అనాథలకు ఆసరా | Childrens Observation Home Help To Orphaned Children | Sakshi
Sakshi News home page

అనాథలకు ఆసరా

Published Fri, May 18 2018 8:22 AM | Last Updated on Fri, May 18 2018 8:22 AM

Childrens Observation Home Help To Orphaned Children - Sakshi

అనాథ పిల్లలతో హోమ్‌ పర్యవేక్షణాధికారి నందగోపాల్‌

కన్నవారికి దూరమై..సమాజ నిరాదరణకు గురైన బాలికలకు ప్రేమా నురాగాలను పంచుతూ బాసటగా నిలుస్తోంది తిరుపతి అనంతవీధిలోని   ప్రభుత్వ చిల్డ్రన్స్‌ అబ్జర్వేషన్‌ హోమ్‌. రక్తం పంచినవారు.. నా అన్న వారు లేరన్న బాధను మరచి అనాథ బాలికలు అక్కడ సంతోషంగా వసుదైక కుటుంబంలా ఉంటున్నారు. కోరుకున్న చదువు చెప్పించి, వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహిస్తోంది ఈ హోమ్‌. సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసే బాధ్యతను సైతం తీసుకుంటోంది. 2008లో ఆరుగురు అనాథ పిల్లలతో ప్రారంమై.. ప్రస్తుతం136 మందితో హోమ్‌ నడుస్తోంది. హోమ్‌కు దాతలు సైతం ఆపన్న హస్తం అందిస్తున్నారు. అనాథలకు ఆలనగా నిలుస్తున్న ఈ హోం సేవలను తెలుసుకుందాం..

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: అనాథ పిల్లలకు బాసటగా నిలుస్తూ.. వారిలోని ప్రతిభను వెలికితీస్తోంది ప్రభుత్వ చిల్డ్రన్స్‌ అబ్జర్వేషన్‌ హోమ్‌ ఫర్‌ గరల్స్‌(అనాథ బాలికల పర్యవేక్షణ కేం ద్రం). అమ్మ ఒడికి, నాన్న లాలనకు నోచుకోని ఆడపిల్లలను బయట విద్యార్థులకు దీటుగా.. కోరుకున్న చదువును చదివిస్తూ అన్ని రంగాల్లో రాణించే విధంగా తయారు చేస్తోంది. తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయి ఒంటరైనవారుకొందరైతే, ఆస్పత్రుల్లో, చెత్తకుప్పలలో, రైల్వేస్టేషన్లలో, రోడ్లపై పసికందులుగా మానవ తావాదుల చెంతకు చేరినవారు మరికొందరు, ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న విధంగా ఎంతోమంది మానవతావాదులు ఈ హోమ్‌ కు ఆపన్నహస్తం అందిస్తున్నారు. చదువులో రాణించే బాలికలను ప్రభు త్వ గ్రాంట్స్‌తో పాటు దాతల సహాయంతో పేరొందిన ప్రైవేటు సంస్థల్లో చదివిస్తున్నారు.   వసతి గృహంలో అనేక హైటెక్‌ వసతులు కల్పిస్తున్నారు. సోలార్‌ వాటర్‌ప్లాంట్, ఆర్వో ప్యూరిఫైడ్‌ వాటర్‌ సిస్టం, వాషింగ్‌ మిషన్లు, ఇన్వర్టర్, కంప్యూటర్‌ ల్యాబ్‌ వంటి సౌకర్యలతోపాటు పండుగలకు స్పెషల్‌ మెనూతో ఆరోగ్యవంతమైన భోజనం కల్పిస్తున్నారు. 24 గంటలూ డాక్టర్ల పర్యవేక్షణ, చదువులో వెనుకబడిని విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ట్యూషన్‌ సౌకర్యాలు అందుతున్నాయి. కన్నవారు తమకు లేరన్న విషయం మరచిపోయేలా చదివిస్తున్నారు.

క్రీడలు, విహారయాత్రలు
విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి ఇండోర్‌ క్రీడల సౌకర్యం, నాటికలు, పురాణ కథలు, డ్రామాలు, కోలాటాలు, చెక్కభజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు. వీటితో పాటు యోగా, కరాటే, ధ్యానంతో బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రదేశాలకు విహార యాత్రలకు,  పుణ్యక్షేత్రాలకు బాలికలను హోమ్‌ నిర్వాహకులు ఏడాదికోసారి తీసు కెళుతున్నారు.

ఉన్నత విద్య.. వివాహ బాధ్యత
సంరక్షణతో పాటు ఉన్నత విద్య, ఉపాధి, ఉద్యోగాల వైపు వారిని నడిపింపించేందుకు హోమ్‌ పర్యవేక్షణాధికారి కృషి చేస్తున్నారు. డిగ్రీ, పీజీ, బీటెక్‌ వంటి కోర్సుల్లో చాలా మందికి ప్రవేశాలు కల్పించి ప్రోత్సహిస్తున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ అనుమతితో ఏడుగురికి అంగరంగ వైభవం గా వివాహం చేశారు.  భర్త, పిల్లలతో ఎంతో ఆనందంగా  జీవితాన్ని గడుపుతున్నామని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడా ది సెప్టెంబర్‌ నెలలోపు మరో 12 మందికి వివాహం చేయాలని ప్రణాళికలను రూపొం దిస్తున్నారు.

అనాథలు దేశ పౌరులు కారా?
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో నాలుగు కోట్లకు పైగా అనాథలు ఉన్నట్టు తేలింది. దేశ జనాభాలో వీరు నాలుగు శాతంగా చెప్పుకోవచ్చు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 24 లక్షల మందికిపైగా అనాథలు ఉన్నారు అమ్మానాన్న లేరనే బాధకన్నా ప్రస్తుత సమాజ చిన్నచూపు  బాధకలిగిస్తుందని అనాథలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనాథల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలు లేవు.  ఆధా ర్‌ కార్డ్, కులధ్రువీకరణ పత్రం, ఇన్‌కం సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణపత్రం వంటివి  అనాథలకు చాలా వరకు అందడంలేదు. దీంతో వారు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లకు నోచుకోక ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్‌ వంటివి అం దని ద్రాక్షే. ‘విదేశీయులకు సైతం భారతదేశ పౌరసత్వం ఇచ్చి గౌరవమిస్తున్నాం.. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన అనాథలకు పౌరసత్వం లేదంటే.. నిజంగా  ఎంత దౌర్భాగ్యం’ అని ప్రజాసంఘాలు, స్వచ్ఛంద∙సేవా సంస్థలు పేర్కొంటున్నాయి.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవుతా
నాపేరు ఎన్‌.నీలిమ, మాది కడప జిల్లా  రైల్వే కోడూరు,  2010లో 9వతరగతి చదువుతున్న సమయంలో అమ్మనాన్న చనిపోయారు. అప్పుడే ఇక్కడి హోమ్‌లో చేరాను. 9వతరగతి నుంచి ఇక్కడ ఉంటూ విద్యనభ్యసిçస్తున్నాను. పదో తరగతిలో 9.7 గ్రేడ్‌తో పాసయ్యాను. ఇంటర్మీడియెట్‌లో 96శాతం మార్కులు సాధించాను. ప్రస్తుతం శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బీటెక్‌ కంప్యూటర్స్‌లో 71శాతం మార్కులతో పాసయ్యాను. బీటెక్‌ మొదటి సంవత్సరం ఫీజులు, ఖర్చులను ఐపీఎస్‌  చారుసిన్హా  భరించారు. రెండు, మూడు సంవత్సరాలు హోమ్‌ పర్యవేక్షణాధికారి బి.నందగోపాల్‌ సార్‌ సొంత ఖర్చులతో చదివించారు. నేను సాప్ట్‌ ఇంజినీర్‌గా సెటిల్‌ అవ్వాలని ఉంది. అప్పుడప్పుడు తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తుంటారు. తల్లిదండ్రులను నందగోపాల్‌సార్‌లో చూసుకుంటున్నాను. నాకు ఏలోటు లేకుండా కుమార్తెలా చూసుకుంటున్నారు.  –ఎన్‌.నీలిమ, హోమ్‌ విద్యార్థి

గుడి వద్ద ఉన్నప్పుడు..
నాపేరు పూజ, మాది తిరుపతి అని తెలుసు అంతే. అమ్మానాన్నా ఎవరో నాకు తెలియదు. నాకు బంధువులు ఎవరు ఉన్నారో కూడా తెలియదు. ఒక రోజు రాత్రి తిరుపతి రాములవారి గుడి వద్ద కూర్చుని ఉంటే ఎస్‌ఐ నన్ను చేరదీసి ఈ హోమ్‌లో చేర్పించారు. అప్పుడు నావయస్సు 9 సంవత్సరాలు. ప్రస్తుతం ఇక్కడే ఉంటూ బీకాం రెండవ సంవత్సరం ప్రైవేటు కాలేజీలో  చదువుతున్నాను. ఇదంతా సార్‌ చలువే.  ఇతర పిల్లలను చూస్తే అమ్మానాన్న నన్ను ఇలా  ఎందుకు అనాథలా  వదలిపెట్టారో అని ఏడవాలనిపిస్తుంది. నా కాళ్లమీద నేను నిలబడి నాలాంటి వారిని ఆదుకుంటాను. కష్టపడి చదివి బ్యాంకు మేనేజర్‌గా రాణించాలని ఉంది. నందగోపాల్‌సార్‌ ప్రోత్సాహంతో చదువులో రాణిస్తున్నాను.        –పూజ, హోమ్‌ విద్యార్థిని

అనాథల కోసం ఏదైనా చేస్తా
‘అమ్మానాన్న ప్రేమకు దూరమైన ఓ అనాథ సరస్వతీ కుసుమం పుష్పకుమారి. ఆమెను కదిలిస్తే కన్నీరే. ఆ   బాలికకు అమ్మనాన్న గుర్తుకు వస్తున్నారేమో బోరున విలపిస్తూ పర్యవేక్షణాధికారి నందగోపాల్‌ వద్దకు చేరిం ది. ‘అమ్మా ఏడవకు , అమ్మానాన్నలేరని బాధపడకు. నిన్నులాలించడానికి మేమున్నాం ఎందుకంటే నువ్వు అనాథవైతే ఈ దేశమే అనా థ. నువ్వు ఎవరూలేనిదానివైతే ఈ సమాజం దిక్కులేనిదే’ అంటూ ఓదార్చసాగారు. ఇంతలో ‘సాక్షి’ ఆమె గురించి ఆరా తీయగా, బాలిక తన  గురించి చెప్పుకొచ్చింది. ‘ నాపేరు పుష్పకుమారి, మాది చిత్తూ రు జిల్లా పచ్చికాపల్లం. 9వ తరగతిలో ఉండగా  ఏడాదిన్నర కిందట తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందారు. తర్వాత ఇక్కడ హోమ్‌లో చేరా. పదో తరగతి పుత్తూరు ప్రభుత్వ గురుకుల పాఠశాల లో చదివాను. 10కి10 గ్రేడ్‌తో పాసయ్యాను. తల్లి దండ్రులు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తున్నారు. నా అనే వారు లేక ఈ ఆశ్రమంలో చదువుతున్నాను. ఇతర పిల్లల్లాగా తల్లిదండ్రులతో మమేకంగా ఉండాలనే ఆశ ఉన్నా విధి వక్రీకరించి నన్ను ఒంటరిదాన్ని చేసింది. ఇంటర్మీడియెట్‌లో బైపీసీ చదివి డాక్టర్‌ కావాలని ఉంది. నాలాంటి అనాథపిల్లల కోసం ఏదో ఒకటి చేయాలనే పట్టుదలతో ఉన్నాను. నందగోపాల్‌ సార్‌  అమ్మనాన్న లేని లోటు తీర్చుతున్నారు. సొంత డబ్బులతో ప్రైవేటు కళాశాలల్లో చాలా మందిని చదివిస్తున్నారు. మాకు ఆయనే తండ్రి. మేము డాడీ అనిపిలుస్తాం.– పుష్పకుమారి, హోమ్‌ విదార్థిని

ప్రేమానురాగాలను పంచుతున్నాం
చిల్డ్రన్స్‌ అబ్జర్వేషన్‌ హోమ్‌లో బాలికలందరూ ఒకే కుటుం బంలా జీవిస్తున్నారు. పిల్లలకు ఏ కొరతా లేకుండా చూస్తు న్నాం. ప్రభుత్వ సాయంతోపాటు దాతల ఔధార్యం వెలకట్ట లేనిది. వస్తురూపేణా తప్ప నగదు రూపంలో విరాళాలు స్వీకరించడం లేదు. ఇక్కడికి వచ్చే ప్రతి అనాథ బాలికను కన్న బిడ్డలా పోషించడమే కాకుండా, తాము అనాథలు అన్న బాధ ఎక్కడా కూడా వారిలో కలగకుండా ప్రేమానురాగాలను పం చుతున్నాం. నిజంగా వారి తల్లిదండ్రులు కూడా ఇంత గొప్పగా చూసేవారు కాదేమో. అనాథ పిల్లలకు వివాహం చేసిన తక్షణమే నా కష్టార్జితంతో సంపాదించిన రూ.50వేల నగదును వారి బ్యాంకు ఖాతాలో ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేస్తున్నాను. నా సొంత ఆస్తిలో సగభాగాన్ని అనాథ బాలిక సంక్షేమం కోసం   రాసిచ్చాను.  – బి. నందగోపాల్, పర్యవేక్షణాధికారి,చిల్డ్రన్స్‌ అబ్జర్వేషన్‌ హోం ఫర్‌ గరల్స్, తిరుపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement