మంగళగిరి రూరల్ : ఇసుక అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. జిల్లాలోని కృష్ణానదీ పరివాహకప్రాంతాల్లో ఇసుకను అక్రమార్కులు తమ ఇష్టారాజ్యంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అమరావతి మండలంవైకుంఠపురం ఇసుక రీచ్ నుంచి నిత్యం ఇసుకను లారీలద్వారా తెలంగాణ రాష్ట్రానికి తరలించి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.
ఇసుక లారీల రాకపోక లతో రహదారులు గోతులమయంగామారడ ంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి, వైకుంఠపురం ప్రాంతాల నుంచి ఇసుకలారీలు హైదరాబాద్ తరలి వెళుతున్నాయి.
ఒక్కో లారీలో 20 నుంచి 22 టన్నుల ఇసుకను రవాణాచేయాల్సి వున్నా 50 టన్నుల మేర తరలిస్తున్నారు.పెద్ద ఎత్తున ఇసుక తరలిపోతున్నా అధికారులు చర్యలుతీసుకున్న దాఖలాలు లేవు.వైకుంఠపురం ఇసుక రీచ్ నుంచి బయలు దేరే లారీలు అడ్డదారి ప్రయాణాన్ని సాగిస్తున్నాయి. తుళ్లూరు మీదుగా మంగళగిరి, విజయవాడ అక్కడి నుంచి ఇతర జిల్లాలతో పాటు హైదరాబాద్ వెళుతున్నాయి.
ఇసుక లోడుకు టార్ఫాలిన్ పట్టలు కప్పి ఇసుకను తరలిస్తున్నారు.జిల్లాలతో పాటు రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నా అధికారులకు ఏ మాత్రం పట్టడం లేదు. రీచ్ నిర్వాహకులు మార్గమధ్యలో వారి అనుచరులను నియమిస్తున్నారు. అధికారులు ఎవరైనా లారీలను ఆపితే వెంటనే సమాచారం తెప్పించుకుని ఫోన్లలోనే వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు.
గతంలో తరచూ దాడులు చేసి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన అధికారులు ప్రస్తుతం మిన్నకుండిపోయారు.ఎస్పీ రామకృష్ణ ఆదేశాలు బేఖాతర్...రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఆదేశాలు జారీ చేసినా ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడలేదు. ఇసుకను అక్రమంగా రవాణా చేసినా, లారీలకు ఓవర్‌లోడ్ చేసినా కఠిన చర్యలు తప్పవని రెండు రోజుల కిందట రూరల్ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు.
తెలంగాణకు అమరావతి ఇసుక
Published Thu, Aug 7 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM
Advertisement