మృత్యుసాగరం | Children died in PALASA | Sakshi
Sakshi News home page

మృత్యుసాగరం

Published Thu, Mar 24 2016 11:13 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

Children died in PALASA

 ‘కుంకుమసాగరం’ మృత్యుకుహరంగా మారింది.  గత ఏడాది హోలీ వేడుక రోజు పలాస రైల్వే కాలనీకి చెందిన రాపాక వికాస్ అనే విద్యార్థిని మింగేసింది.  తాజాగా.. ఇద్దరు చిన్నారుల పాలిట కూడా ఇదే మృత్యుకుహరంగా మారింది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.  గ్రామంలో అంతులేని విషాదం నింపింది.
 
 పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు సూదికొండ కాలనీకి చెందిన వడ్డి కార్తీక్ (9), కోతి మహేంద్ర(10) సూదికొండ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగు, ఐదు తరగతులు చదువుతున్నారు.  ఈ ఇద్దరు చిన్నారులు అదే గ్రామానికి చెందిన సింహాద్రి, ఇంద్ర అనే ఇద్దరు సహచరులతో కలిసి గురువారం మధ్యాహ్నం పాఠశాల విడిచిపెట్టిన తరువాత తమ తల్లిదండ్రులు పనిచేస్తున్న పలాస పారిశ్రామికవాడలోని జీడి పరిశ్రమవద్దకు వెళ్లారు. అక్కడ వారి తల్లిదండ్రులను కలిశారు. ఇక్కడే ఆడుకోమని తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పి బయటకు పంపించేశారు. మృత్యువు పొంచి ఉందన్న విషయం తెలియని ఆ చిన్నారులు.. అలవాటు ప్రకారం సమీపంలోని కుంకుమసాగరం  చెరువు వద్దకు స్నానాల కోసం వెళ్లారు.
 
 స్నేహితుల కళ్లముందే...
 వడ్డి కార్తీక్, కోతి మహేంద్రతోపాటు  సింహాద్రి, ఇంద్ర స్నానాలకని చెరువులో దిగారు. కార్తీక్, మహేంద్ర ఉన్నట్టుండి ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. ఈ హఠాత్పరిణామానికి సింహాద్రి, ఇంద్ర బెంబేలెత్తిపోయి... పరుగుపరుగున వెళ్లి ఇటుకబట్టీలు వద్ద కార్మికులకు తెలిపారు. వారు వెంటనే వచ్చి చెరువులో దిగి ఇద్దరు చిన్నారులను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిం ది. అప్పటికే మృతి చెందినట్టు గుర్తిం చారు. పారిశ్రామికవాడలోని చిన్నారుల కుటుంబీకులకు విషయం తెలియజేయగా వారు హతాశులయ్యారు. అప్పటి వరకు సంతోషంగా నవ్వుతూ కనిపించిన పిల్లలు అప్పడే విగతజీవులుగా మారారన్న విషయాన్ని జీర్ణించుకోలేక పరుగుపరుగున సంఘటన స్థలానికి చేరుకుని, బోరున రోదిస్తూ కుప్పకూలిపోయారు.
 
 వంశాంకురం పోయింది
 వడ్డి కార్తీక్ తండ్రి బాబూరావు వికలాంగుడు. స్క్రాప్ దుకాణంలో పనిచేస్తున్నాడు. కార్తీక్ తల్లి పార్వతి పారిశ్రామికవాడలో జీడి కార్మికురాలిగా పనిచేస్తోంది. బాబూరావు పార్వతిలకు కార్తీక్ ఒక్కడే కుమారుడు. దీంతో తన వంశాంకురాన్ని కోల్పోయామని ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకొని రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. కోతి మహేంద్ర తండ్రి శ్రీనివాసరావు, తల్లి ఆదిలక్ష్మి కూడా జీడి పరిశ్రమలో కార్మికురాలిగా పనిచేస్తున్నారు.
 
 కోతి మహేంద్రకు ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. కాశీబుగ్గ డీఎస్పీ ఎం.దేవప్రసాద్, సీఐ వై.రామకృష్ణ, ఎస్‌ఐలు కె.వి. సురేష్‌కుమార్, బి.శ్రీరామ్మూర్తి వెంటనే సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం  పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పలాస ప్రభుత్వాస్పత్రి వద్ద టెక్కలి ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు రెవెన్యూ అధికారులతో కలిసి మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ చెప్పారు.
 
  గతంలోనూ....
 గత ఏడాది హోలీ సందర్భంగా పలాస రైల్వేకాలనీకి చెందిన కొంతమంది యువకులు కూడా ఇలాగే స్నానాలకని కుంకుమసాగరం వద్దకు వెళ్లారు. అప్పట్లో పదో తరగతి పరీక్షలు రాయాల్సిన రాపాక వికాస్ అనే విద్యార్థి ఇదే కుంకుమసాగరంలో పడి మృతి చెందాడు.  ఐదేళ్ల క్రితం పలాస మండలం బొడ్డపాడులో జగ్గోరుబంద చెరువులో స్నానాలు చేస్తుండగా ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా చెరువుల లోతు పెంచడంతో లోతు ఎంత ఉందనేది తెలియక దిగిన వ్యక్తులు ఈత రాక ఈ విధంగా మృత్యువాత పడుతున్నారు. ఇటీవల కుంకుమసాగరంలో కూడా చెరువు అభివృద్ధి పేరుతో పొక్లెయిన్‌తో పనులు చేపట్టారు. ఇష్టానుసారంగా పెద్ద పెద్ద గోతులు చేస్తున్నారని, పద్ధతి ప్రకారం తవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువు తవ్వకాలపై అధికారులు ఓ కన్నేసి తగిన నిబంధనలు విధించాలనేది ప్రజలు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement