అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : ఆడుతూపాడుతూ కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించిన ఆ బాలుడికి అవే ఆఖరు ఘడియలయ్యాయి. మిత్రులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన ఆ చిన్నారిని ఆటో రూపంలో మృత్యువు కబళించి, ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. స్థానిక కొవ్వూరునగర్‌లోని సంజీవరెడ్డి బంగ్లా సమీపంలో ఈ విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. సంజీవరెడ్డి బంగ్లా సమీపంలో నివసిస్తున్న రవీంద్రారెడ్డి, కృష్ణవేణి దంపతులకు హేమంత్, కోదండరామిరెడ్ది(7) ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో కోదండరామిరెడ్డి సమీపంలోని విశ్వ భారతి స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం నుంచి మిత్రులందరినీ కలసి చాక్లెట్లు పంచుతూ ఆనందంగా నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలాడు. మధ్యాహ్నం భోజనం చేసి తల్లిదండ్రులు నిద్రకు ఉపక్రమించగానే.. తాను మిత్రులతో కలసి ఆడుకుని వస్తానని ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు.
ఇంటికి సమీపంలో మరమ్మతుకు గురై నిలిపి ఉంచిన ఆటోలో మిత్రులతో కలసి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఆటో యజమాని వచ్చి దానినిస్టార్ట్ చేసేందుకు యత్నించాడు. అది స్టార్ట్ కాకపోవడంతో ఆటోను వెనుక నుంచి నెట్టాల్సిందిగా పిల్లలకు సూచించగా వారు దానిని బలంగా నెట్టారు. అప్పటికే రివర్స్ గేర్‌లో ఉన్న ఆటో స్టార్ట్ అయి బలంగా వెనక్కు రావడంతో, దాని వెనుకనే ఆటోను తోస్తున్న కోదండరామిరెడ్డి దాని కింద పడి తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. స్థానికుల సహాయంలో తల్లిదండ్రులు హుటాహుటిన ఆ బాలుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని, తక్షణం ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లమని అక్కడి వైద్య సిబ్బంది సూచించారు.
దీంతో గాయాలపాలై విలవిల్లాడుతున్న బిడ్డను తీసుకుని ఆ దంపతులు సాయినగర్‌లో పేరెన్నికగన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు లేరంటూ వారు చికిత్సకు నిరాకరించారు. అక్కడి నుంచి ఐరన్ బ్రిడ్జి సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్లగా, ఇక్కడ చిన్న పిల్లల వైద్యుడు లేరని చెప్పారు. కోర్టు రోడ్డులోని ప్రముఖ ఆస్పత్రికి వెళ్లగా ఇంత చిన్న పిల్లలకు తాము వైద్యం చెయ్యలేమని చెప్పారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో బాలుడు కన్నుమూశాడు. ‘సామీ.. చికిత్స చేయండి.. మా పిల్లాడిని కాపాడండి..’ అని బాలుడి తల్లిదండ్రులు మొత్తం నాలుగు ఆస్పత్రుల్లోనూ కన్నీటితో వేడుకున్నా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై జనం మండిపడ్డారు.
వైద్యులు ప్రాణాలు తీస్తున్నారు.. : గాయాలతో విలవిలలాడుతున్న తన బిడ్డను ప్రభుత్వ వైద్యులే పొట్టన పెట్టుకున్నారని మృతుడి తల్లిదండ్రుల కన్నీరుమున్నీరయ్యారు. బిడ్డను బతికించుకుందామని ప్రభుత్వాస్పత్రికి వెళితే కనీస చికిత్స కూడా చేయకుండా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లమన్నారని, కొంత వైద్యం చేసి ఉంటే తమ బిడ్డ బతికుండే వాడని, సుమారు గంటన్నర పాటు చేతుల మీద ప్రాణాలతో బిడ్డ కొట్టుమిట్టాడుతుంటే కాపాడుకోలేక పోయామని రోదించారు. ఇంత మంది వైద్యులు ఉండీ ఏం ప్రయోజనమని ఆ బాలుడి అత్త పద్మావతి కంట తడితో శాపనార్థాలు పెట్టింది.
పాపం పిల్లాడు..
Published Thu, Jan 2 2014 3:02 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement