krishna nadhi
-
కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలను అక్రమంగా తరలించడాన్ని తక్షణమే ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు గురువారం మరో లేఖ రాసింది. నీటి తరలింపు కేడబ్లు్యడీటీ–1 (కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్) తీర్పునకు వ్యతిరేకమని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్‌చీఫ్ మురళీధర్, కేఆర్ఎంబీ చైర్మన్‌కు రాసిన లేఖలో వివరించారు. 1976–77 అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం కేవలం 15 టీఎంసీల నీటిని మాత్రమే జూలై నుంచి అక్టోబర్ వరకు మద్రాసు (చెన్నై)కు తాగునీటి కోసం మళ్లించాలని పేర్కొన్నారు. 15 వేల క్యూసెక్కుల సామర్థ్యం మించకుండా చెన్నైకి నీటిని తరలించాలని ఒప్పందంలో పేర్కొన్న విషయాన్ని లేఖలో స్పష్టం చేశారు. ఈఎన్సీ రాసిన లేఖలోని ముఖ్యాంశాలు.. ►సెంట్రల్ వాటర్ కమిషన్ 1981లో బనకచెర్ల వద్ద కేవలం ఒక్క క్రాస్ రెగ్యులేటర్‌కు మాత్రమే అనుమతించింది. ►ఎస్కేప్ రెగ్యులేటర్‌ను తరువాతి కాలంలో అనుమతి లేకుండా నిర్మించారు. ►అనుమతి లేకుండా శ్రీశైలం కుడి ప్రధాన కాలువను 20,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచారు. ►పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 34 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని విడుదల చేయడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేదు. ఈ నేపథ్యంలో నీటి తరలింపు ఆపేయాలి. ►గెజిట్ నోటిఫికేషన్‌లోని షెడ్యూల్ 2లో అనుమతించిన ప్రాజెక్టులుగా పేర్కొన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ కాలువ, ఎస్కేప్ రెగ్యులేటర్, తెలుగు గంగా ప్రాజెక్టు రెగ్యులేటర్లను అనుమతిలేని ప్రాజెక్టులుగా పేర్కొనాలి. ►శ్రీశైలం ప్రాజెక్టును జలవిద్యుత్ ప్రాజెక్టుగానే కృష్ణా ట్రిబ్యునల్ పరిగణించింది. ►19 టీఎంసీలను శ్రీశైలం కుడి కాలువకు, 15 టీఎంసీలు చెన్నై తాగునీటికి మొత్తం 34 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నుం చి మళ్లించడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతించింది. అంతకు మించి నీటి తరలింపును అనుమతించరాదని ఆ లేఖలో పేర్కొన్నారు. -
పసి ప్రాణంపై కసి
ముద్దు ముద్దు మాటలు మూగబోయాయి... బుడి బుడి అడుగులు ఆగిపోయాయి... ముసిముసి నవ్వులతో కళకళలాడిన ఆ ఇల్లు బోసిపోయింది... ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న చిన్నారి ఇక లేడని తెలిసిన ఆ తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లాయి.. సొంత బాబాయే కాలయముడై ప్రాణం తీశాడని తెలిసి నిర్ఘాంతపోయారు. ఏడాదిన్నర చిన్నారిని కృష్ణా నదిలోకి విసిరి కసిగా ఉసురు తీశాడని తేలడంతో గుండెలు పగిలేలా ఆ దంపతులు రోదిస్తున్న తీరు చూపరుల చేత సైతం కంటతడిపెట్టించాయి. చివరకు ఘాతుకానికి కారకుడైన నిందితుడి ఆచూకీ సైతం చిక్కలేదు. తాడేపల్లి రూరల్: అసూయ ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఘాతుకానికి కారకుడైన నిందితుడూ కనిపించకుండా