బాల్యం బుగ్గి | child labour | Sakshi
Sakshi News home page

బాల్యం బుగ్గి

Published Mon, Jan 27 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

child labour

కర్నూలు(విద్య),న్యూస్‌లైన్ : ‘బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి. వారితో పనులు చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జైలుకు పంపుతాం’ అంటూ అధికారులు చెబుతున్న మాటలు అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలోని ఏ వీధిలో చూసినా బాలకార్మికులు దర్శనమిస్తున్నారు.

పదేళ్ల క్రితం బాలకార్మికుల విషయంలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా ముందుస్థానంలో ఉండేదని, ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయిందని అధికారులు రికార్డులు సృష్టిస్తున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా పని చేస్తున్న యునిసెఫ్, ఎన్‌సీఎల్‌పీ, ఆర్‌వీఎం లెక్కలు సైతం అయోమయంగా ఉండటంతో  వేటిని నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొంది.
 
 చెబుతున్నదొకటి.. జరుగుతున్నది మరొకటి..
 కర్నూలును బాలకార్మికులు లేని జిల్లాగా నిలుపుతామని హాజరైన ప్రతి సమావేశంలోనూ అధికారులు మైకులదరగొడుతున్నారు. చెబుతున్న మాటలను రికార్డుల వరకు పక్కాగా అమలు చేస్తున్నారు కూడా. క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటోంది.
 
 ఇటీవల ముగిసిన డైస్ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఐదో తరగతి వరకు పిల్లలు 3,98,124 మంది, ఆరు నుంచి 8వ తరగతి వరకు 19,264 మంది, 9, 10 తరగతుల్లో 1,01,383 మంది ప్రకారం మొత్తంగా 6,90,831 మంది విద్యార్థులు బడిలో ఉన్నట్లు రాజీవ్ విద్యామిషన్ అధికారులు చెబుతున్నారు. మధ్యలో మానేసిన పిల్లలు 6,633 మంది ఉన్నట్లు నిర్ధారించారు.  వీరిలోనూ బడిబయట ఉన్న పిల్లలు 4,121 మంది ఉండగా 2,512 మంది వికలాంగులుగా ఉన్నట్లు తేల్చారు. బాలకార్మికుల్లో చాలా వరకు  మెకానిక్‌షెడ్లు, పత్తిచేలల్లో మగ్గుతున్నారు. అధికారికంగా వివిధ శాఖలు నిర్వహించిన సర్వేల ప్రకారం జిల్లాలో బాలకార్మికుల సంఖ్య 6వేలకు మించి లేదు. వాస్తవంగా ఇంతకు పదింతలున్నట్లు తెలుస్తోంది. అయితే పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు కాపాడుకునేందుకు కొన్ని ఉపాధ్యాయ సంఘా లు, ఉపాధ్యాయుల ఒత్తిడి మేరకు విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపుతున్నారు. గత ఏడాది రూపొందించిన డైస్ లెక్కల్లో 90వేల మందిని అధికంగా చూపినట్లు తెలిసింది.
 
 ఆళ్లగడ్డ మండలంలో 230 మంది వరకు బాలకార్మికులు టీ బంకు, వెల్డింగ్ దుకాణాలు,, మెకానిక్ షెడ్లు, పొలాల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల్లో పనులు చేయడానికి డోన్, ఆలూరు, ఆస్పరి ప్రాంతాల నుంచి కొందరు బాలలు వలస వచ్చారు. చాగలమర్రి మండలంలో 115 మంది వరకు బాలకార్మికులు ఉపాధి కోసం కూలీలకు మారారు. రుద్రవరం మండలంలో 160 మంది పొలాల్లో పని చేస్తున్నారు.
 
  ఆలూరు మండలంలో గతేడాది 44 పాఠశాలల్లో 6,970 మంది విద్యార్థులు 1 నుంచి 8వ తరగతి వరకు బడులకు వెళ్లినట్లు రికార్డులున్నా యి. ఈ ఏడాది ఆ సంఖ్య 6,256కు చేరుకుంది.
 
 
 చిప్పగిరి మండలంలో గతేడాది  1 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థుల సంఖ్య 3 వేలకు పైగా ఉండగా ప్రస్తుతం 2,870కు చేరుకుంది.
 
  దేవనకొండలో అధికారిక లెక్కల ప్రకారంనాలుగు నెలలుగా 600 మంది విద్యార్థులు బడిబయట ఉన్నన్నారు.
 
  హాలహర్వి మండలంలో 33 పాఠశాలల్లో 5,773 మంది విద్యార్థులున్నారు. బాపురం, గూళ్యం, జె.హొసళ్లి తదితర గ్రామాల్లో వివిధ కారణాల చేత దాదాపు 6,400 మంది బడిబయట ఉన్నారు. స్వచ్ఛంద సంస్థల వివరాల మేరకు వెయ్యి మంది పిల్లలు తల్లిదండ్రుల వెంట వలస వెళ్లారు.
 
 హోళగుంద మండలంలోని 37 పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులు 7,500 మంది, ఉన్నత పాఠశాలల్లో 1500 మంది ఉన్నారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారమే 223 మంది, అనధికారికంగా 500కు పైగా బడి మానేశారు.
 
  మైనింగ్‌కు నిలయంగా ఉన్న బనగానపల్లి మండలం పలుకూరు, రామక్రిష్ణాపురం, నందవరం, ఎర్రగుడి, యనకండ్ల, మీరాపురం, జొలాపురం, దేవనగర్ గ్రామ ప్రాంతాల్లో పిల్లల్లో చాలా వరకు తల్లిదండ్రుల వెంట పనులకు వెళ్తున్నారు.
 
  పత్తికొండ మండలంలో అనధికారికంగా 740 మంది బడికి దూరంగా ఉన్నప్పటికి అధికారులు మాత్రం 356 మంది ఉన్నట్లు రికార్డులు సృష్టించారు.
 
  తుగ్గలి మండలంలో అధికారిక లెక్కల ప్రకారం 162 మంది బడిమానేయగా అనధికారికంగా ఈ సంఖ్య 328 మందికిపైగా ఉంది.
 
 మద్దికెర  మండలంలో 21 మంది బడిబయట ఉన్నా అధికార లెక్కలు మాత్రం ముగ్గురు మాత్రమేనని చెబుతున్నాయి.
 
క్రిష్ణగిరి మండలంలో అనధికార లెక్కల ప్రకారంగా 122 మంది బడికి దూరంగా ఉంగా రికార్డులు మాత్రం 80 మందికి మించి లేరని చెబుతున్నాయి.
 
వెల్దుర్తి మండలంలో 920 మంది బడికి దూరంగా ఉన్నప్పటికి 132 మంది మాత్రమే ప్రభుత్వ లెక్కల సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement