
చిన్నారిని బలిగొన్న కారు
సాక్షి, హైదరాబాద్: అప్పటివరకూ కళ్ల ముందే కదలాడిన ఏడాదిన్నర బాలుడిని మృత్యువు కారు రూ పంలో కబళించింది. అప్పటికే ఓ వాహనాన్ని ఢీకొట్టి, తప్పిం చుకొనే యత్నంలో వేగంగా కారు నడుపుతూ వచ్చిన వ్యక్తి.. ఇంటి ముందు కూర్చున్న ఆ బాలుడిని ఢీకొట్టాడు. హైదరాబాద్‌లోని ఉప్పుగూడలో ఈ ఘటన జరిగింది. ఇక్కడి తానాజీనగర్‌కు చెందిన పి.అశోక్ కుమార్, దీపిక దంపతులు ఆదివారం కార్తీక పౌర్ణమి కావడంతో ఇంట్లోనే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వారి కుమారుడు పునీత్ ఇంటి ముందు కూర్చొన్నాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో.. సునీల్‌గౌడ్ అనే వ్యక్తి తన కారుతో వేగం గా వచ్చి ఢీకొట్టాడు. దాంతో బాలుడి ముక్కు నుంచి రక్తం కారడంతో పాటు మలద్వారం నుంచి పేగులు బయటికి వచ్చాయి. కుటుంబసభ్యులు చిన్నారిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, అశోక్‌కుమార్ ఇంటికి ఎదురింట్లోనే సునీల్ ఉంటాడని, సునీల్ అంతకుముందే ఓ ఆటోను కూడా ఢీకొట్టాడని, ఆ ఆటోవాలా వెంబడించడంతో వేగంగా వచ్చి బాలుడిని ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.