పోయాడు. ఏడాదిన్నర చిన్నారిని సొంత బాబాయే కాలయముడై కృష్ణానదిలోకి విసిరి హత్య చేయడం జిల్లాలో సంచలనం కలిగించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటనలో మృతి చెందిన చిన్నారిని గురువారం మరో బాబాయి కనుగొన్నారు. కనకదుర్గమ్మ వారధి 28, 29 ఖానా మధ్య నదిలో తేలియాడుతున్న మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన చిన్నారి మోక్షజ్ఞతేజ(18నెలలు) ను తెనాలిలో ఉంటున్న సొంత బాబాయి గోడపాటి హరిహరణ్ వారధిపై నుంచి నదిలోకి విసిరి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు, కుటుంబీకులు బంధువుల కథనం మేరకు మోక్షజ్ఞతేజ హత్యోదంతానికి సంబంధించిన వివరాలు ఇలావున్నాయి.. తెనాలి బాలాజీరావుపేటలోని మహేంద్రకాలనీకి చెందిన గోడపాటి రాంబాబు పొన్నూరులో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. అతని ముగ్గురు కుమారుల్లో పెద్దవాడైన భాస్కరరావు భార్య విమలప్రియతో కలిసి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ తమ కుమారుడైన చిన్నారి మోక్షజ్ఞ తేజను ఆరు నెలల కిందట తెనాలిలో ఉంటున్న నానమ్మ, తాతయ్య, జానకి, రాంబాబుల వద్ద వదిలి వెళ్లారు. ఏఎస్ఐ రాంబాబు రెండవ కుమారుడు చంద్రశేఖర్ ఉద్యోగంలో స్థిరపడగా, మూడవ కుమారుడు ఈ సంఘటనలో నిందితుడైన హరిహరణ్ ఇంజనీరింగ్ చదివినప్పటికీ జులాయిగా తిరుగుతుండేవాడని బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చిన్నారి మోక్షజ్ఞతేజ తండ్రి భాస్కరావు తెనాలి వచ్చి పద్ధతి మార్చుకోవాలని తమ్ముడైన హరిహరణ్‌కు హితబోధ చేసివెళ్లారు. దీనిని మనసులో పెట్టుకున్న హరిహరణ్ బుధవారం సాయంత్రం ఆ చిన్నారిని బయటకు తీసుకెళ్లాడు. రాత్రికి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెతకనారంభించారు. ఈ క్రమంలో గురువారం కృష్ణానది వద్దకు చేరుకున్న రాంబాబు రెండో కుమారుడు చంద్రశేఖర్‌కు కనకదుర్గమ్మవారధి వద్ద పెద్ద సంఖ్యలో జనం ఉండడంతో కంగారుపడి వెళ్లి చూడగా చిన్నారి మోక్షజ్ఞ నదిలో శవంగా కనిపించాడు. దీంతో ఒక్కసారిగా చంద్రశేఖర్ బాబాయి చేతిలో బలైపోయావా చిన్నా అంటూ బోరున విలపించాడు. అనంతరం అక్కడకు చేరుకున్న మంగళగిరి రూరల్ సీఐ చిట్టెం కోటేశ్వరావు, తాడేపల్లి ఎస్ఐ దుర్గాసి వినోద్‌కుమార్‌లకు జరిగిన విషయాన్ని చంద్రశేఖర్ వివరించడంతో చిన్నారిని తీసుకువచ్చిన బాబాయి హరిహరణ్ వారధిపై నుంచి విసిరి నడిలో పడేసి ఉంటాడనే నిర్ధారణకు వచ్చారు.వారధిపై ఇంటి నుంచి నిందితుడు తెచ్చిన పంచను పోలీసులు కనుగొని ఇక్కడ నుంచే హత్య చేసి ఉంటాడని భావించారు. చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని మంగళగిరి ఏరియా ఆస్పత్రికి తర లించారు. బాలాజీరావుపేటలో విషాదం తెనాలిరూరల్ : చిన్నారి మోక్షజ్ఞతేజ మృతి వార్త తెలుసుకున్న రాంబాబు కుటుంబం నివసించే బాలాజీరావుపేటలో విషాద ఛాయలు అలు ముకున్నాయి. ఇదిలావుండగా, హరిహరణ్ మానసిక స్థితి సరిలేదని స్థానికులు చెపుతున్నారు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ప్రేమ విఫలం కావడంతో అతడు మానసికంగా కుంగి పోయినట్టు తెలుస్తోంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు చికిత్స చేయించినా ప్రవర్తనలో మార్పు రాలేదంటున్నారు. -
