దోపిడీ అంటే ఇదేరా.. | Chintamaneni Prabhakar Corruption Special Story | Sakshi
Sakshi News home page

దోపిడీ అంటే ఇదేరా..

Published Wed, Dec 26 2018 7:40 AM | Last Updated on Wed, Dec 26 2018 7:41 AM

Chintamaneni Prabhakar Corruption Special Story - Sakshi

రౌడీషీటర్‌ ఎమ్మెల్యే అయ్యారు.. నియోజకవర్గాన్ని తన సామ్రాజ్యమని భావించుకున్నారు.. 2014లో టీడీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తోడేస్తుంటే అడ్డొచ్చిన మహిళాధికారిని జుట్టు పట్టుకుని లాగి పడేసి.. పిడిగుద్దులు కురిపించిదుశ్శాసనుడిని మరిపించారు.

ఈ దుశ్శాసనుడిని శిక్షించాల్సినప్రభుత్వ అధినేత దన్నుగా నిలవడమే కాదు.. విప్‌గా పదోన్నతి కల్పించి ప్రోత్సహించారు. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలంటూప్రశంసించారు. అంతే.. ప్రభుత్వ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకున్న ఆ ఎమ్మెల్యేఅరాచకాలకు.. ఆగడాలకు.. దోపిడీలకు..దౌర్జన్యాలకు నియోజకవర్గంలో అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఇంతకూఆ ఎమ్మెల్యే ఎవరనుకుంటున్నారా..మన దెందులూరు శాసనసభ్యుడు‘చింతమనేని ప్రభాకర్‌’.

పశ్చిమగోదావరి, సాక్షి–టాస్క్‌ఫోర్స్‌ :పెదవేగి మండలం దుగ్గిరాలకు చెందిన చింతమనేని ప్రభాకర్‌ రెండెకరాల రైతు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ.. సంఘ విద్రోహ పనులు చేస్తుండటంతో ఆయనపై పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. 1995 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీటీసీగా ఎన్నికైన చింతమనేని ప్రభాకర్‌.. ఎవరూ ఊహించని రీతిలో పెదవేగి మండలాధ్యక్షుడిగా ఎన్నియ్యారు. ఈ రౌడీషీటర్‌కు 2009 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఏరికోరి టీడీపీ టికెట్‌ ఇచ్చి దెందులూరు నుంచి బరిలోకి దించారు. ఆ ఎన్నికల్లో తన దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి.. అసెంబ్లీలోకి అడుగుపెట్టిన చింతమనేని 2014 వరకూ నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉండి కూడా పలు దాడులకు పాల్పడ్డారు. 2014 ఎన్నికల్లోనూ దెందులూరులో చింతమనేనికి మళ్లీ టికెట్‌ ఇచ్చారు. ఎన్నికల్లో యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడి.. రెండోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఆయన టీడీపీ సర్కార్‌ అధికారంలోకి రావడంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పంచభూతాలను దోపిడీ చేసి కేవలం నాలుగున్నరేళ్లలో రూ.2,000 కోట్లకుపైగా కొల్లగొట్టారని ఆ నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. చింతమనేని అరాచకాలకు జిల్లా ఉన్నతాధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఆయన ఆగడాలపై కేసులు పెట్టడానికి పోలీస్‌స్టేషన్‌లకు వెళ్తే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం లేదని బాధితులు చెబుతున్న వ్యాఖ్యలే అందుకు తార్కాణం.

పోలవరం కుడి కాలువలో మట్టి స్వాహా
దెందులూరు నియోజకవర్గం పరిధిలో పోలవరం కుడి కాలువ 16 కిలోమీటర్ల పొడవునా తవ్వారు. కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని ఇరు వెపులా అటు వంద, ఇటు వంద మీటర్లు వెడల్పు, దాదాపు 30 అడుగుల ఎత్తున గుట్టలుగా పోశారు. ఈ మట్టి విక్రయానికి పోలవరం అధికారులు టెండర్లు పిలుస్తారు. అయితే 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి అనుమతి లేకుండానే పోలవరం కుడి కాలువ నుంచి లక్షలాది క్యూబిక్‌ మీటర్ల మట్టిని అక్రమంగా తరలించి.. క్యూబిక్‌ మీటర్‌ రూ.800 నుంచి రూ.900 చొప్పున విక్రయించి రూ.200 కోట్లకుపైగా దోచుకున్నారు.  ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన పోలవరం కుడికాలువ పర్యవేక్షక ఇంజినీర్, ఆయన సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేనిపై కేసులు పెట్టే సాహసం చేయని ఈ అధికారులు.. ఆయన వ్యతిరేకులు, ఏదైనా సొంతఅవసరాలకు ఒకటో, రెండో ట్రాక్టర్లు గ్రావెల్‌ తరలిస్తే వారిపై కేసులు పెడుతున్నారు. చింతమనేని మట్టి దోపిడీపై పోలవరం కుడికాలువ అధికారులకు ఫిర్యాదు చేసిన గార్లమడుగు మాజీ సర్పంచ్‌ మేడికొండ వెంకట కృష్ణారావుపై చింతమనేని, అతని అనుచరులు దాడిచేసి, తీవ్రంగా గాయపరచడం ఆయన అరాచకాలకు పరాకాష్ట. ఈ వ్య వహారాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చింతమనేని నాలుగున్నరేళ్లుగా దోపిడీ చేయగా వదిలేసిన మట్టి.. అదీ కాలువ 85 కి.మీ. నుంచి 87 కి.మీ. వరకూ ఉన్న మట్టిని విక్రయించడం కోసం ఇటీవల టెండర్లు పిలవడం గమనార్హం.

