చినరాజప్పకు ‘డిప్యూటీ’
సాక్షి ప్రతినిధి, కాకినాడ :కొత్త రాష్ట్రపు తొలి మంత్రివర్గంలో జిల్లాకు పదోన్నతి దక్కింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఉప ముఖ్యమంత్రి పదవి.. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను వరించింది. ఆదివారం కొలువుదీరిన చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలో రాజప్ప ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో విభజన అనంతరం కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రంలో ఏర్పడిన తొలి ప్రభుత్వంలో జిల్లా నుంచి ఇద్దరికి ప్రాతినిధ్యం లభించినట్టయింది. అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడిగా 22 సంవత్సరాలు పని చేశారు.
ఆ పార్టీ చరిత్రలో ఇదో రికార్డు. ఉప్పలగుప్తం ఎంపీపీగా పనిచేస్తూ జెడ్పీలో విప్‌గా కూడా పనిచేశారు. పార్టీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు, వివాదరహితుడు కావడం రాజప్పకు కలిసి వచ్చి.. తన రాజకీయ జీవితంలో అత్యున్నత పదవిని చేపట్టగలిగారు. శాసనమండలిలో పార్టీ పక్షనేతగా ఉన్న యనమలకు మరోసారి కేబినెట్ హోదా లభించింది. తుని నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన యనమల 2009లో స్థానంలోనే ఓటమి పాలయ్యారు. అనంతరం రాజ్యసభకు వెళ్లాలని ఆశించినా.. ఎమ్మెల్సీ మాత్రమే కాగలిగారు. గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా, ఆర్థిక మంత్రిగా, పీఏసీ చైర్మన్‌గా పలు పదవులు నిర్వర్తించిన యనమల ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెంచుకున్నా చివరికి ఆ పదవి చినరాజప్పను వరించింది.