లోయలో పడి ఇరుక్కుపోయిన చిన్నారులు
అదొక మృత్యులోయ.. అందులో పడిన వారు ఇప్పటి వరకు ఎవరూ బతికి బయటికి రాలేదు. స్థానికులు చెబుతున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు నలుగురు ఆ గుహలోకి వెళ్లి అస్థిపంజరాలుగా మారారు. వండాడి కొండపై మేతకు వెళ్లి తప్పిపోయిన గొర్రెలు ఏవీ తిరిగి రాలేదనే విషయాలను పశువుల కాపర్లు చెప్పడం విశేషం. అంతటి భయానకమైన లోయలో పడిన చిన్నారులు ముగ్గురు చిరంజీవులుగా బయట పడ్డారు. లోయలో నుంచి బయటపడిన చిన్నారులు మాట్లా డుతూ అమ్మనాన్నలను చూస్తామనుకోలేదని కంటతడి పెట్టుకున్నారు.
రాయచోటి టౌన్ : రూరల్ పరిధిలోని మాధవరం వడ్డెపల్లెకు చెందిన ముగ్గురు చిన్నారులు సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి ఆడుకొంటూ గ్రామ సమీపంలోని వండాడి కొండపైకి వెళ్లారు. కేరింతలు కొడుతూ బండలపై దూకుతూ కొండ చివరి వరకు వెళ్లారు. అప్పటికే సాయంత్రం అయింది. ఇక చాలు ఇంటికి పోదాం రండిరా అని పెద్దోడు రెడ్డిబాబు తమ్ముడు సురేష్‌బాబుకు, బావమర్ధి గిరిబాబుకు చెప్పాడు. వీరు ఇద్దరూ వెళ్లిన దారి గుండా తిరిగి వెనక్కు రాకుండా ఎదురుగా జారుడు బండపైకి దూకారు. దానిపై పాకుతూ వెళ్లితే త్వరగా కిందకు దిగేయచ్చు అనుకొన్నారు. కానీ అదే వారిని ఇరకాటంలో పడేసింది. జారుతూ వెళ్లిన ఇద్దరూ లోయలో పడిపోయారు. పెద్దవాడైన రెడ్డిబాబు కేకలు వేయడం మొదలు పెట్టాడు. (చీకటి గుహ నుంచి చిన్నారులకు విముక్తి)
మామిడి తోట రైతు పిల్లవాడి కేకలు విని..
కొండ కింద ఓ మామిడి తోట రైతు కేకలు విని ఆ కొండవైపు మేకలు తోలుకొచ్చేవారికి విషయం చెప్పాడు. మీ పల్లెకు చెందిన మేకలోళ్లు ఏమైనా ఇంటికి వచ్చారేమో ఒక సారి చూడమన్నాడు. అప్పటికే సాయంత్రం కావడంతో తమ పిల్లలు ఇళ్ల వద్ద లేరనే విషయం ఇరుగుపొరుగువారికి చెప్పడంతో విషయం అందరికీ అర్థమయింది. గ్రామంలోని చాలా మంది అక్కడికి వెళ్లి వారిని వెతికేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వీరి ప్రయత్నం విఫలం కావడంతో సాయంత్రం 6గంటల తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు రంగ ప్రవేశంతో..
అర్బన్ సీఐ రాజు వెంటనే తన సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకొని వెతికే ప్రయత్నం చేశారు. ఆ లోయలో పడిన వారు తిరిగి రారనే విషయం తెలియడంతో వీరిలో ఆందోళన మరింత ఎక్కువయ్యింది. మరుసటి రోజు చూద్దామనే మాటలు తల్లిదండ్రులలో ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు మాత్రం వారికి ధైర్యం చెబుతూ క్షణం క్షణం ఓ యుగంగా గడుపుతూ ఉన్న చిన్నారులను స్థానికుడు, తమ సిబ్బంది సాయంతో రోపులు వేసి ఆ లోయలోకి వెళ్లారు. అప్పటికే వెంకటరమణ, ప్రసాద్ అనే మరో ఇద్దరు గుహ వద్ద కాపలాగా ఉన్నారు. వెళ్లిన వారు రోపు సాయంతో ముగ్గురు చిన్నారులను బయటకులాగారు. అప్పటికే అర్ధరాత్రి దాటింది. మాధ వరం గ్రామంతో పాటు వండాడి గ్రామం, చుట్టుపక్కల నుంచి వందలాది ప్రజలు పిల్లలను చూడటానికి తరలి వచ్చారు.
దేవుడిలా మా బిడ్డలను కాపాడారు
లోయలో పడిపోయిన వారు ఎవరూ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అలాంటి చోట పడిన ఇక మా బిడ్డలు వస్తారనే నమ్మకం లేదు. పిల్లలను కాపాడేందుకు పోలీసులు, మా బంధువు మిలటరీ ఆయన వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేవుడిలా లోయలోకి వెళ్లి అర్థరాత్రి దాటాక మా బిడ్డలను పైకి తీసుకొచ్చారు. – సురేష్ బాబు, రెడ్డిబాబుల తల్లిదండ్రులు సరస్వతి, చలపతి
మా అమ్మను చూస్తాననుకోలేదు
లోయలో పడిపోయాక మా అమ్మకాడికి పోతా నని అనుకోలేదు. చాలా భయమేసింది. నీళ్ల దప్పి క..ఆకలితో ఎంత అరి చినా ఎవరూ పలకలేదు. దప్పికేసిన ప్రతి సారి మా అమ్మ వస్తుందని ఎదురు చూశాను. చూసి చూసి రాత్రి అయ్యింది. మా అన్న లోయపైన ఉన్నాడు. – సురేష్‌బాబు, లోయలో పడిన చిన్నారి
ప్రాణాలను లెక్కచేయకుండా..
వండాడి కొండపై ఆడుకొంటూ వెళ్లి లోయలో పడిపోయారు. అందులో నుంచి రారనుకున్నాం. మా బంధువు గంగాధర్, అర్బన్ సీఐ జి. రాజు, ఎస్‌ఐలు మహమ్మద్‌రఫీ, తాహీర్ హుస్సేన్‌లతో పాటు చాలా మంచి పోలీసులు కష్టపడ్డారు. ప్రాణాలకు తెగించి మా బిడ్డలను కాపాడారు. జీవితాంతం రుణపడి ఉంటాం. – గిరిబాబుతో తల్లి ప్రజాపతి
Comments
Please login to add a commentAdd a comment