తమిళనాడుకు కేంద్రం భారీ సాయం
న్యూఢిల్లీ: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు రూ.2,014.45 కోట్ల సాయాన్ని ప్రకటించింది. తమిళనాడుకు విడుదల చేయాల్సిన ఆర్థిక సాయంపై ఈ నెల 23న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విపత్తు సహాయ నిధి(ఎన్డీఆర్‌ఎఫ్) నుంచి ఈ సహాయాన్ని అందించేందుకు కమిటీ ఆమోదించింది.
ఇందులో రూ.1748.28 కోట్లు కరవు సాయం కాగా, రూ. 264.11 కోట్లు 'వార్దా' తుపాను సాయం, రూ.2.05 కోట్లు జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద విడుదలైంది. వర్దా తుపానుతో పాటు వర్షాభావ పరిస్థితులవల్ల కరువుతో అల్లాడుతున్న తమ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా తమిళనాడు... కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర బృందం తమిళనాడులో పర్యటించి, పరిస్థితిని అంచనా వేసింది. ఐఎంసీటీ ఇచ్చిన నివేదక ప్రకారం కేంద్రం శనివారం తమిళనాడుకు ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది.
కాగా కరువు కోరల నుంచి రైతులను ఆదుకోవాలంటూ తమిళనాడు రైతులు గత కొద్దిరోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రైతుల ధర్నాకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలుపుతూ, తక్షణమే కరువు సాయాన్ని విడుదల చేయాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. మరోవైపు కేంద్రం సాయంపై అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పెదవి విరిచారు. కరువు సాయానికి ప్రభుత్వం సరిపడా నిధులు మంజూరు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు కర్ణాటక రాష్ట్రానికి కూడా రూ.1235.52 కోట్ల సాయాన్ని కేంద్రం విడుదల చేసింది. కరువుతో అల్లాడుతున్న ఆ రాష్ట్రానికి కేంద్రం జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి ఈ సాయాన్ని అందిస్తోంది.