పుత్తూరు, న్యూస్‌లైన్ : వారు ఆరో తరగతి విద్యార్థులు. రోడ్డున వెళుతుండగా వారికి 15,500 రూపాయలు దొరికాయి. అదే సమయంలో తమ ఉపాధ్యాయులు చెప్పిన నీతి వాక్యాలు గుర్తుకొచ్చాయి. మరో ఆలోచనకు తావు లేకుండా సమీపంలోని పోలీసు వద్దకెళ్లి నగదు అప్పగించి శభాష్ అనిపించుకున్నారు. విద్యార్థుల నిజాయితీకి ముగ్ధుడైన సీఐ తన సొంత ఖర్చుతో వారికి కొత్త దుస్తులు కొనిచ్చారు. పుత్తూరు అంబేద్కర్ సర్కిల్‌లోని పోలీసు సబ్ కంట్రోల్ వద్ద మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో నల్లటి కవర్ పడివుంది. దీనిని ఎవరూ గుర్తించలేదు. అదే సమయంలో ఆరో తరగతి విద్యార్థులు లోకేష్, దినేష్ గుడ్‌షెపర్డ్ హాస్టల్ నుంచి సమీపంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల(మెయిన్)కు బయలుదేరారు. వీరు పోలీసు సబ్ కంట్రోల్ రూందాటుతుండగా నల్లటి కవర్ కంట పడింది. అందులో నగదు ఉండడాన్ని గుర్తించారు. నగదున్న కవర్‌ను సమీపంలో విధులు నిర్వహిస్తున్న పీఎస్‌ఐ రామలక్ష్ముణరెడ్డికి అందించారు.
అందులో రూ.15,500 ఉన్నట్లు గుర్తించిన ఆయన సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ రాజశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నగదు నిండ్ర మండలం మిట్టూరు వాసి సుబ్రమణ్యంరెడ్డికి చెందినదిగా గుర్తించారు. తర్వాత పాఠశాల హెడ్ మాస్టర్, విద్యార్థులు లోకేష్, దినేష్‌లను పాఠశాల నుంచి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. వారి సమక్షంలో నగదును సుబ్రమణ్యం రెడ్డికి అందజేశారు. నీతి, నిజాయితీతో మెలగాలని ఉపాధ్యాయులు చెప్పారని, ఆ మేరకే తాము నడుచుకున్నామని విద్యార్థులు తెలిపారు. వీరిని సీఐ చంద్రశేఖర్ అభినందించారు. ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని తన సొంత డబ్బుతో విద్యార్థులకు దుస్తులు కొనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రవిశంకర్, ప్రధానోపాధ్యాయుడు మునస్వామి, ఏఎస్‌ఐ రవి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చిన్నారుల నిజాయితీ
Published Wed, Jan 1 2014 4:21 AM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM
Advertisement