సాక్షి, చీరాల(ప్రకాశం) : రుచికరమైన ఆహారాన్ని తృప్తిగా తిన్న తర్వాత ఒక కిళ్లీ వేసుకుంటే ఆ కిక్కే వేరు.! ఏ శుభకార్యమైనా భోజనం తర్వాత స్వీట్, సాదా కిళ్లీ వేయడం సహజం. అయితే కిళ్లీల్లో కూడా వెరైటీలు ఉన్నాయి. అందులో డ్రైఫ్రూట్ కిళ్లీ ప్రత్యేకమైనది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ప్రాచుర్యం ఉన్న ఈ డ్రైఫ్రూట్ కిళ్లీ జిల్లాలు దాటి చీరాలకు వచ్చింది. స్థానిక స్టేషన్ రోడ్‌లోని తాజ్ కిళ్లీ దుకాణంలో డ్రైఫ్రూట్ కిళ్లీని ప్రత్యేకంగా అందిస్తున్నారు.
చీరాలలో స్వీట్ సమోసా, పుల్లయ్య బజ్జీలు, పట్టాభి స్వీట్లు ఫేమస్. వీటి కోసం రోజూ ప్రజలు ఎదురుచూస్తారు కూడా. వాటి సరసన ఇప్పుడు డ్రైఫ్రూట్ కిళ్లీ కూడా చేరింది. ఎలా వచ్చిందంటే.. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువగా వినియోగించే డ్రైఫ్రూట్ కిళ్లీని చీరాల వాసులకు కూడా రుచి చూపించాలని భావించాడు పాన్‌షాపు నిర్వాహకుడు బ్రహ్మం. డ్రైప్రూట్ కిళ్లీలో ఏం వాడతారో తెలుసుకుని వాటిని చీరాల తెప్పించాడు. హైదరాబాద్ నుంచి పలు రకాల ఫ్లేవర్లు కూడా తీసుకొచ్చాడు.
స్వీట్ కిళ్లీలో సున్నం, వక్కతోపాటు పలు రకాల సుగంధ ద్రవ్యాలు వేస్తుంటారు. అదే డ్రైప్రూట్ కిళ్లీకి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. సున్నం, వక్కతో పాటు కిస్‌మిస్, బాదం, జీడిపప్పు, కర్జూరం, తేనె, కొబ్బరిపొడి, బాదం పొడి, పలు రకాల ఫ్లేవర్లు వేస్తారు. సుగంధ ద్రవ్యాలతో పాటు డ్రైఫ్రూట్స్‌ను అందంగా అలంకరించడం ప్రత్యేక ఆకర్షణ. డ్రైఫ్రూట్ కిళ్లీ తయారీకి రూ.20 వరకు ఖర్చవుతుండగా రూ.25కు విక్రయిస్తున్నారు. కిళ్లీ రుచి చూసిన పలువురు శుభకార్యాలకు ఆర్డర్లు ఇస్తున్నారని షాప్ నిర్వాహకుడు బ్రహ్మం సంతోషంగా చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment