష్మి, దేవర జగదీష్‌లకు, నరసన్నపేట మండలం బాలసీమకు చెందిన దువ్వారపు పద్మ, సారవకోట మండలం సత్రాం గ్రామానికి చెందిన ఇద్దుబోయిన రాము కుటుంబ సభ్యులకు రూ.75వేలు చొప్పున అందజేశారు. సోమవారం భామిని మండలం కొరమ గ్రామానికి చెందిన దాసరి కళావతి, దాసరి రాము, పాలకొండ కు చెందిన ఊల రవి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.