
కొఠారు రామచంద్రరావు ఇంటి ముందు నుంచి వేస్తున్న విద్యుత్ హెచ్‌టీ లైన్
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు, పెదవేగి: దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కన్వీనర్‌గా ఉన్న కొఠారు అబ్బయ్య చౌదరి కుటుంబంపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ తనదైన శైలిలో కక్షసాధింపు చర్యలకు దిగారు. దీనికోసం ట్రాన్స్‌కోను అడ్డం పెట్టుకున్నారు. హైటెన్షన్ వైర్లను అబ్బయ్యచౌదరి ఇంటిమీదుగా తీసుకువెళ్లాలని ఒత్తిడి తెచ్చారు. ఇంటి ముందు నుంచి వెళ్లడం వల్ల ప్రమాదమని, కేబుల్ వైరు వేయాలని అబ్బయ్యచౌదరి ట్రాన్స్‌కో సీఎండీతో మాట్లాడారు. ఆయన ఒప్పుకున్నా చింతమనేని ప్రభాకర్ అధికారులను ఇంటికి పిలిచి మరీ వార్నింగ్ ఇవ్వడంతో వారు చేతులెత్తేశారు. దీంతో పార్టీ అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు ఆందోళనకు దిగడంతో పెదవేగి మండలం కొండలరావుపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆందోళన కొనసాగడంతో సాయంత్రం అధికారులు వెనుతిరిగారు. సంఘటనా స్థలంలో ఉన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించేందుకు ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. తనకు ఎదురుతిరిగిన వారిపై ఎస్సీఎస్టీ కేసులు పెట్టించడం చింతమనేనికిఅలవాటే. దీనిలో భాగంగా గతంలో కూడా తమ్మిలేరులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న సమయంలో కూడా ప్లొక్లయిన్ డ్రైవర్‌తో ఎస్సీఎస్టీ కేసు పెట్టించే ప్రయత్నం చేశారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో తాజాగా హైటెన్షన్ వైర్ల వ్యవహారాన్ని ఉపయోగించుకుని తప్పుడు కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే... మూడు నెలల క్రితం కొండలరావుపాలెంలోకి హెచ్‌టి విద్యుత్‌లైన్ తీసుకువెళ్లే నిమిత్తం కిలో మీటరు దూరం కొఠారు పొలం పక్క నుంచే వేసి ఆ తరువాత టేకు చెట్లు, కొఠారు ఇళ్లు అడ్డుగా ఉన్నాయన్న ఉద్దేశంతో విద్యుత్‌శాఖ సిబ్బంది రోడ్డుకు రెండవ వైపు విద్యుత్ స్తంభాలు పాతుకుంటూ వెళ్లారు. అదే సమయంలో గ్రామదర్శిని కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే దీన్ని చూసి అధి కారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వైర్లు కొఠారు ఇంటిపై నుంచి వేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఇళ్ల మీద హెచ్‌టీ లైన్ వేస్తే ఇబ్బంది వస్తుందని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈనెల 19న స్టే వెకేట్ చేయడంతో దానిపై రివ్యూ పిటీషన్ వేసారు. ఈలోగా పోలీస్ వారి సహాయంతో విద్యుత్‌శాఖ అధికారులు దౌర్జన్యంగా విద్యుత్ లైన్ వేయడానికి మూడు రోజుల క్రితం ప్రయత్నించారు. దీన్ని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకోవడంతో అధికారులు వెనుతిరిగారు.
కొఠారు ఈ విషయాన్ని ట్రాన్స్‌కో సీఎండీతో మాట్లాడగా ఇన్సులేటెడ్ కేబుల్ వేస్తామని, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. గ్రామానికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉండవన్న ఉద్దేశంతో 200 మీటర్లు ఇన్సులేటెడ్ కేబుల్ వేసేందుకు అధికారులతో మాట్లాడి ఒప్పించారు. మళ్లీ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే చింతమనేని విద్యుత్ శాఖాధికారులను పిలిచి ఇన్సులేటెడ్ కేబుల్ కొఠారు ఇంటి వద్ద వేస్తే, నియోజకవర్గం మొత్తం వేయాలని ఒత్తిడి చేయడంతో చేసేది లేక అధికారులు కొఠారు ఇంటి ముందు వేసిన కేబుల్‌ను పోలీస్ సాయంతో తీసే ప్రయత్నం చేసారు. దీన్ని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావుతో పాటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఇళ్ల మీద హెచ్‌టి లైన్ ప్రమాదకరమని చెప్పినా, బలవంతంగా మమ్మల్ని ఒప్పించి, వేసిన లైన్ మళ్లీ ఇప్పుడు తీయడం సరికాదని కొఠారు అన్నారు. సాయంత్రం వరకూ ఆందోళన కొనసాగించారు. చివరికి విద్యుత్ అధికారులు, పోలీసులు అక్కడ నుంచి వెనుదిరిగారు.