కరువు నివారణలో ప్రభుత్వాలు విఫలం
► ఏఐఎఫ్‌టీయూ (న్యూ) కేంద్ర ప్రధాన కార్యదర్శి అరవింద సిన్హా
► గుంటూరులో ప్రారంభమైన రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు
గుంటూరు వెస్ట్ : దేశ వ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తున్నా నివారణ చర్యలు చేపట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (న్యూ) కేంద్ర ప్రధాన కార్యదర్శి అరవిందసిన్హా విమర్శించారు. మూడు రోజుల పాటు జరగనున్న రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర మహాసభలు శుక్రవారం గుంటూరులో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలోని బళ్లారి రాఘవ ఓపెన్ ఆడిటోరియంలో బహిరంగ సభ జరిగింది. సభలో అరవిందసిన్హా మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్ విధానాలతో దేశంలో రైతాంగానికి సబ్సిడీలు తగ్గిపోయాయని, విదేశాల్లో రైతులకు సబ్సిడీలు పెరిగాయని తెలిపారు.
దీంతో విదేశీ ఉత్పత్తులు తక్కువ ధరలకే దేశ మార్కెట్‌లోకి రావడంతో మన ఉత్పత్తులకు మార్కెట్ లేక రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీచాయ్‌వాలా కాదని, బూర్జువా వాలా అంటూ ఘాటుగా విమర్శించారు. సభకు అధ్యక్షత వహించిన రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ నేడు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి పాలకులు అనుసరిస్తున్న విధానాలే కారణమని ధ్వజమెత్తారు. సీపీఐ (ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యుడు గుర్రం విజయ్‌కుమార్ మాట్లాడుతూ రాజధాని కోసం ఏడాదిలో మూడు పంటలు పండే 33 వేల ఎకరాల సారవంతమైన భూములను సమీకరణ పేరుతో రైతుల నుంచి గుంజుకోవడాన్ని తప్పుపట్టారు. సభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు భూములను కట్టబెట్టే విధానాలను వ్యతిరేకించాలని కోరారు. ఉద్యమాలకు పురిటిగడ్డ గుంటూరు జిల్లా అని పేర్కొన్నారు.
సభలో ఏఐకేఎంకేఎస్ నాయకులు శంభుమోహతో (జార్ఖండ్), ఎస్‌డీ బోసు (బీహార్), శ్రీకాంత్ మొహంతీ (ఒడిషా), విందైవేందన్ (తమిళనాడు), కృష్ణన్‌కుట్టి (కేరళ), కె.బాబూరావు (మహారాష్ట్ర), రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.కోటయ్య, రాష్ట్ర నాయకులు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, భూతం వీరయ్య, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పి.అంజయ్య, జనశక్తి సంపాదకుడు డాక్టర్ పి.జశ్వంత్‌రావు, చాగనూరు మల్లికార్జునరెడ్డి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి పి.కోటేశ్వరరావు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భారీ ప్రదర్శన..
రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ప్రదర్శన నిర్వహించారు. నగర పాలక సంస్థ కార్యాలయం మీదుగా కొత్తపేట, భగత్‌సింగ్ విగ్రహం, నాజ్‌సెంటర్ తదితర ప్రాంతాల మీదుగా ప్రదర్శన కొనసాగింది. బహిరంగసభ ప్రారంభం ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, రైతాంగ సమస్యలపై నిర్వహించిన పొలికేక నృత్య నాటిక సభికులను ఆకట్టుకున్నాయి.