చేతిలో రూ. కోట్లు ఉన్నా..
Published Fri, Jul 8 2016 12:49 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
అడుగడుగుకో సమస్య.. అభివృద్ధిలో వెనుకంజ.. వరుస కరువు.. బయటపడే అవకాశం ఉన్నా అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. చేతిలో కోట్లాది రూపాయల నిధులున్నా.. ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం. ఒకటి కాదు.. రెండు కాదు.. వంద కోట్ల నిధులు మూలుగుతున్నా.. రెండేళ్లలో ఖర్చు చేసిన మొత్తం రూ.2కోట్లు. నిధుల వినియోగం ప్రతిపాదనల దశ దాటకపోవడం.. ఉన్నతాధికారి సూచించే మార్పులు, చేర్పులతోనే కాలం గడిచిపోవడం చూస్తే.. అభివృద్ధి పట్ల అధికారుల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.
కర్నూలు(అగ్రికల్చర్): అత్యంత వెనుకబడిన ప్రాంతాలు, కరువు పీడిత గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి కింద ఏటా రూ.50 కోట్లు కేటాయిస్తోంది. ఇలా జిల్లాకు 2014-15లో రూ.50 కోట్లు, 2015-16లో రూ.50 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను ఆరు నెలల క్రితమే వివిధ శాఖలకు కేటాయించినా ఇప్పటి వరకు అభివృద్ది, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపాదనల దశలోనే ఉండిపోయాయి. జిల్లా ట్రెజరీ పీడీ ఖాతాలో ఈ నిధులు మూలుగుతున్నా వినియోగించుకోవడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిధులు పీడీ ఖాతాలో ఉండటం వల్ల ల్యాప్స్ అయ్యే అవకాశం లేకపోయినా.. వడ్డీ కూడా వచ్చే పరిస్థితి లేకపోవడం గమనార్హం. 2014-15లో విడుదలయిన రూ.50కోట్లను వివిధ శాఖలకు కేటాయించారు.
ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ.16.60 కోట్లు, ఏపీఎస్‌ఐడీసీకి రూ.14.24 కోట్లు, సెరికల్చర్‌కు రూ.4.18 కోట్లు, హార్టికల్చర్‌కు రూ.4.53 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.6.22 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.3.08 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.1.71కోట్లు, డీఆర్‌డీఏకు రూ.21.8 లక్షలు, ఏపీఎంఐపీకి రూ.21 లక్షల ప్రకారం కేటాయింపులు చేపట్టారు. కానీ ఇంతవరకు ఆర్‌డబ్ల్యూఎస్, హార్టికల్చర్, సెరికల్చర్, ట్రాన్స్‌కో నుంచి రూ.23 కోట్లకు మాత్రమే ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.2కోట్లు మాత్రమే వ్యయం చేయగలిగారు. అన్ని శాఖల అధికారులు ప్రత్యేక అభివృద్ధి నిధులను జిల్లా కలెక్టర్ ఆమోదంతోనే ఖర్చు చేయాల్సి ఉంది. కొన్ని శాఖల అధికారులు ప్రతిపాదనలు ఇస్తున్న మార్పులతోనే గడిచిపోతున్నట్లు తెలుస్తోంది.
2015-16 నిధుల వినియోగం ఎప్పుడో..
2014-15లో విడుదలయిన నిధులకే మోక్షం లేదు.. ఇక 2015-16లో విడుదలయిన నిధులను ఎప్పటికి ఖర్చు చేస్తారనేది వేయి డాలర్ల ప్రశ్న. ఈ ఏడాది విడుదల చేసిన రూ.50 కోట్లలో జిల్లా నీటి యాజమాన్య సంస్థకు రూ.25కోట్లు, ఆర్‌డబ్ల్యుఎస్‌కు రూ.24.50 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.47.50 లక్షలు కేటాయించారు. ఇప్పటికీ ఈ నిధుల వినియోగం ప్రతిపాదనల దశలోనే ఉండటం గమనార్హం. జిల్లాలో రైతుల అభ్యున్నతికి, వ్యవసాయంలో అధిక ఉత్పాదకత సాధించడానికి, నీటి సమస్య పరిష్కారానికి, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అంతా మాటలు
జిల్లా యంత్రాంగం చెప్పే మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన లేకుండా పోతోంది. ఫాంపాండ్ తవ్వించుకున్న రైతులకు సబ్సిడీపై ఆయిల్ ఇంజిన్‌లు, థైవాన్ స్ప్రేయర్లు ఇస్తామని ప్రకటించారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులను వినియోగించాలని నిర్ణయించారు. కాని ఇంతవరకు ఏ ఒక్క రైతుకు ఆయిల్ ఇంజన్‌లు, థైవాన్ స్ప్రేయర్లు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. ఇలా పట్టుపరిశ్రమ అభివృద్ధికి, పాడిరైతుల అభ్యున్నతికి ఎన్నో వరాలు ప్రకటించారు. అయితే ఏదీ కార్యరూపం దాల్చని పరిస్థితి.
ఈ నిధులు వినియోగంపైనే భవిష్యత్..
ఇప్పటి వరకు జిల్లాకు విడుదల చేసిన రూ.100 కోట్లు వ్యయం చేస్తేనే 2016-17 ఆర్థిక సంవత్సరం నిధులు రూ.50 కోట్లు విడుదల అవుతాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏ సంవత్సరం విడుదల చేసిన నిధులను అదే ఏడాది మార్చిలోపు వినియోగించాల్సి ఉంది. కానీ అలా చేయాకుండా నిధులను పీడీ ఖాతాలో ఉంచుకొని కాలం గడుపుతున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం నిధులు విడుదల అవుతాయా... లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Advertisement
Advertisement