అరకొర చర్చలు.. అసంతృప్తితో రైతులు
తుళ్ళూరు : ముఖ్యమంత్రితో సమావేశమయ్యేందుకు ఆశగా వెళ్లిన రైతులు అసంతృప్తితో వెనుదిరిగారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులకు ప్యాకేజీ పెంపుపై సీఎం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదు. అరకొర చర్చలతో అయిందనిపించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. తుళ్ళూరు మండలంలో కృష్ణానది ఆయకట్టు గ్రామాలకు చెందిన ఎక్కువ మంది రైతులు రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి భూములు ఇవ్వబోమని తేల్చి చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం విజయవాడ వ స్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న గ్రామాల రైతులు హాజరుకావాలని మంత్రి వర్గ ఉపసంఘం శుక్రవారం రాత్రి సమాచారం అందించింది. దీంతో శనివారం ఉదయం కొందరు రైతులు వెళ్లేందుకు సమాయత్తమయ్యారు. తీరా బయలుదేరే సమయంలో భూములు ఇచ్చేందుకు అంగీకరిస్తున్న గ్రామాల రైతులు కూడా ప్యాకేజీలు ప్రకటించిన సీఎంను సత్కరించేందుకు బయలు దేరుతున్నారని తెలుసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం వుండక పోవచ్చని, కలిసినా ఆయన పెద్దగా మాట్లాడేది వుండదని భావిం చిన చాలా మంది రైతులు విజయవాడ ప్రయాణం విరమించుకున్నారు. మంత్రివర్గ ఉపసంఘ సమావేశానికి వస్తామని హామీ ఇచ్చిన రైతులకు మాత్రం వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. అనుకూలంగా ఉన్న రైతులతో సన్మానాలు, సత్కారాలు ముగిశాక పలు నాటకీయ పరిణామాల అనంతరం విజయవాడ ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలోని మంత్రి ఉమ చాంబర్లో మంత్రి పుల్లారావు నేతృత్వంలో భూములు ఇవ్వబోమన్న రైతులతో సీఎం సమావేశమయ్యారు. ప్యాకేజీలో ఆ తేడా ఏదీ..? : ఈ సందర్భంగా వెంకటపాలెం మాజీ ఎంపీటీసీ బెల్లంకొండ నరసింహారావు మాట్లాడుతూ బైపాస్ రోడ్ నిర్మాణం అయినప్పటి నుంచి కృష్ణానది ఆయకట్టు గ్రామాల భూములు ధరలు బాగా పెరిగాయన్నారు. దీంతో తమ భూముల ధర ఎకరం రూ.3 కోట్ల వరకు పలుకుతుందన్నారు. ప్రకటించిన ప్యాకేజీ కృష్ణానది ఆయకట్టు గ్రామాల రైతులకు తీరని అన్యాయం చేసినట్లేనని వివరించారు. దీనిపై సీఎం మాట్లాడుతూ అందుకే జరీబు భూములు తీసుకున్న చోటే జరీబు రైతులకు, మెట్ట భూములు తీసుకున్న చోట మెట్ట రైతులకు 1300, 1200 గజాల భూము లు ఇస్తున్నామని సమాధానం చెప్పారు. మందడం రైతు కొండెపాటి సతీష్‌చంద్ర మాట్లాడుతూ మూడు పంటలు పండించడం అంటే ఒకే సమయంలో ఒకేపొలంలో అంతర్గత పంటలుగా మూడు పంటలు పండిస్తామని, దానికి తగినట్టుగానే ఆదాయం కూడా వస్తుందని తెలిపారు. ఒక్క ఎకరం జరీబు భూమి పదెకరాల మెట్ట భూమితో సమానమని, ప్యాకేజీలో ఈ తేడా లేకపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు వివరించారు. దీనికి సమాధానంగా సీఎం ఇక్కడ ఎకరం అమ్మేసి అక్కడ 10 ఎకరాలు మెట్ట కొనుక్కోవలసిందని