తల్లి గర్భంలో చావుగంట! | Child Death Cases hike In Kurnool | Sakshi
Sakshi News home page

తల్లి గర్భంలో చావుగంట!

Published Mon, Oct 22 2018 1:38 PM | Last Updated on Mon, Oct 22 2018 1:38 PM

Child Death Cases hike In Kurnool - Sakshi

కోడుమూరులో మూడేళ్ల క్రితం ఓ నర్సింగ్‌ హోమ్‌పై అధికారులు దాడులు నిర్వహించి లింగనిర్ధారణ చేస్తుండగా పట్టుకున్నారు. ఆ తర్వాత స్కానింగ్‌ యంత్రాన్ని సీజ్‌ చేశారు. కానీ ఆ మిషన్‌ పక్కనే మరో మిషన్‌ను అనధికారికంగా తెచ్చుకుని అక్కడి వైద్యులు స్కానింగ్‌ చేస్తూ ఆపై అబార్షన్‌లు చేస్తున్నారు. కర్నూలు ఎన్‌ఆర్‌ పేటలోని ఓ స్కానింగ్‌ కేంద్రంలోనే
ఓ మహిళా వైద్యురాలు ఇదే విధంగా అనధికార స్కానింగ్‌ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.  


కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో స్కానింగ్‌ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రస్తుతం అధికారికంగా 230కి పైగా స్కానింగ్‌ యంత్రాలు పనిచేస్తున్నాయి. అనధికారికంగా 450కి పైగా నడుస్తున్నాయని అంచనా.  అనుమతి తీసుకున్న కేంద్రాల కంటే అనుమతి లేని కేంద్రాల్లోనే లింగనిర్ధారణ అధికంగా జరుగుతోంది. కర్నూలు కొత్తబస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ఎన్‌ఆర్‌ పేట, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న పలు క్లినిక్‌లు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, గూడూరు, డోన్, నంద్యాల, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తేలితే చాలు అధిక శాతం అబార్షన్‌కు సిద్ధమవుతున్నారు. ఇరువర్గాల సమ్మతి మేరకు జరుగుతున్న ఈ తంతులో అటు గర్భిణి కుటుంబసభ్యులు, ఇటు వైద్యవర్గాలు విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇద్దరికీ శిక్ష పడుతుందని భావించి గుట్టుగా లింగనిర్ధారణ, అబార్షన్‌లు చేస్తున్నారు. 

తగ్గుతున్న స్త్రీ, పురుషుల నిష్పత్తి..
జిల్లాలో పురుషులు, మహిళల నిష్పత్తిలోభారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. 1000 మంది పురుషులకు ప్రస్తుతం జిల్లాలో 932  మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం డోన్‌లో 889, ప్యాపిలిలో 894, గడివేములలో 899, శ్రీశైలంలో 892 మాత్రమే స్త్రీలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. దీంతో పాటు ఆదోని డివిజన్‌లోనూ 1000 మంది పురుషులకు అధిక శాతం మండలాల్లో 900 నుంచి 910లోపే స్త్రీలు ఉన్నారు. దీన్ని బట్టి జిల్లాలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం అవుతోంది.

ఆర్‌ఎంపీలకు భారీగా కమీషన్లు
స్కానింగ్‌ కేంద్రాలు, క్లినిక్‌లు, ప్రైవేట్‌ ఆసుపత్రులకు ప్రధాన పాత్ర వహించేది ఆర్‌ఎంపీలేనన్న విషయం బహిరంగ రహస్యం. ఏ మాత్రం పేరులేని ఈ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయంటే ఆర్‌ఎంపీలకు వారు ఇస్తున్న భారీ కమీషన్లే కారణంగా చెప్పుకోవచ్చు. అధికంగా ఆదోని, తెలంగాణ రాష్ట్రంలోని పలు మండలాల నుంచి నిరక్షరాస్యులైన గర్భిణిలకు మాయమాటలు చెప్పి ఆర్‌ఎంపీలు కర్నూలుకు తీసుకొస్తున్నారు. ఈ మేరకు   లింగనిర్ధారణకు స్కానింగ్‌ చేయించడానికి గర్భిణిని తీసుకొస్తే రూ.4వేల నుంచి రూ.6వేలను వైద్యులు వసూలు చేస్తారు. అందులో ఆర్‌ఎంపీ కమీషన్‌ రూ.2000 ముట్టచెబుతున్నారు. 

పీసీపీఎన్‌డీటీ చట్టం అంటే లెక్కేలేదు
వరకట్న చట్టం, ధూమపాన నిషేధ చట్లాల్లాగే జిల్లాలో లింగనిర్ధారణ, భ్రూణహత్యలను నివారించేందుకు ఉద్దేశించిన పీసీ పీఎన్‌డీటీ చట్టం అభాసుపాలవుతోంది. ఈ చట్టం ఉన్నట్లు ఆయా స్కానింగ్‌ కేంద్రాల్లో పోస్టర్లు అతికించి, లోపల మాత్రం యదేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ చట్టం ఏర్పడి పాతికేళ్లు అవుతోంది. దీనిని ఉల్లంఘిస్తే  భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా ఉంటుంది. కానీ జిల్లాలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు ఈ శిక్షలు అమలు కాలేదు. ఒక్కరు కూడా జైలు గడప కాదు కదా కోర్టు మెట్లు కూడా ఎక్కలేదు. దీన్ని బట్టి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ శాఖలో లెప్రసి కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి గతంలో పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌ బాధ్యతలు చూసేవారు. ఆయనపై ఆరోపణలు రావడంతో ఇటీవల ఆయనను లెప్రసి కార్యాలయానికి పంపించారు. ఏమైందో ఏమో మళ్లీ ఆయనను తిరిగి వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి తెచ్చుకున్నారు.  

దాడులు ముమ్మరం చేస్తాంజిల్లాలో లింగనిర్ధారణ, భ్రూణహత్యల
(అబార్షన్లు)పై  ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయమై ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం. త్వరలో స్కానింగ్‌ సెంటర్లు, క్లినిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రులపై మూకుమ్మడి దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం.   – డాక్టర్‌ జేవీవీఆర్‌కె ప్రసాద్, డీఎంహెచ్‌వో 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement