'అంతర్జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకుంటే బాగుండేది'
హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జాతీయ పార్టీ నిబంధనలు తెలియకుండానే బాబు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని చెవిరెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు జాతీయ పార్టీ నిబంధనలు అసలు తెలుసా?అని ప్రశ్నించారు. నాలుగు రాష్ట్రాల్లో కనీసం ఆరు శాతం ఓట్లు రావాలన్న ఎన్నికల కమిషన్ నిబంధన బాబుకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
జాతీయ పార్టీ అధ్యక్షుడికంటే.. అంతర్జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకుంటే బాగుండేదని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పే వారికి భారతరత్న ఇస్తే.. దానికి చంద్రబాబు అర్హత సాధిస్తారన్నారు. చంద్రబాబు చీకటి పాలనకు సమరదీక్షతో చరమగీతం పాడతామని చెవిరెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని పట్టిసీమ కమీషన్లతోనే అంగరంగ వైభవంగా నిర్వహించారని విమర్శించారు.