చమత్కరించారు. ఈ ప్రాంతంలో మీరు రాజధాని నిర్మిస్తున్నట్లు ముందుగా లీకులిస్తే అదేపని చేసి వుండేవాడినని రైతు సతీష్ చంద్ర చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులతో నిండిపోయింది. రైతులంతా రాజకీయాలకు అతీతంగా సహకరిస్తే సాధ్యమైనంత మేలు జరిగేలా చూస్తానని చెప్పి సీఎం సభ ముగించారు. దీనికి సంతృప్తి చెందని రైతులు నిరాశతో వెనుతిరిగారు. వెళ్లిన రైతులకు ఎలాంటి హామీ లభించక పోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చిందని పలువురు రైతులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటపాలెం నుంచి మాజీ ఎంపీటిసి బెల్లం కొండ నరశింహారావుతో పాటు, ప్రస్తుత ఎంపీటీసీ పత్తిపాటి నాగమల్లేశ్వరరావు, రైతు నాయకులు లంకా సుధాకర్, మందడం నుంచి కొండెపాటి సతీష్‌చంద్రతో పాటు, మందడం సొసైటీ అధ్యక్షుడు బెజవాడ రమేష్, జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు పాల్గొన్నారు. -
తెలంగాణకు అమరావతి ఇసుక
మంగళగిరి రూరల్ : ఇసుక అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. జిల్లాలోని కృష్ణానదీ పరివాహకప్రాంతాల్లో ఇసుకను అక్రమార్కులు తమ ఇష్టారాజ్యంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అమరావతి మండలంవైకుంఠపురం ఇసుక రీచ్ నుంచి నిత్యం ఇసుకను లారీలద్వారా తెలంగాణ రాష్ట్రానికి తరలించి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇసుక లారీల రాకపోక లతో రహదారులు గోతులమయంగామారడ ంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి, వైకుంఠపురం ప్రాంతాల నుంచి ఇసుకలారీలు హైదరాబాద్ తరలి వెళుతున్నాయి. ఒక్కో లారీలో 20 నుంచి 22 టన్నుల ఇసుకను రవాణాచేయాల్సి వున్నా 50 టన్నుల మేర తరలిస్తున్నారు.పెద్ద ఎత్తున ఇసుక తరలిపోతున్నా అధికారులు చర్యలుతీసుకున్న దాఖలాలు లేవు.వైకుంఠపురం ఇసుక రీచ్ నుంచి బయలు దేరే లారీలు అడ్డదారి ప్రయాణాన్ని సాగిస్తున్నాయి. తుళ్లూరు మీదుగా మంగళగిరి, విజయవాడ అక్కడి నుంచి ఇతర జిల్లాలతో పాటు హైదరాబాద్ వెళుతున్నాయి. ఇసుక లోడుకు టార్ఫాలిన్ పట్టలు కప్పి ఇసుకను తరలిస్తున్నారు.జిల్లాలతో పాటు రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నా అధికారులకు ఏ మాత్రం పట్టడం లేదు. రీచ్ నిర్వాహకులు మార్గమధ్యలో వారి అనుచరులను నియమిస్తున్నారు. అధికారులు ఎవరైనా లారీలను ఆపితే వెంటనే సమాచారం తెప్పించుకుని ఫోన్లలోనే వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. గతంలో తరచూ దాడులు చేసి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన అధికారులు ప్రస్తుతం మిన్నకుండిపోయారు.ఎస్పీ రామకృష్ణ ఆదేశాలు బేఖాతర్...రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఆదేశాలు జారీ చేసినా ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడలేదు. ఇసుకను అక్రమంగా రవాణా చేసినా, లారీలకు ఓవర్‌లోడ్ చేసినా కఠిన చర్యలు తప్పవని రెండు రోజుల కిందట రూరల్ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. -
పసికందును కృష్ణానదిలోకి విసిరి..
తాడేపల్లి రూరల్, న్యూస్‌లైన్: ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో కానీ నవమాసాలు కడుపున మోసి, కని, ఐదు నెలలు అల్లారుముద్దుగా పెంచి, అన్నప్రాసన చేయాల్సిన సమయంలో కన్నబిడ్డను ప్రకాశం బ్యారేజి పైనుంచి అమాంతం కృష్ణానదిలోకి విసిరేసింది. ఒక్క మగ్గు నీళ్లు నెత్తిన పడితేనే ఉక్కిరి బిక్కిరవుతారు పసిబిడ్డలు. అట్లాంటిది 30 అడుగులు ఎత్తు నుంచి గాలిలో తేలుతూ, పడుతూ లేస్తూ అమాంతం నీళ్లలో పడి అడుగుకు చేరిన ఓ పసికందు.. మానవత్వం పరిమళించిన ఓ ఆటో డ్రైవర్ సాహసం పుణ్యమా అంటూ మృత్యుంజయురాలైంది. బిడ్డకు భయమేస్తే లాలించి హత్తుకుని అక్కున చేర్చుకునే అమ్మ ఉలుకు పలుకులేకుండా పడిపోయి కనిపించింది. ఆదివారం మిట్టమధ్యాహ్నం ప్రకాశం బ్యారేజిపై జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. ఏం జరిగిందేంటే.. గుంటూరుకు చెందిన లింగాల నాగసుజాత. కన్నబిడ్డకు మురిపెంగా ‘ఆకాంక్ష’ అనే పేరు పెట్టుకుంది. ఏకాంక్ష తీరకుండానే ఆ బిడ్డను ఆదివారం కృష్ణానదిలోకి విసిరేసింది. బిడ్డను కృష్ణానదిలోకి విసిరేయడం చూసిన ఆటోడ్రైవర్ పోతినేని మురళీకృష్ణ ఆటోను ఆపి అమాంతం నీళ్లలో దూకి, బిడ్డను రక్షించాడు. ఈ లోగానే తల్లి నాగసుజాత కూడా ఎగిరి కృష్ణానదిలో దూకింది. ఆమెను రక్షించేందుకు అటుగా వెళుతున్న ఎం.విజయకుమార్ అనే యువకుడు నదిలోకి దూకాడు. ఎంతో ప్రయాసపడి నీట మునిగిన ఆమెను రక్షించి, బ్యారేజి గేట్లపైకి చేర్చాడు. కేర్ కేర్ మంటూ ఏడుస్తున్న బిడ్డ ఒకవైపు, నీళ్లు తాగి కోమాలోకి వెళ్లిన తల్లి మరోవైపు... ఇలా.. రెండు గంటలపాటు ఇద్దరు యువకులు తాము రక్షించిన తల్లీబిడ్డలతో బ్యారేజి గేట్లపైనే సహాయం కోసం నిరీక్షిస్తూ ఉండిపోయారు. చివరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్థానిక జాలర్ల సహాయంతో వారిని పైకి తీసుకువచ్చి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నాగసుజాత భర్త పవన్ ఆస్పత్రికి వచ్చి ఏడుస్తున్న బిడ్డను అక్కున చేర్చుకున్నాడు. పుట్టింటికంటూ ఉదయం 9 గంటలకు తన భార్య బిడ్డతో సహా బయటకు వచ్చిందని, ఇంతటి అఘాయిత్యానికి ఎందుకు పాల్పడిందో తెలియదని అంటున్నాడు పవన్. నాగసుజాత చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భార్యాభర్తల మధ్య సహజంగా ఉండే కీచులాటలు తప్ప పెద్ద గొడవలేం లేవనేది అతని వాదన. సుజాత స్పృహలోకి వస్తే తప్ప అసలు విషయం తెలియదు.