
20 నుంచి రష్యా, చైనాల్లో మన్మోహన్ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మో హన్‌సింగ్ అక్టోబర్ 20న రష్యా, చైనాల పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని ఇరుదేశాలతో వ్యాపార, వాణిజ్య, ఇంధన రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అక్టోబర్ 20 నుంచి 22 వరకు రష్యాలో పర్యటించి, అనంతరం 22న రష్యా నుంచి చైనాకు ప్రధాని వెళ్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిపే చర్చల్లో భారత అణు పరిహార చట్టం, టెలికం తదితర రంగాల్లో రష్యా పెట్టుబడుల భద్రత తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్ట్ లోని 3, 4 యూనిట్లకు రియాక్టర్లను రష్యా సరఫరా చేయనున్న నేపథ్యంలో అణు పరిహార అంశం ప్రధాని పర్యటనలో కీలకం కానుంది.
డ్రాగన్‌తో...: ఈనెల 22న బీజింగ్ చేరుకోనున్న భారత ప్రధాని మన్మోహన్ చైనా ప్రధాని లీ కెకియాంగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అందులో చైనాతో వాణిజ్యానికి సంబంధించి భారత్ ఎదుర్కొంటున్న వాణిజ్యలోటు ప్రధానంగా చర్చకు రానుంది. ఆ లోటును తగ్గించేందుకు భారత ఎగుమతులను ప్రోత్సహించాలని, పారిశ్రామిక పార్క్‌ల ద్వారా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని చైనాను భారత్ కోరనుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటకల్లో చైనా ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై మన్మోహన్ పర్యటనలో ముందడుగు పడనుంది.