పేటకు స్వర్ణోత్సవ శోభ
Published Fri, Mar 14 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM
కళాకారులకు నిలయమైన చిలకలూరిపేట ఒకప్పుడు జీపుల పరిశ్రమకు రాష్ట్రంలో పెట్టింది పేరు. తదనంతరం కాటన్, స్పిన్నింగ్ మిల్లులతో పారిశ్రామిక కేంద్రంగా ఎదిగింది. ప్రస్తుతం జిల్లా రాజకీయాలు మొత్తం పేట చుట్టూ తిరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ...ఈ మూడు పార్టీల జిల్లా అధ్యక్షులు పేట వాసులే కావడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న పేట మున్సిపాలిటీ స్వర్ణోత్సవ సంబరాలు నూతనంగా ఎన్నిక కానున్న బడుగు వర్గాల మహిళ నేతృత్వంలో జరగనున్నాయి. - న్యూస్‌లైన్, చిలకలూరిపేట
ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉన్న జిల్లాలోని ఈ మున్సిపాలిటీ విజయవాడ-చెన్నై జాతీయ రహదారిపై ఉన్న ప్రముఖ పట్టణం. వ్యాపార, వాణిజ్య కేంద్రం. కవులు, కళాకారుల నిలయం. ప్రముఖ నాదస్వర విద్వాంసులు నాదబ్రహ్మ షేక్ చిన పీరు సాహెబ్, ఆయన తమ్ముడు, శిష్యుడు షేక్ చిన ఆదం సాహెబ్, ఆయన శిష్యుడు షేక్ చిన మౌలా సాహెబ్‌లు తమ అసమాన ప్రతిభతో పేటకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ఆదం సాహెబ్ విద్వాంసుల కోటాలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఆదంసాహెబ్ శిష్యుడు షేక్ చిన మౌలా సాహెబ్ వీరికి గుర్తింపుగానే గతంలో పేట ఆర్టీసీ డిపో బస్సులపై నాదస్వరం గుర్తు ఉండేది. జీపుల పరిశ్రమ ఒకప్పుడు ఇక్కడ కుటీర పరిశ్రమలా వర్ధిల్లింది. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడకు వచ్చి జీపులు తయారు చేయించుకునేవారు. ఇక్కడ పదుల సంఖ్యలో నాటక కళాపరిషత్‌లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రముఖ నటీనటులంతా పేట వేదికలపై తమ అభినయ చాతుర్యాన్ని చూపిన వారే.
అర్ధ శతాబ్దంలో 8 మంది ఏలికలు
చిలకలూరిపేట మున్సిపాలిటీ ఆవిర్భవించి ఈ ఏడాదికి 50 సంవత్సరాలు నిండుతాయి. పంచాయతీగా ఉన్న చిలకలూరిపేట 1964 జనవరి 30వ తేదీన మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. 1980 ఏప్రిల్ 28వ తేదీన సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా, 2001 మే 18 తేదీన గ్రేడ్-1 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ పొందింది. 1967లో తొలిసారి జరిగిన పురపాలక సంఘ ఎన్నికలలో చైర్మన్‌గా శ్రీకృష్ణ వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. పదవిలో ఉండగానే ఆయన మృతి చెందడంతో ఆయన స్థానంలో బచ్చు రామలింగం చైర్మన్ అయ్యారు. 1973 నుంచి 1981 వరకు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన సాగింది. 1981లో ఎన్నికలు నిర్వహించగా బీసీహెచ్ స్వామినాయక్ చైర్మన్ అయ్యారు. నాలుగేళ్లు పైబడి పదవి నిర్వహించాక ఏపీపీఎస్‌సీ గ్రూప్ సెలక్షన్ కావడంతో పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఉసర్తి నాగయ్య చైర్మన్ పదవి అలంకరించారు. 1987 నుంచి 1992 వరకు మాజేటి వెంకటేశ్వర్లు చైర్మన్‌గా కొనసాగారు. 1995 నుంచి 2000 వరకు తవ్వా విజయలక్ష్మి తొలి మహిళా చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2000 నుంచి 2005 వరకు బింగి రామ్మూర్తి, 2005 నుంచి 2010 సెప్టెంబర్ వరకు జరపల కోటేశ్వరి చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతోంది.
వివిధ చైర్మన్‌ల హయాంలో జరిగిన అభివృద్ధి
తొలి చైర్మన్ శ్రీకృష్ణ వెంకటేశ్వర్లు,అనంతరం పదవి చేపట్టిన బచ్చు రామలింగంల హయాంలో పట్టణంలోని ప్రధాన రోడ్లు బీటీరోడ్లుగా మారాయి. స్వామినాయక్ హయాంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభమైంది. ఉసర్తి నాగయ్య హయాంలో వీధి దీపాలు, రోడ్లకు ప్రాధ్యాన్యం ఇచ్చారు. మాజేటి వెంకటేశ్వర్లు హయాంలో ఒకటవ వార్డులో మున్సిపల్ పాఠశాల ఏర్పాటైంది. ఇదే వార్డులో ఉన్న రిజర్వుడ్ స్థలానికి పార్కుగా అభివృద్ధి చేయడానికి ప్రహరీ ఏర్పాటు చేశారు. పండరీపురం బీఆర్ మున్సిపల్ పాఠశాలను హైస్కూల్‌గా రూపొందించారు. పలు కాలనీలలో విద్యుత్ సౌకర్యం ఏర్పాటైంది. తవ్వా విజయలక్ష్మి హయాంలో రెండవ మంచినీటి చెరువు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఏఎంజీ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ జాన్‌డేవిడ్ జర్మనీ దేశస్తుడు డైక్‌మెన్ అందించిన రూ.3 కోట్ల నిధులతో పైపులైన్ వ్యవస్థ విస్తృతమైంది. పలు ప్రాంతాల్లో ఓవర్ హెడ్ ట్యాంకర్ల నిర్మాణం జరిగింది. అనంతరం బింగి రామ్మూర్తి హయాంలో ఎన్టీఆర్ కాలనీలో బింగి రామ్మూర్తి పార్కు ఏర్పాటైంది. గాంధీ పార్కు స్థలంలో మున్సిపల్ భవనాలు నిర్మించారు. జరపల కోటేశ్వరి హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంజూరు చేసిన రూ.3 కోట్ల వ్యయంతో నూతన మున్సిపల్ భవనం ఏర్పాటైంది. రూ.10 లక్షలతో గడియార స్తంభం పునర్నిర్మాణం చేశారు.
చిలకలూరిపేట పట్టణ స్వరూపం
జనాభా : 1,01,550
విస్తీర్ణం.. : 18.13
చదరపు కిలోమీటర్లు
గృహాలు : 22వేలు
ఓటర్లు : 70,685
వార్డులు : 34
చైర్మన్ పదవి : బీసీ మహిళ
జనరల్ : 8
జనరల్ మహిళ : 9
బీసీ : 6
బీసీ మహిళ : 5
ఎస్సీ : 2
ఎస్సీ మహిళ : 2
ఎస్టీ : 1
ఎస్టీ మహిళ : 1
Advertisement
Advertisement