ఒంటికి యోగా మంచిదేగా
- యోగా చేయండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి
- యోగా దినోత్సవంలో సీఎం చంద్రబాబు
- 35 నిమిషాలు యోగా, ధ్యానం, ప్రాణాయామం
- కృష్ణానది పక్కనే రివర్‌సిటీ నిర్మిస్తానని హామీ
- ‘నాలుగో సింహం’ యాప్ ఆవిష్కరణ
సాక్షి, విజయవాడ బ్యూరో : యోగా జీవన వికాసానికి మార్గమని, అదో సైన్స్ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. యోగా వల్లే మానవాళి మొత్తం భారతదేశంవైపు చూస్తోందని, ఇది భారత జాతికి పూర్వీకులు ఇచ్చిన వరమని కొనియాడారు. నగరంలోని ఎ.కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం ఉదయం యోగా దినోత్సవాన్ని సీఎం ప్రారంభించి ప్రసంగించారు. అంతకుముందు ఆయన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ ఈరోజు నుంచి యోగాను ప్రారంభించి.. కొనసాగించి.. జీవన సరళిని మార్చుకోవాలని పిలుపునిచ్చారు. 192 దేశాలు ఆమోదించి యోగాను నేర్చుకోవడానికి సిద్ధమయ్యాయని, ఇది గర్వించదగిన విషయమన్నారు. యోగా చేసిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యం, మనోనిబ్బరం పెరుగుతుందని తెలిపారు. సంపూర్ణ యోగాను పాటిస్తే మూడు గంటల్లో చదివే విద్యార్థులు అరగంట చదివితే సరిపోతుందని, పది గంటల్లో చేసే పనిని మూడు, నాలుగు గంటల్లోనే చేయవచ్చని తెలిపారు. 1994లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో యోగా చేయించానని, ఇటీవల మళ్లీ ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులు శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం సమాజంలో అందరూ ఒత్తిడికి గురవుతున్నారని, అది లేని జీవితం గడపాలంటే యోగా చేయాలని సూచించారు. బతికున్నంత వరకూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆలోచనా విధానం మారాలని, అది యోగా వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, ఎంపీలు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణరావు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధతోపాటు అధికారులు, ఎన్‌సీసీ విద్యార్థులతో కలిసి 35 నిమిషాల పాటు ముఖ్యమంత్రి యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేశారు. కార్పొరేషనలో మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చిన ఆవుల చిరంజీవిని సీఎం అభినందించారు.
రివర్ సిటీ.. అందుకే బ్యూటీ..
కృష్ణానది విజయవాడకు మరింత అందాన్ని తెచ్చిందని, ఇలాంటి అందమైన ప్రాంతం మరెక్కడా లేదని ఎ.కన్వెన్షన్ సెంటర్‌లోనే జరిగిన ‘నాలుగో సింహం’ యాప్ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతి వరకూ 30 కిలోమీటర్ల పొడవు, నాలుగు కిలోమీటర్ల వెడల్పుతో నది చాలా ఆకర్షణీయంగా ఉంటుందని, హెలికాప్టర్ నుంచి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడల్లా ఎంతో ఆహ్లాదం కలుగుతుందన్నారు.
నదికి రెండువైపులా ఎత్తయిన భవనాలను నిర్మించి రివర్ సిటీ నగరాన్ని నిర్మిస్తామని, ‘కాలువల బ్యూటిఫికేషన్’ పూర్తయితే విజయవాడ మరింత అందంగా కనిపిస్తుందన్నారు. అనంతరం సీఎం వెదురు తోటల పెంపకంపై అధ్యయన యాత్రను ప్రారంభించారు. పంటల మార్పిడి విధానాలపై అవగాహన పెంచుకోవాలని రైతులకు సూచించారు. అంతర పంటలపై కూడా దృష్టి పెట్టాలని చెప్పారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ మూడు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్లారు.
అంతా పసుపుమయం
యోగా దినోత్సవ సభా వేదికను పూర్తిగా పసుపు రంగుతో తీర్చిదిద్దారు. చివరికి యోగా చేసే మ్యాట్‌లు కూడా పసుపు రంగులోనివే కావడం విశేషం. అధికారిక కార్యక్రమాల్లోనూ టీడీపీ జెండాలోని పసుపు రంగును బాగా ఉపయోగిస్తున్న అధికారులు చివరికి జాతీయ కార్యక్రమమైన యోగా సభను కూడా పసుపుమయం చేయడం విశేషం.