
మూడు నెలలకే కానరాని లోకాలకు...
లేకలేక తొమ్మిదేళ్లకు సంతానం అందుకున్న ఆ తల్లికి ఆ ముచ్చట తీరకముందే మూడు నెలలకే ఆ చిట్టితండ్రి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు
శిశువు ఉసురు తీసిన చుక్కల మందు
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
జగ్గయ్యపేట అర్బన్ : లేకలేక తొమ్మిదేళ్లకు సంతానం అందుకున్న ఆ తల్లికి ఆ ముచ్చట తీరకముందే మూడు నెలలకే ఆ చిట్టితండ్రి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. పట్టణంలోని చెరువుబజారుకు చెందిన ఓర్సు సాంబశివరావు సుతారు మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆయన బార్య భూలక్ష్మితో సంతానం కోసం గుళ్లు, గోపురాలు తిరిగాడు. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల తర్వాత పుట్టిన అంకమరావును అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి ఇంచికొచ్చిన ఆయన బాబుతో ముచ్చట్లాడుకుంటూ భోజనం చేసి పనిలోకి వెళతాడు. ఇటీవల దేశవ్యాప్తంగా వేసిన పోలియో చుక్కలు బాబుకు ఏమైనా అవుతుందేమోనని వేయించలేదు. కాని ఆయన భయం అనతికాలంలోనే నిజమైంది.
బుధవారం మధ్యాహ్నం తమ ఇంటికి వచ్చిన ఏఎన్‌ఎంలు నాగలక్ష్మి, పద్మలు తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని గుండెలవిసేలా ఏడుస్తున్న ఆ తల్లిని ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. మధ్యాహ్నం బోజనానికి వచ్చి ఎప్పటిలా బిడ్డతో ఆడుకుందామనుకున్న ఆ తండ్రికి ఊహించని విధంగా బాబు లోకం వదిలి వెళ్లిపోయాడని తెలిసి స్పృహతప్పిపడిపోయాడు. బంధువులు ధైర్యం చెప్పగా ఆసుపత్రికి వచ్చిన ఆయన నాబిడ్డను నాకు ఇవ్వండంటూ బోరున ఏడుస్తున్న దృశ్యం చూపరులను కంటతడిపెట్టించింది. డాక్టర్లు, నర్సుల నిర్లక్ష్యం వలనే చనిపోయాడని ఆరోపించాడు.
బాలుడి మృతిపై విచారణకు కలెక్టర్ ఆదేశం
విజయవాడ : జగ్గయ్యపేట కమ్యూనిటి ఆరోగ్య కేంద్రం పరిధిలో మృతి చెందిన నాలుగు నెలల బాలుడి మరణ ంపై జిల్లా కలెక్టర్ బాబు.ఎ విచారణకు ఆదేశించారు. బుధవారం రాత్రి ఆయన క్యాంపు కార్యాలయం నుంచి జగ్గయ్యపేటలో జరిగిన సంఘటనను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చేపట్టాలని జిల్లా వైధ్యఅధికారి, జగ్గయ్యపేట తహశీల్దార్‌లను కలెక్టర్ ఆదేశించారు. జగ్గయ్యపేట చెరువు బజారుకు చెందిన ఒరుసు భూలక్ష్మి, సాంబశివరావుల నాలుగు నెలల బాలుడు వ్యాక్సినేషన్ కారణంగా మృతి చెంది నట్లు ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.