మంగళగిరి: నవ్యాంధ్రకు మణిహారంగా మారబోతున్న ఎయిమ్స్ నిర్మాణంలో కీలక ఘట్టం పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి బృందం శనివారం మంగళగిరిలో పర్యటించింది. టీబీ శానిటోరియం స్థల పరిశీలన చేసి, పూర్తి స్థాయి వివరాలు సేకరించింది. దీనిపై ప్రభుత్వానికి సానుకూల నివేదిక ఇవ్వనున్నారనే భావన అధికారులు మాటల్లో వ్యక్తమయింది. ఇక ఇదే చివరి బృందం పరిశీలన అని, ప్రభుత్వం అనుమతులివ్వడమే తరువాయని అధికారులు వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి, యుద్ధ ప్రాతిపాదికన నిర్మాణం చేపడితే మరో మూడేళ్లలో రాష్ట్ర ప్రజలకు జాతీయస్థాయి అత్యాధునిక వైద్యసదుపాయం అందించే అవకాశం ఉంది.
శానిటోరియం పరిసరాల చిత్రీకరణ.. మంగళగిరిలోని టీబీ శానిటోరియం స్థల పరిశీలనకు వచ్చిన బృందం అధికారుల నుంచి వివరాలు సేకరించింది. దీంతో పాటు స్థలానికి సంబంధించిన అన్ని ప్రాంతాలను బృంద సభ్యుడు సీనియర్ ఆర్కిటెక్ రాజీవ్‌ఖన్నా వీడియోలో నిక్షిప్తం చేశారు.
ఎయిమ్స్‌కు రాకపోకల కోసం రాజధాని సరిహద్దురోడ్‌తో పాటు తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారి ప్రాంతాన్ని చిత్రీకరించారు. ఈ దృశ్యాలను మరోసారి పూర్తిస్థాయిలో బృందం పరిశీలించనుంది. రెండుకొండలు, రెండు రహదార్ల మధ్యతో ఉండటంతో పాటు ఏపీఎస్పీ బెటాలియన్ క్యాంపు ఎంతదూరం వుంది, దానివలన ఆసుపత్రి నిర్మాణానికి అడ్డంకులేమైనా ఎదురవుతాయా అనే విషయాలు ఆరాతీశారు. ఏపీఎస్‌ఎంఐడీసీ, అటవీశాఖ, విద్యుత్‌శాఖ, కోస్టల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అధికారులు హాజరై బృంద సభ్యులకు వివరాలు అందించారు. అటవీప్రాంతంలో భారీ వృక్షాల తొలగింపు, దీనివల్ల పర్యావరణానికి, అడవి జంతువులకు కలిగేముప్పు, కొండప్రాంతాన్ని చదును చేయడం వంటి అంశాలపై జిల్లా అటవీశాఖాధికారి జగన్మాధరావును అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆర్డీవో భాస్కరనాయుడు, ల్యాండ్ సర్యే ఏడీఏ కెజియాకుమారి, ఏపీఎంఎస్‌ఐడీసీ సీఈ డి.రవీ్రంద, ఎస్‌ఈ కోటేశ్వరావు, ఈఈ వై అశోక్‌కుమార్, ఏఈ మురళి, విద్యుత్ ఎస్‌ఈ సంతోషరావు, డీఈ పిచ్చయ్య, ఏడీఏ రాజేష్‌ఖన్నా, మంగళగిరి, తాడేపల్లి తహశీల్దార్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొని ఉన్నతాధికారుల బృందానికి కావాల్సిన వివరాలను అందించారు.
దీంతో ఎయిమ్స్ నిర్మాణం జిల్లాలోనే జరుగుతుందనే దృఢ నిశ్చయానికి వచ్చిన అధికారులు అనంతరం నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై నిమగ్నమయ్యారు. ఎయిమ్స్ నిర్మాణంతో 500 పడకల ఆసుపత్రిలో అత్యాధునిక వైద్యంతో పాటు మెడికల్ కళాశాల, అంతర్జాతీయ పరిశోధనకేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇది నవ్యాంధ్రకు మణిహారంగా మారుతుందనడం అతిశయోక్తి కాదు.
కీలక ఘట్టం పూర్తి
Published Sun, Dec 21 2014 2:02 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement