తుళ్ళూరు : ముఖ్యమంత్రితో సమావేశమయ్యేందుకు ఆశగా వెళ్లిన రైతులు అసంతృప్తితో వెనుదిరిగారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులకు ప్యాకేజీ పెంపుపై సీఎం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదు. అరకొర చర్చలతో అయిందనిపించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్టయింది.
తుళ్ళూరు మండలంలో కృష్ణానది ఆయకట్టు గ్రామాలకు చెందిన ఎక్కువ మంది రైతులు రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి భూములు ఇవ్వబోమని తేల్చి చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం విజయవాడ వ స్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న గ్రామాల రైతులు హాజరుకావాలని మంత్రి వర్గ ఉపసంఘం శుక్రవారం రాత్రి సమాచారం అందించింది. దీంతో శనివారం ఉదయం కొందరు రైతులు వెళ్లేందుకు సమాయత్తమయ్యారు.
తీరా బయలుదేరే సమయంలో భూములు ఇచ్చేందుకు అంగీకరిస్తున్న గ్రామాల రైతులు కూడా ప్యాకేజీలు ప్రకటించిన సీఎంను సత్కరించేందుకు బయలు దేరుతున్నారని తెలుసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం వుండక పోవచ్చని, కలిసినా ఆయన పెద్దగా మాట్లాడేది వుండదని భావిం చిన చాలా మంది రైతులు విజయవాడ ప్రయాణం విరమించుకున్నారు. మంత్రివర్గ ఉపసంఘ సమావేశానికి వస్తామని హామీ ఇచ్చిన రైతులకు మాత్రం వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. అనుకూలంగా ఉన్న రైతులతో సన్మానాలు, సత్కారాలు ముగిశాక పలు నాటకీయ పరిణామాల అనంతరం విజయవాడ ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలోని మంత్రి ఉమ చాంబర్‌లో మంత్రి పుల్లారావు నేతృత్వంలో భూములు ఇవ్వబోమన్న రైతులతో సీఎం సమావేశమయ్యారు.
ప్యాకేజీలో ఆ తేడా ఏదీ..? : ఈ సందర్భంగా వెంకటపాలెం మాజీ ఎంపీటీసీ బెల్లంకొండ నరసింహారావు మాట్లాడుతూ బైపాస్ రోడ్ నిర్మాణం అయినప్పటి నుంచి కృష్ణానది ఆయకట్టు గ్రామాల భూములు ధరలు బాగా పెరిగాయన్నారు. దీంతో తమ భూముల ధర ఎకరం రూ.3 కోట్ల వరకు పలుకుతుందన్నారు. ప్రకటించిన ప్యాకేజీ కృష్ణానది ఆయకట్టు గ్రామాల రైతులకు తీరని అన్యాయం చేసినట్లేనని వివరించారు. దీనిపై సీఎం మాట్లాడుతూ అందుకే జరీబు భూములు తీసుకున్న చోటే జరీబు రైతులకు, మెట్ట భూములు తీసుకున్న చోట మెట్ట రైతులకు 1300, 1200 గజాల భూము లు ఇస్తున్నామని సమాధానం చెప్పారు.
మందడం రైతు కొండెపాటి సతీష్‌చంద్ర మాట్లాడుతూ మూడు పంటలు పండించడం అంటే ఒకే సమయంలో ఒకేపొలంలో అంతర్గత పంటలుగా మూడు పంటలు పండిస్తామని, దానికి తగినట్టుగానే ఆదాయం కూడా వస్తుందని తెలిపారు. ఒక్క ఎకరం జరీబు భూమి పదెకరాల మెట్ట భూమితో సమానమని, ప్యాకేజీలో ఈ తేడా లేకపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు వివరించారు. దీనికి సమాధానంగా సీఎం ఇక్కడ ఎకరం అమ్మేసి అక్కడ 10 ఎకరాలు మెట్ట కొనుక్కోవలసిందని చమత్కరించారు. ఈ ప్రాంతంలో మీరు రాజధాని నిర్మిస్తున్నట్లు ముందుగా లీకులిస్తే అదేపని చేసి వుండేవాడినని రైతు సతీష్ చంద్ర చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులతో నిండిపోయింది.
రైతులంతా రాజకీయాలకు అతీతంగా సహకరిస్తే సాధ్యమైనంత మేలు జరిగేలా చూస్తానని చెప్పి సీఎం సభ ముగించారు. దీనికి సంతృప్తి చెందని రైతులు నిరాశతో వెనుతిరిగారు. వెళ్లిన రైతులకు ఎలాంటి హామీ లభించక పోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చిందని పలువురు రైతులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటపాలెం నుంచి మాజీ ఎంపీటిసి బెల్లం కొండ నరశింహారావుతో పాటు, ప్రస్తుత ఎంపీటీసీ పత్తిపాటి నాగమల్లేశ్వరరావు, రైతు నాయకులు లంకా సుధాకర్, మందడం నుంచి కొండెపాటి సతీష్‌చంద్రతో పాటు, మందడం సొసైటీ అధ్యక్షుడు బెజవాడ రమేష్, జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు పాల్గొన్నారు.
అరకొర చర్చలు.. అసంతృప్తితో రైతులు
Published Sun, Dec 14 2014 3:28 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
Advertisement
Advertisement