రిజర్వాయర్‌ పేరుతో భూములు  కబ్జా చేసి గ్రావెల్‌ దోపిడీ
పెదవేగి మండలం సూర్యారావుపేట తదితర 11 గ్రామాలకు చెందిన 60 మంది పేదలకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున ప్ర భుత్వం పంపిణీ చేసింది. ఈ అసైన్డు భూమిపై ఎమ్మెల్యే చింతమనేని కన్నుపడింది. ఆ భూమిలో రిజర్వాయర్‌ తవ్వి స్తానని, దీని వల్ల సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆ ప్రాంత ప్రజలను నమ్మించారు. ఈ రిజర్వాయర్‌కు పోలవరం కుడికాలువ నుంచి నీటిని ఎత్తిపోయిస్తామని న మ్మబలికారు. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ తానే పరిహారంగా ఇచ్చి లాక్కున్నారు. ఆ ప్రాంతంలో రిజర్వాయర్‌ తవ్వుతామని నమ్మించేందుకు జిల్లా ఉన్నతాధికారి ఒకరిని ఆ ప్రాంతానికి రప్పించారు. ఆ తర్వాత తన అనుచరగణంతో ఆ భూమిలో గ్రావెల్‌ తవ్వించి..  యూనిట్‌ రూ.500  చొప్పున ట్యాక్స్‌ కట్టించుకుని విక్రయిస్తూ రసీదులు ఇస్తున్నారు. ఈ ట్యాక్స్‌ చింతమనేని జేబులోకి వెళ్తుంది. ఈ ట్యాక్స్‌ రూపంలో 2015 నుంచి రూ.150 కోట్ల మేర కొల్లగొట్టారని అంచనా.

పారిశ్రామికవాడ పేరుతో 350 ఎకరాలు ఆక్రమణ
పారిశ్రామికవాడ పేరుతో తాము సాగు చేస్తున్న అటవీ భూములను ఎమ్మెల్యే చింతమనేని కబ్జా చేశారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదపాడు మండలం వట్లూరు పెద చెరువులోని 350 ఎకరాలను ఎమ్మెల్యే చింతమనేని స్వాధీనం చేసుకుని వేం టెక్నాలజీ సంస్థకు అప్పగించారు. ఇప్పటికీ అక్కడి రైతులకు ఒక్క పైసా కూడా నష్టపరిహారం చెల్లించలేదు. తాజాగా 2014లో పేదలకు çపంపిణీ చేసిన భూములను మధ్యలోనే రద్దు చేయించి.. వాటిని సాగు చేసుకుంటున్న వారిని బలవంతంగా ఖాళీ చేయించారు. ఈ భూముల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న 3 ఇళ్లను కూడా స్వయంగా చింతమనేని కూల్చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ భూమిని ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కు బదలాయించి.. భారీ ఎత్తున లబ్ధి పొందేందుకు చింతమనేని కుట్ర పన్నారు. చింతమనేనికి జిల్లా ఉన్నతాధికారి ఒకరు పూర్తిగా వత్తాసు పలుకుతుండటం గమనార్హం.

భారీ ఎత్తున భూముల కబ్జా
ఎమ్మెల్యే చింతమనేని నియోజకవర్గంలో భారీ ఎత్తున భూములను కబ్జా చేశారు. గార్లమడుగు పంచాయతీ వెంకటకృష్ణాపురంలోని గుమిడిగుంటలో చోటుచేసుకున్న ఉదంతం వాటికి పరాకాష్ట. పొనమాటి సర్వేశ్వరరావు, లక్ష్మణరావు అన్నదమ్ములు. వీరికి ఆరు ఎకరాల పొలం ఉంది. ఇందులో  రెండెకరాలు పోలవరం కుడికాలువ కోసం సర్కార్‌ సేకరించింది. మిగిలిన నాలుగెకరాల భూమిలో ఒక పక్కన ఇళ్లు కట్టుకుని ఎప్పటి నుంచో జీవనం సాగిస్తున్నారు. కానీ.. ఆ పొలాన్ని వారి సోదరి అనసూయ గుడికి దానంగా రాసి ఇచ్చిందని.. కాబట్టి పొలాన్ని, ఉన్న ఇంటిని ఖాళీ చేయాలని ఎమ్మెల్యే చింతమనేని తన అనుచరులతో బెదిరించారు. దీనికి వారు ఎదురుతిరిగారు. దాంతో రంగంలోకి దిగిన చింతమనేని స్వయంగా పొక్లెయిన్‌ రప్పించి ఇంటిని కూలగొట్టాడు. కూల్చిన ఇంటి నుంచి కిటికీలు, గుమ్మాలు సైతం తీసుకుపోయారు. పొలం చుట్టూ ఫెన్సింగ్‌ వేసి లోపలకు వస్తే మీ అంతు చూస్తానంటూ ఆ అన్నదమ్ములను భయభ్రాంతులకు గురిచేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదు. ఈ భూమి విలువ రూ.2 కోట్లకుపైగా ఉంటుంది.

ఇసుక, మట్టి దోపిడీ కోసం 500 టిప్పర్ల కొనుగోలు
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. నియోజకవర్గంలో మట్టి, ఇసుక దోపిడీపై ఎమ్మెల్యే చింతమనేని కన్నేశారు. బినామీ పేర్లతో 500 టిప్పర్లను ఫైనాన్స్‌ సంస్థ నుంచి రుణం తీసుకుని కొనుగోలు చేశారు. పెదవేగి మండలం నడిపల్లి, విజయరాయి, జానంపేట, తమ్మిలేరు పరివాహక ప్రాంతంలో 2009 నుంచే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అక్రమంగా ఇసుకను తవ్వేసి విక్రయిస్తూ అక్రమార్జన సాగించేశారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెలరేగిపోయారు. తమ్మిలేరులో భారీ ఎత్తున పొక్లయిన్‌ల ద్వారా ఇసుకను తవ్వేసి.. టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ యూనిట్‌ ఇసుకను రూ.800 చొప్పున హైదరాబాద్, విజయవాడ, విశాఖçకు తరలిస్తూ సహజ సంపదను కొల్లగొట్టారు. డ్వాక్రా సంఘాల ముసుగులో అనుమతి లేకుండా ఇసుకను తవ్వేస్తుండటంతో ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షి అడ్డుకునేందుకు యత్నించారు. తన అక్రమార్జనకు అడ్డొచ్చిన వనజాక్షి జుట్టు పట్టుకుని.. ఈడ్చీపారేసి పిడిగుద్దులు కురిపించిన అభినవ దుశ్శాసనుడిగా చింతమనేని గుర్తింపు పొందారు. ప్రభుత్వ అధికారిపై దాడికి దిగిన చింతమనేనిని కఠినంగా శిక్షించాల్సిన సీఎం చంద్రబాబు.. దుప్పటి పంచా యతీ చేసి వనజాక్షిని మందలించి.. చింతమనేనికి విప్‌ పదవి ఇచ్చి సత్కరించడంతో ఆయన అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. నాలుగున్నరేళ్లలో ఒక్క తమ్మిలేరులో ఇసుకను అక్రమంగా విక్రయించడం ద్వారానే రూ.250 కోట్లకుపైగా చింతమనేని ప్రభాకర్‌ కొల్లగొట్టినట్లు అంచనా.

పోలవరం అధికారులు చేతులు దులుపుకున్నారు
కాదేది కబ్జాకు అనర్హం అన్న చందంగా ఎమ్మెల్యే చింతమనేని వ్యవహరిస్తున్నారు. పోలవరం కుడికాలువ నుంచి మట్టిని తరలించిన తర్వాత.. ఖాళీగా ఉన్న కాలువ భూమిని చదును చేసి, దర్జాగా పశుగ్రాసం పెంచుతూ తన వద్ద ఉన్న పాడి పశువులకు మేతగా తరలిస్తున్నారు. సమీపంలోని పాడి పశువుల పెంపకందారులకూ విక్రయిస్తున్నారు.  ఏకంగా పోలవరం కాలువ గట్లను చదునుచేసి చింతమనేని సాగు చేస్తున్నా.. ఆ విషయం తమ దృష్టికి రాలేదంటూ పోలవరం అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.
 పెదవేగి మండలంలో లక్ష్మీపురంలో సర్వే నంబర్‌ 31/1లో 2.40 ఎకరాల్లో వలసకుంట చెరువు ఉండేది. దీనిని జమిందార్ల చెరువుగా పిలిచేవారు. రాత్రికి రాత్రి చింతమనేని తన అనుచరులతో పోలవరం కుడి కాలువ నుంచి మట్టిని తరలించి పూడ్చేయించారు. ఈ చెరువును పూడ్చివేసిన స్థలం పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చింతమనేని చెప్పినా ఇప్పటివరకూ ఒక్కరికీ ఒక్క సెంటు స్థలం కూడా కేటాయించకపోవడం గమనార్హం.  పూడ్చిన ఈ చెరువులో కాసరనేని పృధ్వీ పేరు మీద ఒక బోరు తవ్వించారు. ఈ బోరు నుంచి పైపుల ద్వారా దూరంగా ఉన్న పొలాలకు నీటిని తరలిస్తున్నారు.

