రాజీనామా అస్త్రాన్ని సంధించిన చింతమనేని!
- ఉదయమే పార్టీని పెడతానని ప్రకటన
అమరావతి: మంత్రివర్గంలో తనకు చోటు కల్పించకపోవడంతో రగిలిపోతున్న టీడీపీ సీనియర్ నేత, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన పదవులకు రాజీనామా చేశారు. ఉదయమే మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన ఆయన.. సాయంత్రం తన పదవులకు రాజీనామా చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ పదవితోపాటు ఎమ్మెల్యే పదవికి సైతం చింతమనేని రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శిని కోరి మరీ రాజీనామా లేఖలు అందించారు.
పార్టీ కోసం ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదనే ఆవేదనతో ఉన్న చింతమనేని ఉదయమే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అవసరమైతే కొత్త పార్టీ పెడతానని కూడా ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో అసమ్మతితో రగిలిపోతున్న ఆయనను పిలిపించి బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు.