
సీఎం పర్యటనకు సిద్ధంగా ఉండాలి
విజయనగరం కంటోన్మెంట్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 11న జిల్లా పర్యటనకు రానున్న దృష్ట్యా అధికారులంతా సమాయత్తం కావాలని కలెక్టర్ ఎంఎం నాయక్ జిల్లా అధికారులను ఆదేశించారు. తన చాంబర్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆయన బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి బలిజిపేట, గుర్ల గ్రామాల్లో జరగనున్న జన్మభూమి కార్యక్రమంలో పాల్గొననున్నట్టు సమాచారం అందిందన్నారు. ఎస్‌పీ బందోబస్తు నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ప్రొటోకాల్, ఆహ్వాన పత్రికలను చూడాలన్నారు. వేదిక ఇన్‌చార్జిగా డ్వామా పీడీ గోవిందరాజులు, గిరిజన సంక్షేమ శాఖ ఈఈలు అలంకరణ, సోఫాలు, ప్లెక్సీల వంటి వాటిని చూడాలన్నారు. బారికేడింగ్, హెలీపాడ్ తదితర అంశాలు ఆర్‌అండ్‌బీ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. నిరంతర విద్యుత్ ఉండేలా విద్యుత్ శాఖాధికారులు చూడాలని, అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జన్మభూమిలోని ప్రాధాన్యతాంశాలను సంబంధిత శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. చక్కని ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు.
ముఖ్య ప్రణాళికాధికారి అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత గ్రామ, మండల, జిల్లా ప్రొఫైల్స్‌తో నోట్సును తయారు చేయాలని సూచించారు. బెల్టు షాపులు లేకుండా చూడాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. అవసరమైన వాహనాలుండాలని ఆర్టీఓ అబ్దుల్ రవూఫ్‌ను,మందులతో 104 వాహనం, వైద్యులు సిద్ధంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మికి ఆదేశించారు. ఆహార తనిఖీలకు సిద్ధంగా ఉండాలని ఫుడ్ తనిఖీ అధికారులను ఆదేశించారు. పాత్రికేయులకు ఇబ్బంది కలగకుండా అక్రిడేటెడ్ వారికి పాసులు ఏర్పాటు చేయాలని సమాచార శాఖ ఏడీ జాన్సన్ ప్రసాద్‌కు ఆదేశించారు. అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సమయం తక్కువ ఉన్నందున ఏర్పాట్లను వేగవంతం చేయాలన్నారు. ఎస్‌పీ నవదీప్ సింగ్ గ్రేవాల్, జేసీ రామారావు, సబ్ కలెక్టర్ శ్వేతామహంతి, ఏఎస్పీ రమణ, ఏజేసీ నాగేశ్వరరావు, విజయనగరం, బొబ్బిలి డీఎస్పీలు శ్రీనివాసరావు, ఇషాక్ అహ్మద్‌తో పాటు అధికారులంతా పాల్గొన్నారు.