తీవ్ర కరువుంటేనే కేంద్ర సాయం
- కేంద్ర మార్గదర్శకాల్లో ‘మధ్యస్థ కరువు’ కేటగిరీ ఎత్తివేత
- ఫలితంగా విపత్తు సాయానికి భారీ కోత పడే అవకాశం
సాక్షి, హైదరాబాద్: కరువు నిర్ధారణ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం తీవ్ర కరువు, మధ్యస్థ కరువు, సాధారణ కరువు కేటగిరీలున్నాయి. వాటిల్లో మధ్యస్థ కరువు అనే కేటగిరీని ఎత్తివేస్తూ మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆ ప్రకారం ఇప్పుడు రెండు కేటగిరీలే ఉంటాయి. ఇక సాధారణ కరువు అంటే కరువు లేనట్లేనని ప్రకటించే అవకాశముంది. మధ్యస్థ కరువు ప్రాంతాలన్నీ కూడా సాధారణ కరువు కేటగిరీలోకి రానున్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. అంటే తీవ్ర కరువుగా గుర్తిస్తే తప్ప ఆయా రాష్ట్రాల రైతులకు జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి ఆర్థిక సాయం వచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎటువంటి స్పందనా తెలియపరచలేదని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు.
6 అంశాల ఆధారంగా కరువు నిర్ణయం
కేంద్ర నిబంధనల ప్రకారం ఆరు అంశాలను కరువు నిర్ధారణకు పరిగణనలోకి తీసుకుం టారు. అందులో 1) వర్షాభావ పరిస్థితులు, 2) వర్షానికి వర్షానికి మధ్య అంతరం (డ్రైస్పెల్), 3) తేమ సమగ్ర సూచిక (ఎంఏఐ), 4) నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ (ఎన్‌డీవీఐ), నార్మలైజ్డ్ డిఫరెన్స్ వాటర్ ఇండెక్స్ (ఎన్‌డీడబ్ల్యూఐ), 5) సాగు విస్తీర్ణం, 6) దిగుబడుల లెక్క. వీటిలో ఐదు అంశాలు అనుకూలంగా ఉంటే కరువుగా ప్రకటిస్తారు. ఒక్కోసారి సడలింపులు ఇస్తా రు. అప్పుడు నాలుగింటిని గీటురాయిగా తీసుకుంటారు. ఇక వర్షపాతం విషయానికి వస్తే 50 శాతానికి తక్కువగా ఉండాలి. వర్షానికి వర్షానికి మధ్య 21 రోజులకు మించి అంతరం ఉండాలి. సాగు విస్తీర్ణాన్నీ లెక్కి స్తారు. పంటల దిగుబడి 50 శాతానికి పడిపోవాలి. పశుగ్రాసానికి కొరత ఏర్పడాలి. అందులో ఇప్పటివరకు మధ్యస్థ, తీవ్ర కరువు ఉన్నప్పుడు కరువు మండలాలు ప్రకటించారు.
ఆ ప్రకారం కేంద్రం సాయం ప్రకటించేది. ఇకనుంచి కరువు సాధారణంగా ఉంటే ఆయా మండలాలను లెక్కలోకి తీసుకోరని అధికారులు అంటున్నారు. మధ్యస్థ కరువు అనే కేటగిరీని ఎత్తివేయడం వల్ల కరువు మండలాలు తగ్గే అవకాశముందని అంటున్నారు. మొత్తంగా తీవ్ర కరువు పరిస్థితులను ఈ ఆరు అంశాల తీవ్రతను బట్టి నిర్ణయిస్తారని తెలుస్తోంది. కాగా కొత్త మార్గదర్శకాలపై ఇప్పటికే కర్ణాటక అభ్యంతరాలు వ్యక్తంచేసింది. మధ్యస్థ కరువు కేటగిరీని ఎత్తివేయడం వల్ల రాష్ట్రాలే తమ సొంత ఖజానా నుంచి రైతులకు సాయం చేయాల్సి వస్తుంది. కేంద్ర మార్గదర్శకాల్లో మధ్యస్థ కరువుకు అవసరమైన సాయాన్ని రైతులకు రాష్ట్రాలే చేయాలని పేర్కొనడంపైనా విమర్శలు వస్తున్నాయి.