ఐదు కిలోల బరువుతో బాలిక జననం
శృంగవరపుకోట:విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వాస్పత్రిలో శనివారం ఉదయం ఓ మహిళ 5 కిలోల బరువు కలిగిన పాపకు జన్మిచ్చింది. లక్కవరపుకోట మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన ముల్లవరపు సంతోషి అనే గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు శనివారం ఉదయం 6 గంటలకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఉదయం 6.30గంటల సమయంలో ఆమెకు సాధారణ ప్రసవం జరిగి, ఐదు కిలోల బరువు ఉన్న ఆడపిల్ల జన్మిం చింది.
శిశువు బరువు ఎక్కువగా ఉండడంతో విస్మయం చెందిన వైద్యులు పరీక్షలు చేశారు. అన్నివిధాలా బిడ్డ, తల్లీ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. సంతోషికి మూడేళ్ల క్రితం తొలి కాన్పులో సాధారణ ప్రసవం జరిగి 3.5 కిలోల బరువుతో మగబిడ్డ పుట్టాడు. ప్రస్తుతం రెండవ కానుపులో పుట్టిన శిశువు బరువు ఐదు కిలోలు ఉండడం పట్ల ఆస్పత్రి ఇన్‌చార్జ్ దిలీప్‌కుమార్, డాక్టర్ ఎం.హరిలు మాట్లాడుతూ సాధారణంగా సరాసరి 2.8కిలోల బరువుతో శిశుజననాలు నమోదవుతాయి. ఇంతవరకూ 4కిలోల బరువు ఉన్న వారిని చూశాం. కొన్ని కేసుల్లో మధుమేహం, హైపోథైరాయిడ్, జన్యుపరమైన సమస్యలు ఉన్న వారిలో అధిక బరువుతో బిడ్డ పుట్టడం జరుగుతుందని చెప్పారు.
తల్లి, బిడ్డలకు షుగర్ టెస్ట్ చేయిస్తే, మధుమేహం లేదని తేలింది. ైథైరాయిడ్ పరీక్షలతో పాటూ బిడ్డ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపేందుకు, పూర్తి వివరాలు తెలుసుకోవటానికి విశాఖ కేజీహెచ్‌కు ప్రత్యేకంగా రిఫర్ చేస్తామంటూ చెప్పారు. పుట్టిన బిడ్డ బొద్దుగా, ఎర్రగా ఉండటంతో వార్డులో మహిళలు, వైద్య సిబ్బంది బిడ్డను అపురూపంగా చూస్తూ ఎత్తుకుని ముద్దాడుతున్నారు.