పసి ప్రాణంపై కసి
ముద్దు ముద్దు మాటలు మూగబోయాయి... బుడి బుడి అడుగులు ఆగిపోయాయి... ముసిముసి నవ్వులతో కళకళలాడిన ఆ ఇల్లు బోసిపోయింది... ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న చిన్నారి ఇక లేడని తెలిసిన ఆ తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లాయి.. సొంత బాబాయే కాలయముడై ప్రాణం తీశాడని తెలిసి నిర్ఘాంతపోయారు. ఏడాదిన్నర చిన్నారిని కృష్ణా నదిలోకి విసిరి కసిగా ఉసురు తీశాడని తేలడంతో గుండెలు పగిలేలా ఆ దంపతులు రోదిస్తున్న తీరు చూపరుల చేత సైతం కంటతడిపెట్టించాయి. చివరకు ఘాతుకానికి కారకుడైన నిందితుడి ఆచూకీ సైతం చిక్కలేదు.
తాడేపల్లి రూరల్: అసూయ ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఘాతుకానికి కారకుడైన నిందితుడూ కనిపించకుండా పోయాడు. ఏడాదిన్నర చిన్నారిని సొంత బాబాయే కాలయముడై కృష్ణానదిలోకి విసిరి హత్య చేయడం జిల్లాలో సంచలనం కలిగించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటనలో మృతి చెందిన చిన్నారిని గురువారం మరో బాబాయి కనుగొన్నారు.
కనకదుర్గమ్మ వారధి 28, 29 ఖానా మధ్య నదిలో తేలియాడుతున్న మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన చిన్నారి మోక్షజ్ఞతేజ(18నెలలు) ను తెనాలిలో ఉంటున్న సొంత బాబాయి గోడపాటి హరిహరణ్ వారధిపై నుంచి నదిలోకి విసిరి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు, కుటుంబీకులు బంధువుల కథనం మేరకు మోక్షజ్ఞతేజ హత్యోదంతానికి సంబంధించిన వివరాలు ఇలావున్నాయి..
తెనాలి బాలాజీరావుపేటలోని మహేంద్రకాలనీకి చెందిన గోడపాటి రాంబాబు పొన్నూరులో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు.
అతని ముగ్గురు కుమారుల్లో పెద్దవాడైన భాస్కరరావు భార్య విమలప్రియతో కలిసి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ తమ కుమారుడైన చిన్నారి మోక్షజ్ఞ తేజను ఆరు నెలల కిందట తెనాలిలో ఉంటున్న నానమ్మ, తాతయ్య, జానకి, రాంబాబుల వద్ద వదిలి వెళ్లారు. ఏఎస్‌ఐ రాంబాబు రెండవ కుమారుడు చంద్రశేఖర్ ఉద్యోగంలో స్థిరపడగా, మూడవ కుమారుడు ఈ సంఘటనలో నిందితుడైన హరిహరణ్ ఇంజనీరింగ్ చదివినప్పటికీ జులాయిగా తిరుగుతుండేవాడని బంధువులు తెలిపారు.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చిన్నారి మోక్షజ్ఞతేజ తండ్రి భాస్కరావు తెనాలి వచ్చి పద్ధతి మార్చుకోవాలని తమ్ముడైన హరిహరణ్‌కు హితబోధ చేసివెళ్లారు.
దీనిని మనసులో పెట్టుకున్న హరిహరణ్ బుధవారం సాయంత్రం ఆ చిన్నారిని బయటకు తీసుకెళ్లాడు. రాత్రికి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెతకనారంభించారు. ఈ క్రమంలో గురువారం కృష్ణానది వద్దకు చేరుకున్న రాంబాబు రెండో కుమారుడు చంద్రశేఖర్‌కు కనకదుర్గమ్మవారధి వద్ద పెద్ద సంఖ్యలో జనం ఉండడంతో కంగారుపడి వెళ్లి చూడగా చిన్నారి మోక్షజ్ఞ నదిలో శవంగా కనిపించాడు. దీంతో ఒక్కసారిగా చంద్రశేఖర్ బాబాయి చేతిలో బలైపోయావా చిన్నా అంటూ బోరున విలపించాడు.
అనంతరం అక్కడకు చేరుకున్న మంగళగిరి రూరల్ సీఐ చిట్టెం కోటేశ్వరావు, తాడేపల్లి ఎస్‌ఐ దుర్గాసి వినోద్‌కుమార్‌లకు జరిగిన విషయాన్ని చంద్రశేఖర్ వివరించడంతో చిన్నారిని తీసుకువచ్చిన బాబాయి హరిహరణ్ వారధిపై నుంచి విసిరి నడిలో పడేసి ఉంటాడనే నిర్ధారణకు వచ్చారు.వారధిపై ఇంటి నుంచి నిందితుడు తెచ్చిన పంచను పోలీసులు కనుగొని ఇక్కడ నుంచే హత్య చేసి ఉంటాడని భావించారు. చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని మంగళగిరి ఏరియా ఆస్పత్రికి తర లించారు.
బాలాజీరావుపేటలో విషాదం
తెనాలిరూరల్ : చిన్నారి మోక్షజ్ఞతేజ మృతి వార్త తెలుసుకున్న రాంబాబు కుటుంబం నివసించే బాలాజీరావుపేటలో విషాద ఛాయలు అలు ముకున్నాయి. ఇదిలావుండగా, హరిహరణ్ మానసిక స్థితి సరిలేదని స్థానికులు చెపుతున్నారు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ప్రేమ విఫలం కావడంతో అతడు మానసికంగా కుంగి పోయినట్టు తెలుస్తోంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు చికిత్స చేయించినా ప్రవర్తనలో మార్పు రాలేదంటున్నారు.