విజయానందరెడ్డిని కలిస్తే తప్పేంటి?
నమ్ముకున్న కార్యకర్త సింగపూర్ జైల్లో ఉన్నా కలుస్తా
పీడీ యాక్టు కింద ఇద్దరు స్మగ్లర్లకు టీడీపీ బి.ఫారాలు ఇచ్చింది
ఆ ఎర్రచందనం స్మగ్లర్లకు చంద్రబాబుకు సంబంధం ఉన్నట్టా?
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
‘‘మా పార్టీ కార్యకర్త విజయానందరెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలులో కలవడం నూటికి నూరు శాతం నా దృష్టిలో కరెక్ట్. అలా చేయడం మానవీయధర్మం’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పార్టీ కార్యకర్తను తను కలవడాన్ని టీడీపీ రాజకీయం చేయడాన్ని ఆయన తీవ్రస్థాయిలో ఖండించారు. ఈ మేరకు మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘నేను కష్టాన్ని భగవంతున్ని నమ్ముకుని ఎదగాలనుకునే వ్యక్తిని. తప్పుడు మార్గాలు ఎన్నుకుని ఎదగాలనే మనస్తత్వం కాదు. ఆ స్థాయికి ఎప్పటికీ దిగజారను. నేను తప్పులు చేసే వ్యక్తినైతే తప్పించుకుని తిరిగింటాగాని, ధైర్యంగా వెళ్లి జైలులో ఉన్న వ్యక్తులను కలిసేవాడిని కాదు. నేను దొంగచాటుగా విజయానందరెడ్డిని కలవలేదు. బహిరంగంగా జైలు సూపరింటెండెంట్‌కు లేఖ ఇచ్చి అనుమతి తీసుకుని అందరి ముందు కలిశాను. దీన్ని పెన్ను ఉందని పత్రికలో, నోరుందని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య హక్కులు కాలరాసేలా అనవసర రాద్ధాంతం చేస్తూ, వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరం. రాజకీయ కక్షతో ఆరోపణలు చేస్తే వారిని న్యాయస్థానం ఎదుట నిలబెట్టక తప్పదు. నిజంగా విజయానందరెడ్డిగాని, లేక మా పార్టీలో మరెవరైనాగాని తప్పులు చేసివుంటే అది నిరూపణ అయితే ప్రభుత్వమో, న్యాయస్థానమో వారిని కఠినంగా శిక్షించాల్సిందే. అలాంటి వాటిని సమర్థిస్తా. ఒకవేళ మాకు తెలిసిన వ్యక్తి తప్పు చేసి శిక్ష పడినా వారు చేసిన తప్పును సమర్థించం కానీ, వారినైతే తప్పక వెళ్లి పలకరిస్తా. అది మా నైతిక బాధ్యత. జైల్లో ఉన్న విజయానందరెడ్డిని కలవడం అదేదో పెద్ద నేరమని చంకలు గుద్దుకుంటున్న టీడీపీ నాయకులను సూటిగా అడగదలచుకుంటున్నా. గతంలో పీడీ యాక్ట్ కింద అరెస్టయి బెయిల్‌పై ఉన్న రెడ్డినారాయణ వైఎస్‌ఆర్ జిల్లా సంబేపల్లె జెడ్‌పీటీసీ అభ్యర్థిగా, మహేష్‌నాయుడు సుండుపల్లి టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. వారికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వహస్తాలతో సంతకం చేసిన బీ-ఫారాలు ఇచ్చారు. ప్రస్తుతం వారు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అంటే చంద్రబాబుకు కూడా ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధం అంటకడదామా? ఎర్రచందనం స్మగ్లింగ్‌లో గతంలో అరెస్ట్ అయినవారు, ఇంకా అరెస్ట్ కావలసిన వారు టీడీపీలో వందల సంఖ్యలో ఉన్నారు.
వారు రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారు, బహిరంగంగానే అటవీశాఖ మంత్రిని కలుస్తున్నారు. వారిపై చర్యలు తీసుకుని నిజాయితీని నిరూపించుకునే ధైర్యం పోలీసు అధికారులకు ఉందా? మన జాతి సంపద ఎర్రచందనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులకే కాదు, ప్రతిపక్ష స్థానంలో ఉన్న మాకు కూడా ఉంది. అలాంటి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాల్సిందే. ఎంతటి వారినైనా వదలకుండా శిక్షించే పనిని ప్రభుత్వం, పోలీసులు పక్షపాతం లేకుండా చేస్తే వారికి సెల్యూట్ చేస్తాం. అంతేగాని పక్షపాతంతో, దుర్మార్గంగా ఒక పార్టీపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే తిరుగుబాటు తప్పదు. ఒకటి మాత్రం నిజం. భవిష్యత్‌లో మా పార్టీ కార్యకర్తలు, నన్ను నమ్ముకున్న వారు సెంట్రల్ జైల్లో ఉన్నా, సింగపూర్ జైల్లో ఉన్నా వెళ్లి కలిసే తీరుతా. తెలిసిన వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు పత్రికలో, ప్రతిపక్షాలో విమర్శిస్తాయని భయపడి మాకెందుకులే అని వారిని వదిలేసే మనస్తత్వం కాదు నాది. అలా భయపడే పరిస్థితి వస్తే రాజకీయాలన్నా వదులుకుంటాగానీ, నమ్ముకున్న వారిని మాత్రం వదులుకునే ప్రసక్తే లేది’’ అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.