బినామీలతో కొల్లేరు భూములపై కన్ను
దెందులూరు నియోజవకర్గం పరిధిలో మొండికోడు, పైడిచింతపాడు, పెదయాగనిమిల్లి, కోమటిలంక తదితర 14 కొల్లేరు గ్రామాల ప్రజలు అభయారణ్యం పరిధిలో గతంలో సాగు చేసిన వెయ్యి ఎకరాల సొసైటీ చెరువులను సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం ధ్వంసం చేసింది. కానీ.. ఎమ్మెల్యే చింతమనేని వాటిని మళ్లీ తవ్వించారు. 2016–17 మే నెలలో తవ్విన ఈ చెరువుల్లో చేపలు, రొయ్యలు సాగు చేపట్టారు. దీనిపై సొసైటీ సభ్యులు నిలదీస్తే నామమాత్రం లీజు డబ్బు చెల్లిస్తానంటూ నమ్మబలికారని.. రెండేళ్లుగా ఒక్కపైసా కూడా చెల్లించడం లేదని బాధితులు చెబుతున్నారు. దీనిపై బాధితులు ఏలూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రెండు నెలల క్రితం రిలే నిరాహార దీక్ష చేశారు. దాంతో వారిపై ఏలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును చింతమనేని బనాయించారని అంటున్నారు.

దోపిడీ అంటే ఇదేరా..
నియోజకవర్గంలో పరిధిలో సాగునీటి ప్రాజెక్టుల దగ్గర నుంచి పంచాయతీ రాజ్‌ శాఖ చేపట్టే రోడ్ల పనుల వరకూ ఏ పనిలోనైనా పది శాతం చొప్పున చింతమనేనికి ట్యాక్స్‌ కట్టాల్సిందే. ట్యాక్స్‌ కట్టకుంటే పనులు చేయకుండా అడ్డుకుంటారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
ఉపాధిహామీ, నీరు–చెట్టు కింద చెరువుల్లో పూడిక తీసిన మట్టి (గ్రావెల్‌)ని విక్రయిస్తూ వందల కోట్ల రూపాయలను అనుచరులతో కలిసి చింతమనేని దోచుకుంటున్నారు. ఇదే గ్రావెల్‌తో పంచాయతీరాజ్‌ శాఖ చేపట్టే రహదారులను నిర్మించి.. బిల్లులు చేసుకున్నారు.
నియోజవకర్గంలో మద్యం దుకాణాల లైసెన్సులను ఎవరినీ దరఖాస్తుచేయకుండా అడ్డుకుని.. తన బినామీలతో వాటిని దక్కించుకుని..
కమీషన్లు తీసుకుని ఇతరులకు కట్టబెట్టారు. వాటికి అనుబంధంగాఊరూరా బెల్ట్‌షాపులు ఏర్పాటు చేయించి.. అధిక ధరలకు మద్యాన్నివిక్రయిస్తూ దోచుకుంటున్నారు.
నియోజకవర్గంలో ఏ మండలంలోనైనా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే ఎకరాకు రూ.2 లక్షల చొప్పున చింతమనేని ట్యాక్స్‌ చెల్లించాలని ప్రజలు చెబుతున్నారు. ట్యాక్స్‌ కట్టిన తర్వాత ఎమ్మెల్యే అనుమతి ఇస్తేనే తహసీల్దార్లు భూమిని బదలాయించే ప్రక్రియను ప్రారంభిస్తారు.
ఏ గ్రామంలోనైనా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కావాలంటే రూ.50 వేలు, బోరు బావి తవ్వుకోవాలంటే రూ.లక్షను చింతమనేని ట్యాక్స్‌గా చెల్లించాల్సిందే. పెదపాడు మండలం నాయుడుగూడెం నుంచి వడ్డిగూడెంకు విద్యుత్‌ లైన్‌ ఏర్పాటుకు ఎకరాకు రూ.2 వేలు చొప్పున చింతమనేని ట్యాక్స్‌ వసూలు చేసినట్టు ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు.
ఇలా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో చింతలపూడి నియోజకవర్గంలో నామవరం పంచాయతీ పట్టాయిగూడెంలో రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూమి 125 ఎకరాలు ఎమ్మెల్యే చింతమనేని బినామీ పేరిట కొనుగోలు చేశారని టీడీపీ నేతలే చెబుతుండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement