అమ్మకోసం ఇంకెన్నాళ్లు..! | Children Waiting For Her Mother In YSR Kadapa | Sakshi
Sakshi News home page

అమ్మకోసం ఇంకెన్నాళ్లు..!

Published Fri, Aug 17 2018 1:18 PM | Last Updated on Fri, Aug 17 2018 1:18 PM

Children Waiting For Her Mother In YSR Kadapa - Sakshi

అమ్మ కోసం ఆశగా ఎదురు చూస్తున్న చిన్నారులు (ఇన్‌ సెట్‌) కువైట్‌లో ఉన్న చిన్నారుల తల్లి పార్వతమ్మ (ఫైల్‌)

సాక్షి, కడప : అమ్మకోసం నిరీక్షణ తప్పడం లేదు...చిన్నారులకు కొంచెం ఊహ తెలిసే సమయానికి చూడాలనుకున్నా.. తల్లి కనుచూపు మేరలో కనిపించలేదు. ఎక్కడో దేశం కాని దేశంలో.. కుటుంబ భారం మోయడానికి వెళ్లిన తల్లి సేఠ్‌ కబంధ హస్తాల్లో చిక్కుకుని బయట పడలేకపోతోంది. ఇక్కడ చూస్తే దయనీయ స్థితి... ఒక వైపు తండ్రి దూరం .. మరోవైపు నానమ్మ లేక.. అమ్మ వస్తుందో రాదో తెలియక చిన్నారులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఇక్కడ చిన్నారులను చూసుకోవడం తాతయ్య (అబ్బ)కు తలకుమించిన భారంగా మారింది. ఎందుకంటే ఇన్ని రోజులు చిన్నారులతోపాటు కుటుంబానికి అన్నీ తానై చేసి పెడుతున్న నానమ్మ రామసుబ్బమ్మ జూన్‌ 13న పాముకాటుతో తనువు చాలించింది. ఇక పిల్లలతోపాటు సరిగా నడవలేక కట్టె సాయంతో నడుస్తున్న పెద్దాయన వెంకట రమణయ్య పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఇదంతా గాలివీడు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చిన్నారుల వ్యధాభరిత గాధ.

అమ్మ కోసం నిరీక్షణ
అమ్మకోసం దాదాపు మూడేళ్లుగా చిన్నారులు నిరీక్షిస్తూనే ఉన్నారు. తల్లి పార్వతమ్మను చూడాలని.. కలుసుకోవాలని వనజ, రెడ్డి నాగేంద్ర, శైలజ, సునీల్‌లు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన వారు ఇప్పుడు కొంచెం ఊహ తెలిసిన పిల్లలు కావడంతో అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఉన్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు.

కుటుంబం కోసం కష్టాలు
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలవాలని చిన్నారుల తల్లి పార్వతమ్మ కువైట్‌కు వెళ్లింది. దాదాపు మూడేళ్ల క్రితం వెళ్లిన ఆమె కొద్దిరోజుల వరకు ఎలా ఉందో కూడా సమాచారం లేని పరిస్థి. ఈ నేపథ్యంలో పార్వతమ్మ అత్త రామ సుబ్బమ్మ 2017 సంవత్సరం మే నెలలో చిన్నారులతో కలిసి వచ్చి అప్పటి కలెక్టర్‌ బాబూరావునాయుడును కలిసి పార్వతమ్మ ఆచూకీ కనిపెట్టాలని వేడుకుంది. అంతేకాకుండా స్వదేశానికి పిలిపించాలని మొర పెట్టుకుంది.  దీంతో ఏజెంటు ద్వారా అక్కడి సేఠ్‌తో మాట్లాడి పార్వతమ్మతో కుటుంబ సభ్యులను మాట్లాడించారు. అయితే పార్వతమ్మ కూడా అక్కడ సంతోషంగా లేకపోగా కష్టాలను అనుభవిస్తున్నానని.. సొంతూరికి పిలిపించుకోవాలని ఫోన్‌ చేసిన ప్రతి సందర్భంలోనూ రోదిస్తున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.

అమ్మకోసం ఏజెంటు ద్వారా ప్రయత్నం
గాలివీడు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన పార్వతమ్మను స్వదేశానికి రప్పించడం కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వెంకట రమణయ్య నాయుడు పిల్లలతో కలిసి జూన్‌ రెండవ వారంలో కలెక్టరేట్‌ మీకోసంలో అప్పుడు ఇన్‌ఛార్జి జేసీగా ఉన్న రామచంద్రారెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకోవడంతో బంధం యాప్‌ ద్వారా డీఆర్‌డీఏలో నమోదు చేశారు. అలాగే జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడను కూడా కలిసి పార్వతమ్మ కువైట్‌లో కష్టాలు పడుతోందని, స్వదేశానికి రప్పించాలని వేడుకున్నారు. ఈ పరిస్థితిలో ఎస్పీ కూడా కిందిస్థాయి సిబ్బందితో మాట్లాడి పార్వతమ్మను స్వదేశానికి పిలిపించేలా ఏజెంటు ద్వారా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.   ఒక వైపు డీఆర్‌డీఏ బంధం యాప్‌ అధికారులతోపాటు మరో వైపు గాలివీడు ఎస్‌ఐ మంజునాథ్‌ కూడా సంబంధిత ఏజెంటుతో చర్చించారు. పది పదిహేను రోజుల్లోపు తల్లి పార్వతమ్మ స్వదేశానికి వచ్చే అవకాశం ఉందని ఎస్‌ఐ వెల్లడించారు. అప్పటికైనా తల్లిని చూడాలనే కన్నబిడ్డల ఆశ నెరవేరుతుందో లేదో వేచి చూద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement